ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే కూటమి మహారాష్ట్రలో 288 స్థానాల్లో ఏకంగా 233 చోట్ల విజయాన్ని అందుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మహా సీఎం ఎవరు? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కూటమిలో ఎవరికి వారే తామే సీఎం రేసులో ఉన్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరు అనేది త్వరలోనే చెబుతామని చెప్పారాయన.
తాజాగా సీఎం పదవిపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై మహాయుతిలోని మూడు పార్టీలు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై సమాధానం చెబుతాం. మూడు పార్టీలు నేతలు కలిసి సీఎంను ఎంపిక జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో తొందరపాటు ఏమీ లేదు. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం పదవి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఫలితాలు వెలువడిన రెండు వారాల తర్వాత సీఎంను ఎంపిక చేసినట్టు గుర్తు చేశారు.
మరోవైపు.. మహాయుతి కూటమి నేతలు ముఖ్యమంత్రి పదవితో సహా మంత్రి పదవులపై కూడా ఫోకస్ పెట్టారు. మూడు పార్టీల నేతలు తమకు మంత్రి పదవులు కావాలని ఆశిస్తున్నారు. దీనిపై కూడా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. అయితే, మహారాష్ట్రలో సీఎంతో పాటు 43 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో 132 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో మంత్రి పదవుల్లో సగం వరకు కాషాయ పార్టీకే దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన పదవులను శివసేన, ఎన్సీపీ పంచుకునే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరు? అనేది తేలకపోవడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సీటుపై పోటీ నెలకొందని ఎద్దేవా చేస్తున్నారు. కూటమిలో సీఎం ఎవరో తేల్చుకోలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment