ముంబై : మహా రాజకీయంలో మరో సస్పెన్స్‌కు శుభం కార్డు పడింది. ‘నేను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానో? లేదో?’ అంటూ బాంబు పేల్చిన ఏక్‌నాథ్ షిండే మళ్లీ వెనక్కి తగ్గారు. రేపు (డిసెంబర్5) మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని శివసేన నేతలు ప్రకటించారు.
మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనం విజయం సాధించింది. అనంతరం, మహా ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. సీఎం పదవి కోసం చివరి నిమిషం వరకు శివసేన నుంచి షిండే, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుంది. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించింది. బీజేపీ అధిష్టానం బుధవారం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, ఈ వరుస పరిణామలపై అలబూనిన షిండే.. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు బుధవారం మహాయుతి కూటమి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వేదికైంది.
నూతన ప్రభుత్వ ఏర్పాటుకై గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఆహ్వానించారు. అనంతరం మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్,ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ల మధ్య జరిగిన చర్చ అనేక అనుమానాలకు దారి తీసింది.
సీఎం పదవికి నేనే సిపారసు చేశా
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏక్‌నాథ్ సిండే మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవికి ఫడ్నవీస్‌ను నేనే సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు.
బాంబు పేల్చిన షిండే
అనంతరం, రేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.
అజిత్ పవార్‌పై షిండే సెటైర్లు
షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్ పవార్ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగిన మీడియా కాన్ఫరెన్స్ కాస్తా.. అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది. అయితే..
అజిత్ కామెంట్లకు షిండే సెటైర్లు వేశారు. అజిత్ దా(అజిత్ పవార్)కి ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. రెండు సార్లు ఎలా ప్రమాణం చేయాలో ఆయనకు తెలుసు అని అన్నారు. షిండే అలా అనడంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment