Engineering Management Quota
-
ఇంజనీరింగ్ యాజమాన్య కోటాలోనూ రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య సీట్లలో రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ దిశగా విస్తృత చర్చ చేపట్టాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌కు ఇటీవల లేఖరాశారు. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల పంపిణీలో రిజర్వేషన్ అమలవుతోందని, ఆర్టికల్ 74 ఇందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. అయితే, యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల భర్తీలో ఈ అవకాశం లేకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్లను ఇష్టానుసారం అధిక రేట్లకు అమ్ముకుంటున్నాయని, డబ్బున్న వాళ్లకే సీట్లు వస్తున్నాయని తెలిపారు. ఈ విధానంలో మార్పు కోసం దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరముందని ఆచారి తెలిపారు. (చదవండి: వైద్య విద్య కఠినతరం .. ‘ఎగ్జిట్’ దాటితేనే ఎంట్రీ) -
కోటలు దాటిన మాటలు.. గడప దాటని చేతలు!
ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల్లో జరుగుతున్న అక్రమాల విషయం తెలిసినప్పటికీ.. ఉన్నత విద్యామండలి చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. కొన్ని కాలేజీల యాజమాన్యాలు నిబంధనలను పూర్తిగా తుంగలోతొక్కి సీట్లను ఇష్టారీతిన అమ్ముకుంటున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. యాజమాన్య కోటా సీట్లకు కూడా కన్వీనర్ కోటా ఫీజునే అమలు చేయకపోయినా చేష్టలుడిగి చూస్తోందే తప్ప చర్యలపై ఆలోచించడం లేదు. ప్రతిసారీ ప్రవేశాల సమయంలో ‘ఈసారి ఆన్లైన్లో దరఖాస్తులు’అంటూ హడావుడి చేయడం.. ఆ తర్వాత వదిలేయడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు వినబడుతున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో కూడా పారదర్శకత ఉండాలని, మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఉన్నత విద్యామండలి నిమ్మకు నీరెత్తి్తనట్లు వ్యవహరిస్తోంది. ర్యాటిఫికేషన్ల సమయంలో యాజమాన్యాల నుంచి అందే ముడుపులు తీసుకుని వారు చేసే తప్పిదాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. యాజమాన్య కోటా సీట్ల కోసం వచ్చిన దరఖాస్తులెన్ని? ఈ తరహా నియామకాల్లో పారదర్శకత ఎంత అన్న దాన్ని మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలను ఎదుర్కొంటోంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ విషయంలో ఉన్నత విద్యా మండలి ఏం చేయాలి? దానికి ఉన్న అధికారాలు ఏంటి? అన్న అంశాలపై కనీస ధ్యాస లేకుండా అసలు రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ఉందా? లేదా? అన్నట్లుగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వం ఏం చేసిందంటే! యాజమాన్య కోటా సీట్ల భర్తీలో పారదర్శకతను పెంపొందించడం, మెరిట్ విద్యార్థులకు సీట్లు లభించడం, అడ్డగోలుగా సీట్ల అమ్మకాలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2011 సంవత్సరంలో జీవో నంబరు 74, 75లను, 2012లో జీవో నంబరు 66, 67లను జారీచేసింది. వాటిల్లోని వివిధ అంశాలపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా చివరకు 2014 ఆగస్టు 14న జీవో నంబరు 13, 14లను జారీ చేసింది. అయితే.. 2012లో జారీచేసిన జీవోలు 66, 67 ప్రకారమే యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. యాజమాన్య కోటాలో సీటు కోరుకునే ప్రతి విద్యార్థికీ దరఖాస్తు దక్కేలా, ఆ దరఖాస్తుల నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంపికయ్యేలా ఆదేశాలు జారీచేసింది. ఆన్లైన్లో భర్తీకి మార్గదర్శకాలివే అర్హత కలిగిన అధికార యంత్రాంగం (ఉన్నత విద్యామండలి) బీ–కేటగిరీ సీట్ల భర్తీకి సింగిల్ విండో తరహాలో ఒక వెబ్ పోర్టల్‌ను సిద్ధం చేయాలి. ఈ పోర్టల్‌లో ప్రతి కాలేజీకి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. కాలేజీల్లోని ప్రతి కోర్సులో యాజమాన్య కోటాలో ఉండే సీట్ల వివరాలు అందుబాటులో ఉంచాలి. ఆ సీట్ల భర్తీకి కాలవ్యవధిని ఉన్నత విద్యామండలి నిర్దేశించాలి. మరోవైపు పత్రికల్లో, ఈ పోర్టల్‌లో ఆయా కాలేజీలు ప్రకటనలు ఇవ్వాలి. విద్యార్థులు ఆ పోర్టల్‌కు వెళ్లి తమకు కావాల్సిన కాలేజీకి దరఖాస్తు చేసుకోవాలి. ఒకే కాలేజీలో రెండు, మూడు కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. వాటి ఆధారంగా కాలేజీలు విద్యార్థులను ఎంపిక చేయాలి. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను కాలేజీలు తిరిగి వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. వారు మెరిట్ ప్రకారం ఎంపిక చేశారని.. ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్లైన్లోనే ఆమోదించాలి. లేదంటే తిరస్కరించాలి. ఇంకా సీట్లు మిగిలితే రెండో జాబితాను రూపొందించాలి. ప్రభుత్వాన్ని సమర్థించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో కూడిన ఈ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే జీవో 66, 67లను సమర్థిస్తూనే యాజమాన్యాలు కోరిన పలు అంశాలను ఆ జీవోల్లో చేర్చాలని న్యాయస్థానం సూచించింది. అందులో ముఖ్యంగా దరఖాస్తులు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో (విద్యార్థులు నేరుగా కాలేజీలకు వెళ్లి) దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, విద్యార్థిని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇవ్వాలని, వారి ఆర్థిక స్తోమత తెలుసుకొని సీట్లను కేటాయించే అవకాశం కల్పించాలని సూచించింది. ఒకవేళ యాజమాన్యం ఆ విద్యార్థి దరఖాస్తును తిరస్కరిస్తే.. కారణాలను ఉన్నత విద్యామండలికి కచ్చితంగా వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే అప్పటి వరకు 5% ఉన్న ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా 15% వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టింది. యాజమాన్య కోటా దరఖాస్తులను ఉన్నత విద్యామండలి పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. స్పష్టత ఉన్నా మండలి నిర్లిప్తత మేనేజ్మెంట్ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేసేందుకు, ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి మెరిట్ విద్యార్థులకు సీట్లను కేటాయించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా.. ఉన్నత విద్యామండలి ఏ ఒక్కటీ సక్రమంగా అమలుచేయడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ ప్రయత్నం చేసి వదిలేయగా, తెలంగాణ వచ్చాక ఆ దిశగా ఆలోచన చేయాలన్న ధ్యాస లేకుండా పోయింది. ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించి మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేలా, అడ్డగోలుగా సీట్లు అమ్ముకోకుండా చూడాలన్న ఆలోచనే కనిపించడం లేదు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులకు ఉన్నత విద్యామండలిలోని కొంతమంది అధికారులు అలవాటుపడ్డారు. వీరంతా మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని యాజమాన్యాలకు అనుకూలమైన ఓ వ్యాపారంగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల ర్యాటిఫికేషన్ కోసం వచ్చే యాజమాన్యాలకు నిర్ణీత గడువు అనేది లేకుండా ముడుపుల బాగోతంలో ఎప్పుడు వస్తే అప్పుడు ఓకే చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరో నాలుగు నెలల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కనీసం వచ్చే విద్యా సంవత్సరంలోనైనా.. పక్కా చర్యలు చేపడతారా? లేదా? అన్న ఆందోళన తల్లిదండ్రులను వేధిస్తోంది. -
ఎంసెట్ అభ్యర్థులకు ‘జేఈఈ’ దెబ్బ!
