2 లక్షల సీట్లు ఖాళీయే ! | 2 Lakhs engineering seats not filed | Sakshi
Sakshi News home page

2 లక్షల సీట్లు ఖాళీయే !

Published Wed, Sep 18 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

2 Lakhs engineering seats not filed

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మొత్తం 2 లక్షల వరకు ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలోనే లక్ష సీట్లు మిగిలిపోయాయి. బీ ఫార్మసీలో కేవలం 558 సీట్లు మాత్రమే భర్తీ కాగా ఇంకా 7,927 సీట్లు ఖాళీ ఉన్నాయి. మంగళవారం సాయంత్రం సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్యా శాఖ వెల్లడించింది. విద్యార్థులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలియజేసింది.
 
 ఈఏడాది ఎంసెట్‌లో 2,18,893 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అనేక అడ్డంకుల నడుమ ఆగస్టు 19న ప్రారంభమై ఈనెల 3న  ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కేవలం 1,30,290 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో 1,28,724 మంది వెబ్‌ఆప్షన్లు ఇవ్వగా.. 1,26,390 మందికి సీట్లు లభించాయి. ఎంపీసీ విభాగంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 2,34,488 సీట్లు అందుబాటులో ఉండగా.. రెండింట్లో కలిసి 1,08,098 సీట్లు మిగిలాయి. ఇంజనీరింగ్‌లో 99,802, ఫార్మసీ(ఫార్మా-డితో కలుపుకొని)లో 8,296 సీట్లు మిగిలాయి. మరోవైపు యాజమాన్య కోటాలో లక్షా 10 వేల సీట్లు అందుబాటులో ఉండగా దాదాపు లక్ష సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది మొత్తం రెండు లక్షల సీట్లు మిగిలిపోతాయన్నమాట.
 
 తుది విడత కౌన్సెలింగ్ పూర్తయినా పరిస్థితి పెద్దగా మెరుగయ్యే అవకాశాల్లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలావుండగా సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 23లోగా ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ‘క్యాండిడేట్స్ లాగిన్’ అనే లేబుల్‌ను క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబరు, హాల్‌టికెట్ నంబరు, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను టైప్ చేయడం ద్వారా సీటు కేటాయింపు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు బోధన రుసుం చెల్లించాల్సిన కేటగిరీలో ఉంటే బ్యాంకు చలానా ఫామ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీటు కేటాయింపు పత్రంలో పేర్కొన్న బోధన రుసుమును చలానా ద్వారా ఇండియన్ బ్యాంకులోగానీ, ఆంధ్రా బ్యాంకులోగానీ చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుంది. ఆ రశీదును కళాశాలలో చూపించాల్సి ఉంటుంది.
 
 సీటు వద్దనుకున్నా లేదా రానిపక్షంలో..: తొలివిడతలో సీటు లభించినా చేరేందుకు ఆసక్తిలేని విద్యార్థులు తదుపరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవద్దనుకుంటే తాము రిజిస్ట్రేషన్ చేసుకున్న హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆశ్రయించి సీటును రద్దు చేసుకుని సర్టిఫికెట్లు వెనక్కితీసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీటు మాత్రమే రద్దు చేసుకోవాలనుకుంటే రద్దు చేసుకుని సర్టిఫికెట్లు అక్కడే ఉంచి తదుపరి విడతల్లో కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. సీటు రానివారు తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనదలిస్తే సర్టిఫికెట్లను హెల్ప్‌లైన్ సెంటర్‌లోనే ఉంచాలి. ఏదైనా ఇతర సమస్యలు ఉంటే సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. అక్కడినుంచి విన్నపాలు కన్వీనర్‌కు చేరుతాయి.
 
 24 నుంచి తుది విడత కౌన్సెలింగ్
 ఈనెల 24 నుంచి 27 వరకు తుది విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. 29న సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు. 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఒకటి నుంచి చివరి ర్యాంకుల వరకు ఎవరైనా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తొలివిడతలో సీట్లు పొంది రిపోర్ట్ చేసిన విద్యార్థుల వివరాలను కళాశాలల ప్రిన్సిపల్స్ 01.10.2013లోగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ జాయినింగ్ రిపోర్ట్ అయ్యిందా? లేదా అన్న వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మంచి అవకాశం కోసం తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకుంటే తుదివిడతలో వచ్చే సీటును మాత్రమే పొందుతారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకానివారు ఈనెల 24 నుంచి 27 వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో హాజరుకావొచ్చు. ఆ తరువాత వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
 
 ఈసీఈకే ఎక్కువ డిమాండ్
 ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది ఈసీఈ బ్రాంచికే ఎక్కువ ఆదరణ లభించింది. ఆ తరువాతి స్థానం కంప్యూటర్ సైన్స్‌కు దక్కింది. మెకానికల్ బ్రాంచి మూడోస్థానంలో ఉంది. ఐటీని పట్టించుకున్నవారే లేరు. ఈసీఈలో 55 శాతం సీట్లు నిండగా.. ఆ తరువాత అత్యధిక సీట్లు అందుబాటులో ఉన్న సీఎస్‌ఈలో కేవలం 48 శాతం సీట్లు నిండాయి. మెకానికల్ బ్రాంచీలో తక్కువ సీట్లే ఉన్నప్పటికీ 68 శాతం సీట్లు నిండాయి. ఇక సివిల్‌లో కూడా తక్కువ సీట్లే ఉన్నప్పటికీ దీనిలోనూ 70 శాతం సీట్లు నిండాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement