పైసలిస్తేనే 'ప్రవేశం' | extreme delay in the release of Fees reimbursement | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే 'ప్రవేశం'

Published Thu, Aug 13 2015 11:58 PM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు జాప్యం చేయడం విద్యార్థులకు శాపంగా మారింది

ట్యూషన్ ఫీజు ముందే ఇవ్వాలంటున్న కళాశాలలు
 
♦ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలలో తీవ్ర జాప్యం
♦ డబ్బులు వచ్చాక తిరిగితీసుకోవాలని స్పష్టీకరణ
♦ విధి లేని పరిస్థితుల్లో చెల్లిస్తున్న విద్యార్థులు
♦ తలకు మించిన భారమంటూ తల్లిదండ్రుల ఆందోళన
 
 నరేష్ ఇటీవల ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఘట్‌కేసర్‌లోని ఓ ప్రముఖ కళాశాలలో సీటు సాధించాడు. ప్రభుత్వ కోటాలో సీటు రావడంతో ఫీజు కట్టాల్సిన పనిలేదనే ధీమాతో కాలేజీలో ప్రవేశం కోసం వెళ్లి తెల్లబోయాడు. ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే చేర్చుకుంటామని, రీయింబర్స్‌మెంట్ నిధులొచ్చాక తిరిగి తీసుకోవచ్చని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేయడంతో నరేష్ ఆలోచనలో పడ్డాడు. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో అప్పుచేసి ఫీజు చెల్లించాడు.
 
 జిల్లాలో పలు కళాశాలల్లోనూ ట్యూషన్ ఫీజులు చెల్లించాలంటూ యాజ మాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. సకాలంలో నిధులివ్వకపోవడంతో నిర్వహణ భారమవుతున్న నేపథ్యంలో ఇలా ఫీజులు వసూలు చేస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నప్పటికీ.. విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం తలకుమించిన భారంగా మారుతోంది.
                      - సాక్షి, రంగారెడ్డి జిల్లా
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు జాప్యం చేయడం విద్యార్థులకు శాపంగా మారింది. గతేడాదికి సంబంధించి విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంటు నిధుల విడుదల ఊసెత్తడంలేదు. దీంతో తాజా విద్యాసంవత్సరంలో కొత్తగా ఇంజినీరింగ్ తదితర కోర్సులలో చేరే విద్యార్థులకు యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఫీజు డబ్బులు చెల్లిస్తేనే కాలేజీలో చేర్చుకుంటామని తేల్చిచెబుతున్నాయి. దీంతో ఆయా విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జిల్లాలో 124 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి.

వీటి పరిధిలో ఈ ఏడాది కొత్తగా 35వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ సీట్లు సాధించి ప్రవేశాలు పొందుతున్నారు. కౌన్సెలింగ్ ద్వారా సీటు దక్కించుకోవడంతో ఉచితంగా విద్యనభ్యసించవచ్చు. వీరికి సంబంధించిన ఫీజు ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. కానీ ఇప్పుడు భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఏళ్లుగా రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో.. ఆ భారం విద్యార్థులపై పడుతోంది. కోర్సుకు సంబంధించిన ఫీజు విద్యార్థి చెల్లిస్తేనే అడ్మిషన్‌కు అనుమతిస్తున్నారు. ఘట్‌కేసర్‌లోని ప్రముఖ కాలేజీతో పాటు ఇబ్రహీంపట్నంలోని మరో కాలేజీలో దాదాపు వందమందికి పైగా విద్యార్థులు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత సాధించినప్పటికీ.. సొంతంగా ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందారు.

 గత బకాయిలు రూ. 465కోట్లు..!
 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. దీంతో అధికారులు వాటి పరిశీలన ప్రక్రియ మొదలుపెట్టారు. వాస్తవానికి గతేడాది ఆగస్టు నాటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ముగియాల్సి ఉండగా.. ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. దీంతో కోర్సు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించింది. 2014-15 విద్యాసంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ కేటగిరీలకు సంబంధించి పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 1,09,610 మంది ఫ్రెషర్స్ అర్హత సాధించారు.

అదేవిధంగా రెన్యువల్ విద్యార్థులు 1,57,845 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా వీరికి  ఫీజు రీయింబర్స్ కింద రూ. 465 కోట్లు చెల్లించాల్సి ఉంది. విద్యాసంవత్సరం ముగిసినప్పటికీ ప్రభుత్వం నిధుల ఊసెత్తకపోవడంతో ఇప్పటికే కోర్సు పూర్తిచేసుకున్న పలువురు విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు పొందడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement