కూటమికి ఏక్‌నాథ్‌ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న.. | Maharashtra Ruling Alliance Rift Widens, Know What Sources Said About This | Sakshi
Sakshi News home page

కూటమికి ఏక్‌నాథ్‌ షిండే దూరం..? పొమ్మనలేక, పొగపెడుతున్న..

Published Tue, Feb 18 2025 8:45 PM | Last Updated on Wed, Feb 19 2025 8:39 AM

Maharashtra Ruling Alliance Rift Widens

ముంబై : ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయ్యిందో లేదో .. మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో లుకలుకలు మరోసారి   బయటపడ్డాయి. దీంతో కూటమి చీలిపోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంతకీ మహా రాజకీయాల్లో ఏం జరుగుతోంది.

మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి.మహాయుతి కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు,ఎంపీలకు వై కేటగిరీ భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు. భద్రత తగ్గింపులో కూటమిలో ఎన్సీపీ అజిత్‌ కుమార్‌ వర్గం కంటే.. శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గం నేతలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.  

2022లో ఏక్‌నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం 44 మంది ఎమ్మెల్యేలకు , 11 లోక్‌సభ ఎంపీలకు ‘వై’ కేటగిరి భద్రతను అందించింది. తాజాగా, ఆ భద్రతను తొలగించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో భద్రతా సమీక్షా కమిటీ జరిగింది. భద్రతా కమిటీ సమీక్షల ఆధారంగా.. ప్రజాప్రతినిధులకు వైకేటగిరి భద్రతను తొలగిస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్‌ వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరమైన జోక్యం లేదని స్పష్టం చేశారు.

అయినప్పటికీ మహాయుతి కూటమిలో మనస్పర్ధలు ఉన్నాయని, సీఎం దేవేంద్రఫడ్నవీస్‌ షిండేని దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా ఇటీవల అయితే, దావోస్‌ పర్యటనకు ముందు సీఎం ఫడ్నవీస్‌ ఎన్సీపీ,బీజేపీకి చెందిన నేతల్ని రాయ్‌గఢ్ రాయ్‌గఢ్, నాసిక్‌లకు ఇన్‌ఛార్జులుగా నియమించారు. అందులో శివసేన నేతలు లేకపోవడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌ఛార్జ్‌ల నియామకానికి బ్రేకులు పడ్డాయి. ఈ పరిణామాల వేళ..షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలకు భద్రతను కుదించాలని నిర్ణయించుకోవడం గమనార్హం.

మహాయుతి కూటమి లుకలుకలపై శివసేన (యూబీటీ)ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. మహాయుతి కూటమి ప్రేమికుల దినం జరుపుకుంటోంది అంటూ ఎక్స్‌ వేదికగా సెటైర్లు వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement