ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా.. షిండే, పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. కాగా, నేడు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయనే సస్పెన్స్ నెలకొంది.
మహారాష్ట్రలోని నాగపూర్‌లో నేడు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న పార్టీలకు ఏయే శాఖలు దక్కుతాయనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. కేబినెట్‌లో ఎక్కువ స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. ఇక, శివసేన నుంచి 13 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది.
ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి పలువురు కొత్త ముఖాలు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. సంజయ్ శిర్సత్, భరత్ గోగావాలే, ప్రకాష్ అబిత్కర్, యోగేష్ కదమ్, ఆశిష్ జైస్వాల్, ప్రతాప్ సర్నాయక్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో శివసేన నుంచి మంత్రులుగా ఉన్న దీపక్ కేసర్కర్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్‌తో సహా కొంత మందికి కేబినెట్‌లో స్థానం లేనట్టుగా సమాచారం.
మరోవైపు.. కూటమిలోని ఎన్సీపీకి చెందిన అదితి తట్కరే, బాబాసాహెబ్ పాటిల్, దత్తాత్రే భరణే, హసన్ ముష్రిఫ్, నరహరి జిర్వాల్‌లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, బీజేపీ నుంచి నితేష్ రాణే, శివేంద్ర రాజే, గిరీష్ మహాజన్, మేఘనా బోర్దికర్, పంకజా ముండే, జయకుమార్ రావల్, మంగళ్ ప్రభాత్ లోధాకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.
ఇక, మహాయుతి ప్రభుత్వంలో కాషాయ పార్టీకి 20 కేబినెట్ బెర్త్‌లు కేటాయించబడినప్పటికీ అన్ని స్థానాలను భర్తీ చేయడంలేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు ఆయా స్థానాలను వదిలేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీకి హోంశాఖ.. శివసేనకు హౌసింగ్ మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment