ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైంది. మహారాష్ట్రలో 11 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే డిసెంబరు 11-16 మధ్య క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. శివసేన నేతలకు కీలక శాఖలు వచ్చే అవకాశం ఉంది. మహాయుతి ప్రభుత్వంలో తనకు హోంశాఖను అప్పగించాలని మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తోంది. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే భరత్.. షిండేకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.
ఇక, గత మహాయుతి ప్రభుత్వంలో శివసేనకు ఉన్న శాఖలను మార్చేందుకు కూటమిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో శివసేన ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా శిందే నేతృత్వంలోని మునుపటి ప్రభుత్వంలో మాదిరిగానే ఎన్సీపీ తమ దగ్గరున్న ఆర్థికశాఖను, బీజేపీ హోంశాఖను నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా షిండేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే, గత ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment