ఇక గద్దె దిగండి
బీజేపీ డిమాండ్
సాక్షి, ముంబై: అధికార పక్షాలు వెంటనే తక్షణమే తమ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవీస్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాసామ్య కూటమిని ప్రజలు తిరస్కరించారని స్పష్టమైంది. అందువల్ల ఆ కూటమి నాయకులకు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి’ అని అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకుగాను తమ కూటమికి 42 స్థానాలు వచ్చాయి. కేవలం ఆరు స్థానాలతో ప్రజాసామ్యకూటమి చతికిలపడిపోయింది. దీన్నిబట్టి ప్రజలు ఎంతమేర ఆ కూటమిని అసహ్యించుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోంది. 23 స్థానాలు దక్కించుకున్న తమకు ఏకంగా 1.33 కోట్ల ఓట్లు లభించాయి. 2009 లోక్‌సభ ఎన్నికలలో మాకు సుమారు 70 లక్షల ఓట్లు వచ్చాయి. వాటితో పోలిస్తే ఈసారి సుమారు 53 లక్షలకుపైగా ఓట్లు అధికంగా వచ్చాయి.
అదేవిధంగా 1977 ఎమర్జెన్సీ సమయంలోకూడా కాంగ్రెస్‌కు ఇంత దారుణపరాభవం చవిచూడలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాంగ్లీ, నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉండేది. అయితే ఈసారి అక్కడ కూడా మా పార్టీ విజయం సాధించింది. అక్కడి ప్రజలు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. దీన్నిబట్టి రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్, ఎన్సీపీలను పూర్తిగా తిరస్కరించారని స్పష్టమవుతోంది. మరోవైపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా భూస్తాపితంచేశారు. మా ప్రభుత్వం కేంద్రంలో అధికాకార పగ్గాలు చేపట్టబోతోంది. అందువల్ల మన్ముందు రాష్ట్రంతోపాటు దేశానికికూడా మంచిరోజులు వస్తాయి’ అని అన్నారు. తమ కూటమిలో ఎటువంటి విభేదాలు లేవన్నారు.
అమిత్ మార్గదర్శనంలోనే ముందుకు...
ఐదు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మహాకూటమిని విజయపథంలో నడిపించడంపై భాగస్వామ్యపక్షమైన బీజేపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నరేంద్రమోడీకి అత్యంత ఆప్తుడైన అమిత్‌షా మార్గదర్శనంలో ముందుకు సాగనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర వెల్లడించారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి అధికారంలోకి రాకుండా మోడీ రాజకీయ నిశిత దృష్టిని గ్రహించేందుకు ఆయన సలహాదారుడు అమిత్‌షా సహాయం తీసుకుంటారా అని మీడియా ప్రశ్నించగా కచ్చితంగా తీసుకుంటామని ఆయన జవాబిచ్చారు. వడగండ్ల వానలు కురిసినా రైతాంగాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
వారికి ఎటువంటి సహాయమూ చేయలేదన్నారు. అందువల్లనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ప్రతీకార వైఖరిని అవలంబించబోమని మోడీ ముందే చెప్పారని, అందువల్ల కేంద్రం నుంచి నిధులు అందుతాయన్నారు.
తమ పార్టీ ఎంపీలు ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో సమావేశమవుతారన్నారు. మోడీని త్వరలోనే కలిసి వడగండ్ల బాధితులకు చేయూత అందించాల్సిందిగా కోరతామన్నారు.