యాజమాన్య కోటా సీట్ల భర్తీలో తీరని నష్టం జేఈఈ-మెయిన్స్ రాసినవారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో తిప్పలు అగ్రశ్రేణి కాలేజీల్లో ఎంసెట్ అభ్యర్థులకు మొండిచేయి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటాలో అడ్మిషన్ల భర్తీకి తొలి ప్రాధాన్యత జేఈఈ-మెయిన్స్ ర్యాంకర్లకే ఇవ్వాలన్న నిబంధనతో కేవలం ఎంసెట్ మాత్రమే రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తాజాగా ఈ విద్యాసంవత్సరంలో అగ్రశ్రేణి కళాశాలలు భర్తీ చేసిన యాజమాన్య కోటా జాబితాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లు యాజమాన్య కోటా(బీ-కేటగిరీ)లో భర్తీ చేస్తున్నారు. జీవో 74 ప్రకారం గత ఏడాది వరకు బీ-కేటగిరీలో తొలుత 5 శాతం ఎన్నారై కోటా భర్తీ చేసేవారు. మిగిలిన సీట్లలో ముందుగా ఇతర రాష్ట్రాల ఏఐఈఈఈ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, వీరు లేనిపక్షంలో ఎంసెట్ ర్యాంకర్లతో భర్తీ చేయాలని, వీరు కూడా లేనిపక్షంలో ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ప్రతిభా క్రమంలో భర్తీచేయాలని ఈ జీవో స్పష్టం చేస్తోంది. అయితే ఈ ప్రాధాన్య్ర క్రమంలో తొలి ప్రాధాన్యత కింద కేవలం ఇతర రాష్ట్రాల ఏఐఈఈఈ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇస్తే మనరాష్ట్ర విద్యార్థులు నష్టపోతారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. మన రాష్ట్ర విద్యార్థుల్లో ఏఐఈఈఈ రాసేవారు పరిమితంగా ఉంటున్నారన్న ఆందోళన వ్యక్తమవడంతో ఉన్నత విద్యాశాఖ ప్రాధాన్యతలను మార్చింది. 2012-13 ఆగస్టు 28న జీవో 60, 61లను జారీచేసింది. ఇందులో తొలి ప్రాధాన్యం అన్ని రాష్ట్రాల ఏఐఈఈఈ ర్యాంకర్లకు ఇవ్వాలని, పారదర్శకత పాటించాలని నిర్దేశించింది. అయితే కేవలం పారదర్శకత అంటూ ప్రభుత్వం మభ్యపెట్టిందని, బీ-కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్లో భర్తీ చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్ 3న మళ్లీ 66, 67 జీవోలు విడుదల చేసింది. 2012-13లో ముందుగా విడుదల చేసిన జీవోలు 60, 61 ప్రకారం యాజమాన్య కోటా సీట్లను భర్తీచేసిన యాజమాన్యాలు.. అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యాక ప్రభుత్వం జీవో 66, 67లను విడుదల చేసిందంటూ హైకోర్టును ఆశ్రయించాయి. అడ్మిషన్ల మధ్యలో ఈ జీవోలు రావడం సబబు కాదంటూ హైకోర్టు 2012-13 విద్యాసంవత్సరానికి జీవో 66, 67ల అమలును నిలుపుదల చేసింది. 2012-13లో జీవో 60, 61 ప్రకారం సీట్లు భర్తీ అయ్యాయి. అయితే 2013-14కు జీవో 66, 67లను అమలు చేయాలనుకున్న సమయంలో యాజమాన్యాలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అడ్మిషన్ల ప్రక్రియను ఆన్లైన్లో చేపట్టడం సరికాదని వాదించాయి. దీనిపై హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువడకముందే సింగిల్ జడ్జి తీర్పును అనుసరించి ఉన్నత విద్యామండలి కన్వీనర్ కోటాకు నోటిఫికేషన్‌ను, యాజమాన్య కోటాకు మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో మళ్లీ యాజమాన్యాలు జీవో 74, జీవో 60, 61 ప్రకారం సీట్ల భర్తీ ప్రక్రియను ఆరంభించాయి. ఆ తర్వాత హైకోర్టు జీవో 66, 67 ప్రకారం ఆన్లైన్లోనే భర్తీ చేయాలని తీర్పు ఇచ్చినప్పటికీ.. అప్పటికే ప్రక్రియ మొదలవడంతో ప్రభుత్వం ఏమీ చేయలేక మౌనం వహించింది. అగ్రశ్రేణి కళాశాలల్లో సీట్లన్నీ వారికే.. యాజమాన్యాలు ఈ ఏడాది జీవో 60, 61 ప్రకారం బీ-కేటగిరీ సీట్ల భర్తీ చేపట్టాయి. అంటే ‘అన్ని రాష్ట్రాల జేఈఈ-మెయిన్స్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యత’ అనే నిబంధనను పాటించారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థుల సంగతి పక్కనబెడితే.. మనరాష్ట్రం నుంచి ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో జేఈఈ-మెయిన్స్ రాసినందున వారిలో ఎంత పెద్ద ర్యాంకు ఉన్నా.. జేఈఈ-మెయిన్స్ రాసిన అభ్యర్థులకే సీటు దక్కింది. రెండో నిబంధన అయిన ‘ఎంసెట్ ర్యాంకర్లకు ప్రాధాన్యత’ అనే అంశం పరిగణనలోకి రాకముందే సీట్లన్నీ భర్తీ అయ్యాయి. అగ్రశ్రేణి కళాశాలలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రేతరులకు ప్రాధాన్యత ఇస్తున్నామనుకున్న ప్రభుత్వం.. ఈ నిబంధన కారణంగా రాష్ట్రంలోని జేఈఈ-మెయిన్స్ రాసిన అభ్యర్థులకు మాత్రమే లబ్ధి చేకూరడాన్ని పట్టించుకోలేదు. దీంతో తాము అన్యాయానికి గురవుతున్నామని ఎంసెట్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ- మెయిన్స్ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల.. జేఈఈ-మెయిన్స్‌లో 1 లక్ష ర్యాంకు వచ్చినా.. ఎంసెట్‌లో 1వ ర్యాంకు వచ్చినా.. తొలి ప్రాధాన్యం జేఈఈ-మెయిన్స్‌కే దక్కుతుంది. దీనివల్ల కేవలం ఎంసెట్ మాత్రమే రాసిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో అష్టకష్టాలు పడి ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకున్నా.. ప్రతిభా క్రమంలో మంచిసీట్లు కోల్పోతున్నామని ఎంసెట్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
రెండు లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ!
సంక్షోభం దిశగా ఇంజనీరింగ్ కళాశాలలు 2.17 లక్షల మంది అర్హులు ఉన్నా 1.30 లక్షల మందే వెరిఫికేషన్‌కు హాజరు గత ఏడాది మిగిలిన సీట్లు 1.75 లక్షలు.. ఈ ఏడాది మిగలనున్న 2 లక్షల సీట్లు విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలు, పొరుగు రాష్ట్రాలకు వెళుతుండటమే కారణం రాష్ర్టంలో కాలేజీల డొల్లతనం, ఫీజుల భారం, ప్లేస్మెంట్లు దొరక్కపోవటమూ కారణమే గత ఏడాది పెద్ద సంఖ్యలో మూతపడ్డ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ కాలేజీలు ఈ ఏడాది కూడా విద్యార్థులు లేక మరిన్ని కాలీజీలు మూతపడే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలు ఈ ఏడాది గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా కలిపి రాష్ట్రంలో 3.40 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారు లక్షా 30 వేల మంది మాత్రమే ఉండటం కళాశాలలను కలవరపెడుతోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గత ఏడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత తగ్గింది. దాదాపు 2.17 లక్షల మంది అర్హులైన విద్యార్థులు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు 1,30,278 మంది మాత్రమే వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. గత ఏడాది దాదాపు 1.75 లక్షల సీట్లు మిగలగా ఈ ఏడాది 2 లక్షల పైచిలుకు సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంకృతాపరాధం కారణంగానే కళాశాలలు ఇలాంటి సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటున్నాయని పలు యాజమాన్య సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయం నాటికి కోర్టుల్లో కేసులు వేస్తుండటంతో కాలాతీతమై ఏటా వేలాది మంది అభ్యర్థులు రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీల వైపు వెళుతున్నారు. గత ఏడాది ఫీజుల నిర్ధారణలో జాప్యం జరిగి 30 వేల మంది బయటికివెళ్లగా.. ఈ ఏడాది కళాశాలల ఎత్తుగడలను ఊహించని ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యం ప్రదర్శించటం.. కోర్టుల్లో కేసులు ఎదురుకావడంతో ప్రవేశాల షెడ్యూలు రెండు నెలలు ఆలస్యంగా మొదలైంది. దీంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులు డీమ్డ్ వర్సిటీలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉంటారని కళాశాలలు అంచనా వేస్తున్నాయి. ఏటా ఇంజనీరింగ్ కళాశాలలు ఆలస్యంగా ప్రారంభమవటం, ఉత్తీర్ణత శాతాలు ఆశాజనకంగా లేకపోవటం, ఫీజులు భారమవటం, ప్లేస్మెంట్లు దొరక్కపోవటం కారణంగా విద్యార్థులు సాంప్రదాయక డిగ్రీల వైపు మొగ్గుచూపుతున్నట్టు అంచనావేస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో ఇంజ నీరింగ్ కళాశాలల డొల్లతనం బయటపడటంతో రాష్ట్రంలోని విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోందని విద్యావేత్తలు అంచనావేస్తున్నారు. ఈ ఏడాది కేవ లం అగ్రశ్రేణి క ళాశాలల్లోనే కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మూసివేత దిశగా కాలేజీలు... ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో వేలాది సీట్లు మిగిలిపోతుండటంతో పలు కళాశాలలు ఏకంగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. గత ఏడాది 678 ప్రైవేటు కళాశాలలు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా 50 శాతానికి పైగా సీట్లు నిండిన కళాశాలలు కేవలం 339 మాత్రమే. కనీసం 50 శాతం సీట్లు నిండనిపక్షంలో కళాశాల నిర్వహణ కష్టమేనని యాజమాన్యాలు చెప్తున్నాయి. 2013-14కు కొత్త ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క దరఖాస్తు రాగా మూతపడిన కాలేజీలే ఎక్కువగానే ఉన్నాయి. ప్రవేశాలు లేక 14 ఇంజనీరింగ్ కళాశాలలు, 3 ఫార్మసీ, 40 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు మూతపడ్డాయి. మరో 134 కాలేజీలు ఐటీ కోర్సును రద్దు చేసుకున్నాయి. పలు కళాశాలలు సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్ బ్రాంచీలను కూడా రద్దు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త కళాశాలలు వద్దని, ఇన్‌టేక్ 420కి పరిమితం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి ఏఐసీటీఈకి పంపింది. అయితే ఏఐసీటీఈ దానిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో దాదాపు 2 లక్షల సీట్లు మిగిలిపోతుండటంతో మరిన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం ఈ నెల 17న సీట్ల కేటాయింపు జాబితా వెలువడిన తరువాత కళాశాలల భవితవ్యం తేటతెల్లమవుతుంది. -
ఆన్లైన్లోనే మేనేజ్మెంట్ కోటా భర్తీ
ఇంజనీరింగ్ సీట్లకు మళ్లీ నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తాం: ఉన్నత విద్యామండలి సింగిల్ పోర్టల్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ విద్యార్థులు నేరుగా కూడా సమర్పించవచ్చు జీవో 66 ప్రకారం ఎంపిక ప్రక్రియ పాత నోటిఫికేషన్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తాజా తీర్పునకు అనుగుణంగా, జీవో 66, 67 ప్రకారం ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీని ప్రకారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన వెబ్ పోర్టల్‌లో అన్ని కళాశాలల దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఆ వెబ్ పోర్టల్‌లో విద్యార్థి తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకుని, నచ్చిన కోర్సును ఎంపిక చేసుకుని ఆన్లైన్లోనే దరఖాస్తు ఫీజు చెల్లించి, ఆన్లైన్లోనే దరఖాస్తును పూరించే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు అధ్యక్షతన గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం.