సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ సైన్స్ కోర్సులో పెరగబోయే సీట్లు తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ప్రభావం చూపాయి. చాలా మంది విద్యార్థులు తొలివిడత కౌన్సెలింగ్‌లో ఆయా కోర్సుల్లో సీటు వదిలేస్తే, మలివిడతలో నచ్చిన సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కాలేజీల విషయంలోనూ ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు కన్పిస్తోంది. సీట్లు పెరగడంతో మరో కాలేజీలో ఈసారి సీటు వస్తుందనే ఆశ వారిలో కన్పిస్తోంది. అదీకాక ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందినవారు ఎంసెట్ కౌన్సెలింగ్ నుంచి తప్పుకునే వీలుంది. ఈ రకంగానూ కొంత సానుకూల వాతావరణం ఉంటుందని విద్యార్థులు ఆలోచిస్తున్నారు.
ఈసారి అదృష్టం పరీక్షిద్దాం
రాష్ట్రంలో తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అన్ని రకాల కోర్సులకు కలిపి మొత్తం 71,286 సీట్లు కన్వీనర్ కోటా కింద సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 60,208 సీట్లు కేటాయించారు. ఈ నెల 13 నాటికి కేవలం 43 వేలమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. 17 వేల మందికి సీట్లు వచ్చినా అది తమకు నచ్చలేదని భావించి రిపోర్టింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇలాంటివారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, ఆఖరుకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు ఆశపడుతున్నవారే.
తొలి దశలో పెంచిన కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్లు 9,240 అందుబాటులోకి రాలేదు. 25 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీ, సీటు కోసం తొలి దశలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్(సీఎస్‌సీ)లో సీటు వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సుల కోసం ఎదురుచూస్తూ మొదటి విడతలో చేరలేదు.
ఆప్షన్ల ఎంపికలో సానుకూలత
రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 28న మొదలవుతుంది. కొత్తగా 12 వేలకుపైగా సీట్లు పెర గడం, జేఈఈ ర్యాంకర్లు ఈసారి ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పెద్దగా పోటీ పడకపోవడం వల్ల రా ష్ట్రస్థాయి విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 40 వేలలోపు ర్యాంకు విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని అంటున్నారు.
5 వేలలోపు ర్యాంకుల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువమంది ఈసారి పోటీలో ఉండరని, 10 వేల లోపు ర్యాంకు విద్యార్థుల్లో 50 శాతం మాత్రమే పోటీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు కోరిన కాలేజీ, సీటు కోసం పోటీపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఆ పై ర్యాంకు విద్యార్థులు కాలేజీ విషయం పక్కన పెట్టినా, కోరుకున్న సీటును ఎక్కడైనా పొందేందుకు ప్రయత్నించి సఫలం కావచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment