‘మహా’ ధీమా
లోక్‌సభ ఫలితాల నేపథ్యంలో శాసనసభ ఎన్నికలపైనా కన్నేసిన కాషాయ దళం
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాలిచ్చిన ఉత్సాహంతో శాసనసభ ఎన్నికలపై మహాకూటమి దృష్టిసారించింది. లోక్‌సభ ఎన్నికలు ముంబైతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీని మరింత బలోపేతం చేయగా, మరోవైపు శివసేనకు ఎనలేని ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చాయి. నగరంలో బీజేపీ బలం అంతంతమాత్రంగానే ఉండేది. ఏనాడూ ఆధిక్యతను సాధించలేదు. అయితే ఈసారి మాత్రం నరేంద్ర మోడీ ప్రభంజనం నగరంలో బీజేపీ, శివసేనలకు వరంగా మారింది. ఈ కారణంగానే ముంబైలోని ఆరింటికి ఆరు స్థానాలను శివసేన, బీజేపీలు కైవసం చేసుకోగలిగాయి.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండడంతో శాసనసభ ఎన్నికల్లోనూ దూసుకుపోతామనే ధీమా మహాకూటమిలో వ్యక్తమవుతోంది. 1995లో శివసేన-బీజేపీల కాషాయ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో జరిగిన రామమందిరం ఆందోళన, బాబ్రీ మసీదు కూల్చివేత పరిణామాలు ఈ కూటమికి వరంగా మారాయి. అయితే రాష్ట్రంలో 1999 నుంచి గత 15 ఏళ్లుగా కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి అధికారంలో ఉంది. ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ బీజేపీ, శివసేనలు ఆశించినమేర రాణించలేకపోయాయి. శివసేన, బీజేపీలలో అంతర్గత విభేదాలు, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తదితరాల కారణంగానే ఈ కూటమి రాణించలేకపోయిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సారి మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతప్తిని నరేంద్ర మోడీ ప్రభావంతో ఓట్లరూపంలోకి మారింది. దీంతో ఊహించనివిధంగా కాంగ్రెస్, ఎన్సీపీలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అంతా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ మహాకూటమి అధికారంలో రావడం తథ్యమని పేర్కొంటున్నారు.
సీఎం పదవి కోసం బీజేపీ, శివసేనలో పోటాపోటీ..?
వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికనే విషయంలో బీజేపీ, శివసేనల మధ్య పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1995 శాసనసభ ఎన్నికల్లో శివసేన అత్యధికంగా స్థానాలను గెలుచుకోవడంతో ముఖ్యమంత్రి పదవి శివసేనకు దక్కింది. అయితే గత ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ రాకపోయినప్పటికీ బీజేపీకే అత్యధికంగా స్థానాలు దక్కాయి. దీంతో 2009 నుంచి ప్రతిపక్ష నేత పదవి బీజేపీకి దక్కింది. ఈనేపథ్యంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకుని ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీలు దీనిపై ఆసక్తికనబరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే వీరిరువురూ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో వీరికి కేంద్ర మంత్రిమండలిలో పదవి దక్కే అవకాశముంది.