![Devendra Fadnavis Unanimously Elected As The Chief Minister Of Maharashtra](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/4/Devendra%20Fadnavis.jpg.webp?itok=WJhMskzY)
ముంబై : మహరాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ అధికారికంగా తన పేరును మార్చుకున్నారు.
మహరాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. దీంతో ఫడ్నవీస్ రేపు (డిసెంబర్5న) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ముంబై ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ముమ్మరం కొనసాగుతున్నాయి.ఈ ప్రమాణ స్వీకారంలో ప్రముఖుల్ని ఆహ్వానిస్తూ మహరాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్ ఇన్విటేషన్లను సిద్ధం చేశారు. ఆ ఇన్విటేషన్‌లలో దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ బదులు ‘దేవేంద్ర సరిత గంగాధరరావు ఫడ్నవీస్’పేరుతో ఇన్విటేషన్లు పంపిస్తున్నారు.దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని సైతం దేవేంద్ర సరితా గంగాధరరావు ఫడ్నవీస్ పేరుతో సిద్ధం చేస్తున్నారు.
అఫిడవిట్‌లో
మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కి దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ పేరుతో అఫిడవిట్‌లను సమర్పించారు.2014,2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఫడ్నవీస్ తన తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించలేదు. కానీ ఈ సారి అనూహ్యంగా తల్లి,తండ్రి పేరు కలిసేలా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.
యుక్త వయస్సులో తండ్రి దూరమై..
ఫడ్నవీస్ తల్లిపేరు సరితా ఫడ్నవీస్,తండ్రి గంగాధర్ ఫడ్నవీస్. బీజేపీలో ఎమ్మెల్సీగా చేశారు. ఫడ్నవీస్ యుక్త వయస్సులో ఉన్నప్పుడే తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ క్యాన్సర్ కారణంగా మరణించారు. ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవిస్ బ్యాంకర్,సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఫడ్నవీస్ దంపతులకు కుమార్తె దివిజ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment