
ముంబై: మహారాష్ట్ర పూణేలోని ఓ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో దారుణం జరిగింది. నిలిపి ఉన్న బస్సులో నిందితుడు.. యువతిపై దారుణానికి ఒడిగట్టాడు . ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర అధికార శివసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌లు ఈ తరహా దారుణాలకు పాల్పడే నిందితుల్ని ఉరితీయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
బస్సులో జరిగిన దుర్ఘటనపై మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి చెందిన పార్టీ నేతలు గురువారం స్వర్‌గేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన బాట పట్టారు. మహా ప్రభుత్వం మహిళల భద్రత కంటే ఉచితాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ తరుణంలో బస్సు దుర్ఘటనపై ఏక్‌నాథ్ షిండే స్పందించారు. పుణే ఘటన చాలా దురదృష్టకరం. నిందితులు ఎవరైనా ఉపేక్షించబోం. అలాంటి వారిని ఉరితీయాలి’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు అజిత్ పవార్ సైతం దారుణంపై మీడియాతో మాట్లాడారు. స్వర్గేట్ బస్ స్టేషన్‌లో జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం, అవమానకరమైనది. నిందితుడు చేసిన నేరం క్షమించరానిది. ఇలాంటి నేరస్తులకు మరణశిక్ష తప్ప మరొకటి ఉండదు. దారుణంపై సమాచారం అందుకున్న వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయాలని పూణే పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.
ఇంటికి వెళ్లేందుకు.. బస్సు కోసం ఎదురు చూస్తూ
పూణేలోని నిత్యం రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో యువతిపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన యువతి మంగళవారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తోంది. అసలే ఆలస్యం అవుతుంది. బస్సులు కనిపించడం లేదని యువతి ఆందోళనకు గురైంది. ఆ సమయంలో బాధితురాలికి సమీపంలో దత్తాత్రేయ రాందాస్ గాడే (36) కనిపించాడు. బస్సులు రాకపోకల గురించి ఆరా తీసింది. సమీపంలో ఓ ఉన్న బస్సును చూపిస్తూ.. ఆ బస్సు మీ ఊరు వెళుతుందని నమ్మించే ప్రయత్నించాడు.
ప్లాట్‌ఫారమ్ మీదకు రావాల్సిన బస్సు ఆక్కడ ఎందుకు ఆగి ఉంది? ఆగి ఉంటే లైట్లు ఎందుకు ఆర్పేశారు? అని ఇలా ప్రశ్నించింది. దీంతో గాడే.. బస్సులో ప్రయాణికులు ఉన్నారని, అందరూ నిద్రలో ఉండడం వల్ల లైట్లు ఆర్పేశారు. కావాలంటే మీరే చూడండి అంటూ యువతిని నమ్మించాడు. గాడే మాటల్ని నమ్మిన యువతి బస్సు దగ్గరికి వెళ్లింది. ప్రయాణికులు ఉన్నారా? లేరా? అని చూసేందుకు బస్సు డోర్ ఓపెన్ చేసింది. వెంటనే నిందితుడు యువతిని బస్సు లోపలికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక‍్కడి నుంచి పరారయ్యాడు. తనపై జరిగిన దారుణాన్ని తన స్నేహితురాలికి చెప్పడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుడిపై పలు కేసులు
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గాలింపులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసుల గాలింపు చర్యల్లో బస్సులో యువతిపై అత్యాచారానికి పాల్పడింది 36ఏళ్ల దత్తాత్రయ రాందాస్ గాడే అని నిర్ధారించారు. గాడేపై గతంలో దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆ కేసుల్లో జైలు శిక్షను అనుభవించి 2019లో నుండి బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా, మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment