సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడో దశలో కన్వీనర్ కోటాలో చేరే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది. కన్వీనర్ కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకూ 70,627 కేటాయించారు.
ఇంకా 13,139 సీట్లు ఉన్నాయి. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత కూడా సీట్లు మిగిలితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కౌన్సెలింగ్‌లో మిగిలిపోయే సీట్లను ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లుగా భర్తీ చేయడం సర్వసాధారణం. వాస్తవానికి వీటిని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులతోనే భర్తీ చేయాలి.
కానీ కౌన్సెలింగ్‌లో సీటు రాని విద్యార్థులకు ఎక్కువ మొత్తం తీసుకుంటూ సీట్లు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు యాజమాన్య కోటా సీట్లు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 33 వేల వరకూ ఉంటాయి. ఇందులో సగం బి కేటగిరీ కింద, మిగతా సగం ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ఉంటాయి. వీటితో కాసుల పంట పండించుకునేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
రంగంలోకి ఏజెంట్లు, కన్సల్టెన్సీలు
ప్రధాన ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు దాదాపు భర్తీ అయ్యాయి. అయితే టాప్ టెన్ కాలేజీలను మినహాయిస్తే మిగతా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. వీటిని ఈ నెలాఖరు వరకూ భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో కాలేజీలు ఏజెంట్లను, కన్సల్టెన్సీలను భారీగా కమీషన్లు ఆశచూపి రంగంలోకి దించుతున్నాయి.
ఏజెంట్లు, కన్సల్టెన్సీల ప్రతినిధులు ఎంసెట్ అర్హుల జాబితా ఆధారంగా వారి ఫోన్ నంబర్లు సంపాదించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఏదో రకంగా నమ్మబలుకుతూ తమకు అనుకూలమైన కాలేజీల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఏజెంట్లు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సీట్లు అయిపోతున్నాయని, త్వరగా అప్రమత్తం కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కసారి కాలేజీ యాజమాన్యం వద్దకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నారు.
కంప్యూటర్ కోర్సుకు గిరాకీ
రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 56,811 కంప్యూటర్ సైన్స్ సీట్లున్నాయి. మేనేజ్‌మెంట్ కోటాలో 19 వేల వరకు సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో 53,034 సీట్లు భర్తీ చేశారు. ఇంకా 3,777 సీట్లు మిగిలిపో యాయి. ఇవన్నీ టాప్‌టెన్ కాని కాలేజీల్లోనే ఉన్నా యి. ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు, కోరు కున్న కాలేజీలో, కోరుకున్న బ్రాంచీలో సీట్లు రాని వారు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్ని స్తున్నారు.
సీఎస్‌సీ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉందంటూ కాలేజీల యాజమాన్యాలు, ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయి. ఒక్కో సీటు రూ.12 నుంచి రూ.16 లక్షలకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందులో రూ.2 లక్షల వరకూ కన్సల్టెన్సీలకు కమీషన్లుగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి బి కేటగిరీ సీట్లను ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజుకు, మెరిట్ ప్రకారమే ఇవ్వాలి.
ఈ నిబంధన ఎక్కడా పాటించడం లేదని తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు ఉన్నా ఫీజు ఎక్కువగా ఉండటంతో అవి మిగిలిపోతున్నాయి. వీటిని కూడా భారీగా డబ్బులు తీసుకుని ఎన్‌ఆర్‌ఐ కోటా మాదిరి పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారని, యాజమాన్య కోటా సీట్ల దందా అపాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment