రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ! | two lakhs engineering seats empty | Sakshi
Sakshi News home page

రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ!

Published Fri, Sep 6 2013 4:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ!

రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ!

సంక్షోభం దిశగా ఇంజనీరింగ్ కళాశాలలు
2.17 లక్షల మంది అర్హులు ఉన్నా 1.30 లక్షల మందే వెరిఫికేషన్‌కు హాజరు
గత ఏడాది మిగిలిన సీట్లు 1.75 లక్షలు.. ఈ ఏడాది మిగలనున్న 2 లక్షల సీట్లు
విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలు, పొరుగు రాష్ట్రాలకు వెళుతుండటమే కారణం
రాష్ర్టంలో కాలేజీల డొల్లతనం, ఫీజుల భారం, ప్లేస్‌మెంట్లు దొరక్కపోవటమూ కారణమే
గత ఏడాది పెద్ద సంఖ్యలో మూతపడ్డ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ కాలేజీలు
ఈ ఏడాది కూడా విద్యార్థులు లేక మరిన్ని కాలీజీలు మూతపడే అవకాశం

 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలు ఈ ఏడాది గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా కలిపి రాష్ట్రంలో 3.40 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారు లక్షా 30 వేల మంది మాత్రమే ఉండటం కళాశాలలను కలవరపెడుతోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గత ఏడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత తగ్గింది. దాదాపు 2.17 లక్షల మంది అర్హులైన విద్యార్థులు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు 1,30,278 మంది మాత్రమే వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. గత ఏడాది దాదాపు 1.75 లక్షల సీట్లు మిగలగా ఈ ఏడాది 2 లక్షల పైచిలుకు సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంకృతాపరాధం కారణంగానే కళాశాలలు ఇలాంటి సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటున్నాయని పలు యాజమాన్య సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయం నాటికి కోర్టుల్లో కేసులు వేస్తుండటంతో కాలాతీతమై ఏటా వేలాది మంది అభ్యర్థులు రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీల వైపు వెళుతున్నారు.
 
 గత  ఏడాది ఫీజుల నిర్ధారణలో జాప్యం జరిగి 30 వేల మంది బయటికివెళ్లగా.. ఈ ఏడాది కళాశాలల ఎత్తుగడలను ఊహించని ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రదర్శించటం.. కోర్టుల్లో కేసులు ఎదురుకావడంతో ప్రవేశాల షెడ్యూలు రెండు నెలలు ఆలస్యంగా మొదలైంది. దీంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉంటారని కళాశాలలు అంచనా వేస్తున్నాయి. ఏటా ఇంజనీరింగ్ కళాశాలలు ఆలస్యంగా ప్రారంభమవటం, ఉత్తీర్ణత శాతాలు ఆశాజనకంగా లేకపోవటం, ఫీజులు భారమవటం, ప్లేస్‌మెంట్లు దొరక్కపోవటం కారణంగా విద్యార్థులు సాంప్రదాయక డిగ్రీల వైపు మొగ్గుచూపుతున్నట్టు అంచనావేస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో ఇంజ నీరింగ్ కళాశాలల డొల్లతనం బయటపడటంతో రాష్ట్రంలోని విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోందని విద్యావేత్తలు అంచనావేస్తున్నారు. ఈ ఏడాది కేవ లం అగ్రశ్రేణి క ళాశాలల్లోనే కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
 
 మూసివేత దిశగా కాలేజీలు...
 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో వేలాది సీట్లు మిగిలిపోతుండటంతో పలు కళాశాలలు ఏకంగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. గత ఏడాది 678 ప్రైవేటు కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా 50 శాతానికి పైగా సీట్లు నిండిన కళాశాలలు కేవలం 339 మాత్రమే. కనీసం 50 శాతం సీట్లు నిండనిపక్షంలో కళాశాల నిర్వహణ కష్టమేనని యాజమాన్యాలు చెప్తున్నాయి. 2013-14కు కొత్త ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క దరఖాస్తు రాగా మూతపడిన కాలేజీలే ఎక్కువగానే ఉన్నాయి.
 
  ప్రవేశాలు లేక 14 ఇంజనీరింగ్ కళాశాలలు, 3 ఫార్మసీ, 40 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు మూతపడ్డాయి. మరో 134 కాలేజీలు ఐటీ కోర్సును రద్దు చేసుకున్నాయి. పలు కళాశాలలు సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్ బ్రాంచీలను కూడా రద్దు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త కళాశాలలు వద్దని, ఇన్‌టేక్ 420కి పరిమితం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి ఏఐసీటీఈకి పంపింది. అయితే ఏఐసీటీఈ దానిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో దాదాపు 2 లక్షల సీట్లు మిగిలిపోతుండటంతో మరిన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం ఈ నెల 17న సీట్ల కేటాయింపు జాబితా వెలువడిన తరువాత కళాశాలల భవితవ్యం తేటతెల్లమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement