ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలకబూనిన షిండే.. ఎట్టకేలకు ముంబై చేరుకున్నారు. దీంతో.. మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక.. బీజేపీ నేతృత్వంలోనే ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వంలో షిండే, అజిత్ పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖరారైంది. దీనిపై రేపు కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని కూటమి నేతలు చెప్తున్నారు.
మహారాష్ట్ర నూతన సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ వేదిక కానుంది. అయితే మహాయుతి కూటమిలో.. ఏ పార్టీ ఎన్ని పోర్టుపోలియోలు ఆశిస్తుందనే అంచనాలతో జాతీయ మీడియా సంస్థలు, అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.
బీజేపీ(132 సంఖ్యా బలం) : ముఖ్యమంత్రితో పాటు హోం,రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలను దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్,శాసనమండలి చైర్మన్ పదవులను కూడా ఆశిస్తోంది.
శివసేన(57): ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన.. తమకు 16 మంత్రిత్వ శాఖలను కేటాయించాలని పట్టుబడుతోందంట. వాటిల్లో పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్నింటికి బీజేపీ ఓకే చెబుతుందో చూడాలి. మరోవైపు.. గత అసెంబ్లీలో శాసనసభ డిప్యూటీ చైర్మన్ పదవి శివసేన చేతుల్లో ఉండగా.. ఈసారి శాసనమండలి చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.
ఎన్సీపీ(41): అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం.. తాము సీఎం సీటును త్యాగం చేశామనే ప్రకటనలు ఇచ్చుకుంది. వాటి ఆధారంగా కీలక శాఖలనే కోరే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ, శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌తో సహా 9 నుంచి 10 మంత్రిత్వ శాఖలు కావాలని పట్టుబడుతున్నట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.
బుధవారమైనా తేలుస్తారా?
ఆరు రోజులుగా మహారాష్ట్ర సీఎం పంచాయితీ ఎడతెగకుండా నడుస్తోంది. అయితే.. మహాయుతిలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాకు మరోసారి ఓకే అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. వీటిపై బుధవారం ఉదయం స్పష్టత రానుంది. ఎందుకంటే.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ శాసన సభా పక్షం బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తారన్నది ఆ కథనాల సారాంశం.
ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం
మహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ ముస్తాబవుతోంది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మహాయుతి కూటమి నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే మంత్రి వర్గ కూర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment