Devendra Phadanvis
-
‘మహా’ సీఎం పదవి.. ఫడ్నవీస్ ఆసక్తికర కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే కూటమి మహారాష్ట్రలో 288 స్థానాల్లో ఏకంగా 233 చోట్ల విజయాన్ని అందుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మహా సీఎం ఎవరు? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కూటమిలో ఎవరికి వారే తామే సీఎం రేసులో ఉన్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరు అనేది త్వరలోనే చెబుతామని చెప్పారాయన.తాజాగా సీఎం పదవిపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై మహాయుతిలోని మూడు పార్టీలు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై సమాధానం చెబుతాం. మూడు పార్టీలు నేతలు కలిసి సీఎంను ఎంపిక జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో తొందరపాటు ఏమీ లేదు. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం పదవి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఫలితాలు వెలువడిన రెండు వారాల తర్వాత సీఎంను ఎంపిక చేసినట్టు గుర్తు చేశారు.మరోవైపు.. మహాయుతి కూటమి నేతలు ముఖ్యమంత్రి పదవితో సహా మంత్రి పదవులపై కూడా ఫోకస్ పెట్టారు. మూడు పార్టీల నేతలు తమకు మంత్రి పదవులు కావాలని ఆశిస్తున్నారు. దీనిపై కూడా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. అయితే, మహారాష్ట్రలో సీఎంతో పాటు 43 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో 132 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో మంత్రి పదవుల్లో సగం వరకు కాషాయ పార్టీకే దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన పదవులను శివసేన, ఎన్సీపీ పంచుకునే ఛాన్స్ ఉంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరు? అనేది తేలకపోవడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సీటుపై పోటీ నెలకొందని ఎద్దేవా చేస్తున్నారు. కూటమిలో సీఎం ఎవరో తేల్చుకోలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. -
‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎవరివైపు.. ఓటర్లు తీర్పు... -
ఇక గద్దె దిగండి
బీజేపీ డిమాండ్ సాక్షి, ముంబై: అధికార పక్షాలు వెంటనే తక్షణమే తమ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవీస్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాసామ్య కూటమిని ప్రజలు తిరస్కరించారని స్పష్టమైంది. అందువల్ల ఆ కూటమి నాయకులకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి’ అని అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకుగాను తమ కూటమికి 42 స్థానాలు వచ్చాయి. కేవలం ఆరు స్థానాలతో ప్రజాసామ్యకూటమి చతికిలపడిపోయింది. దీన్నిబట్టి ప్రజలు ఎంతమేర ఆ కూటమిని అసహ్యించుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోంది. 23 స్థానాలు దక్కించుకున్న తమకు ఏకంగా 1.33 కోట్ల ఓట్లు లభించాయి. 2009 లోక్‌సభ ఎన్నికలలో మాకు సుమారు 70 లక్షల ఓట్లు వచ్చాయి. వాటితో పోలిస్తే ఈసారి సుమారు 53 లక్షలకుపైగా ఓట్లు అధికంగా వచ్చాయి. అదేవిధంగా 1977 ఎమర్జెన్సీ సమయంలోకూడా కాంగ్రెస్‌కు ఇంత దారుణపరాభవం చవిచూడలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాంగ్లీ, నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉండేది. అయితే ఈసారి అక్కడ కూడా మా పార్టీ విజయం సాధించింది. అక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. దీన్నిబట్టి రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్, ఎన్సీపీలను పూర్తిగా తిరస్కరించారని స్పష్టమవుతోంది. మరోవైపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా భూస్తాపితంచేశారు. మా ప్రభుత్వం కేంద్రంలో అధికాకార పగ్గాలు చేపట్టబోతోంది. అందువల్ల మన్ముందు రాష్ట్రంతోపాటు దేశానికికూడా మంచిరోజులు వస్తాయి’ అని అన్నారు. తమ కూటమిలో ఎటువంటి విభేదాలు లేవన్నారు. అమిత్ మార్గదర్శనంలోనే ముందుకు... ఐదు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మహాకూటమిని విజయపథంలో నడిపించడంపై భాగస్వామ్యపక్షమైన బీజేపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నరేంద్రమోడీకి అత్యంత ఆప్తుడైన అమిత్‌షా మార్గదర్శనంలో ముందుకు సాగనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర వెల్లడించారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి అధికారంలోకి రాకుండా మోడీ రాజకీయ నిశిత దృష్టిని గ్రహించేందుకు ఆయన సలహాదారుడు అమిత్‌షా సహాయం తీసుకుంటారా అని మీడియా ప్రశ్నించగా కచ్చితంగా తీసుకుంటామని ఆయన జవాబిచ్చారు. వడగండ్ల వానలు కురిసినా రైతాంగాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వారికి ఎటువంటి సహాయమూ చేయలేదన్నారు. అందువల్లనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ప్రతీకార వైఖరిని అవలంబించబోమని మోడీ ముందే చెప్పారని, అందువల్ల కేంద్రం నుంచి నిధులు అందుతాయన్నారు. తమ పార్టీ ఎంపీలు ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో సమావేశమవుతారన్నారు. మోడీని త్వరలోనే కలిసి వడగండ్ల బాధితులకు చేయూత అందించాల్సిందిగా కోరతామన్నారు. -
విదర్భను చేరిస్తేనే మద్దతివ్వండి
ప్రత్యేక విదర్భ ఉద్యమాన్ని ముందుకు నడిపే దిశగా ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా విదర్భ ప్రాంత ప్రజల మనోభావాలను మంగళవారం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. విదర్భ బిల్లును చేరిస్తేనే ప్రతిపాదిత ప్రత్యేక తెలంగాణ బిల్లుకు మద్దతు పలకాలని కోరారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టే బిల్లులో సవరణద్వారా తెలంగాణతోపాటు విదర్భను కూడా చేర్చాలని అధిష్టానానికి విన్నవించామన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, సుష్మాస్వరాజ్ తదితరులను కలిశామన్నారు. తమ డిమాండ్‌కు అధిష్టానం సానుకూలంగా స్పందించిందన్నారు. అధిష్టానాన్ని కలిసినవారిలో ఫడ ్నవిస్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, మాజీ ఎంపీ బన్వరిలాల్ పురోహిత్, ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్, నానాపటోల్ తదితరులున్నారు. ఇదిలాఉండగా బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేన విదర్భను రాష్ట్రం నుంచి విడదీయాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. అయితే ఫడ్నవిస్ మాత్రం ఈ వాదనను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. -
అధిష్టానాన్ని కలవనున్న రాష్ట్ర బీజేపీ నేతలు
ప్రత్యేక విదర్భ ఉద్యమాన్ని ముందుకు నడిపే దిశగా ఆ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా విదర్భ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రతిపాదిత ప్రత్యేక తెలంగాణ బిల్లుతోపాటు దీనినికూడా చేర్చాలంటూ ఒత్తిడి తెచ్చేందుకుగాను మంగళవారం దేశరాజధానికి చేరుకుని అధిష్టానాన్ని కలవనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలోని పార్టీ అధిష్టానాన్ని మంగళవారం కలవాలని నిర్ణయించాం. ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టే బిల్లులో సవరణద్వారా తెలంగాణతోపాటు విదర్భను కూడా చేర్చాలని ఒత్తిడి చేస్తాం. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీలో ఉన్న మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, సుష్మాస్వరాజ్ తదితరులను కలుస్తాం’ అని అన్నారు. కాగా ఫడ ్నవిస్‌తోపాటు ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సుధీర్ మునగంటివార్, మాజీ ఎంపీ బన్వరిలాల్ పురోహిత్, ఎమ్మెల్యేలు సుధాకర్ దేశ్‌ముఖ్‌లు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేన విదర్భను రాష్ట్రం నుంచి విడదీయాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. అయితే ఫడ్నవిస్ మాత్రం ప్రత్యేక విదర్భ రాష్ట్ర వాదనను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. 1992లో భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక విదర్భ ఏర్పాటుకు అనుగుణంగా ఓ తీర్మానం ఆమోదించింది.