డోబ్రియాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ మీడియాతో ఈ వివరాలు వెల్లడించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ నెల 13న జీవో 74 ప్రకారం సీట్లు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాక యాజమాన్యాలు ఆ కేసుకు సంబంధించిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాయి. దీంతో హైకోర్టు కూడా తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని జీవో 66, 67 ప్రకారం ఆన్లైన్లో భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి పాత నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని, శనివారం కొత్త నోటిఫికేషన్ జారీచేయనుంది. నేరుగానూ సమర్పించవచ్చు.. అభ్యర్థులు ఆన్లైన్లోనే కాకుండా నేరుగా కూడా యాజమాన్యానికి దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు వివరించారు. ఒక అభ్యర్థి పలు కళాశాలలకు దరఖాస్తు చేసుకున్న పక్షంలో అన్ని కళాశాలల్లో సీటు వస్తే.. ఆ సీటు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. హైకోర్టు ఆదేశించినట్టుగా పిటిషన్‌దారులైన పలువురు కళాశాలల యాజమాన్యాలతో మండలి సమావేశం ఏర్పరిచి ఇలా బ్లాక్ అయ్యే పరిస్థితికి ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించేందుకు చర్చించనుంది. ఎంపిక అధికారం కళాశాలలకే.. జీవో 66, 67 ప్రకారం కళాశాలలు యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసుకునేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) వెబ్‌పోర్టల్‌ను రూపొందిస్తుంది. కళాశాలలు, విద్యార్థులకు సింగిల్ విండో తరహాలో వెసులుబాటు ఉండేందుకు ఈ పోర్టల్ ఏర్పాటు చేస్తారు. దరఖాస్తుల నుంచి ప్రతిభాక్రమం, ఎంపిక జాబితాను యాజమాన్యాలే రూపొందించుకునేందుకు ఈ వెబ్‌పోర్టల్ అధికారం కల్పిస్తుంది. విద్యార్థులు ఈ వెబ్‌పోర్టల్‌లో తాము కోరుకున్న కళాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ని కళాశాలలు ఎంచుకుంటే అన్ని దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కళాశాలలు దరఖాస్తు రుసుం వసూలు చేసుకోవచ్చు. ఎన్నారై కోటా, జేఈఈ-మెయిన్, ఎంసెట్, ఇంటర్ మార్కులు.. ఇలా అన్ని కేటగిరీలూ వర్తించే విద్యార్థులు.. వాటికి ప్రాధాన్యక్రమం ఎంచుకునే అవకాశమూ ఉంటుంది. విద్యార్థులు ఇంటర్నెట్లో పోర్టల్ ఓపెన్ చేసి కాలేజెస్ మెనూను క్లిక్ చేసి కావాల్సిన కళాశాలను క్లిక్ చేశాక అందులో అందుబాటులో ఉన్న సీట్లు, దరఖాస్తు రుసుం కనిపిస్తాయి. సీటుకు దరఖాస్తు చేసేందుకు ‘అప్లై ఆన్లైన్ బటన్’ నొక్కాక దరఖాస్తు ఫామ్ వస్తుంది. వివరాలన్నీ నింపి బ్రాంచీలను ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు రుసుంతో పాటు సీజీజీకి యూజర్ చార్జీలు చెల్లించాలి. వీటిని ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు లేదా నగదు రూపంలో ప్రభుత్వ అధీకృత కేంద్రాల్లోనూ చెల్లించే సదుపాయం ఉంటుంది. సంబంధిత మార్గదర్శకాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేయనుంది. స్వీకరించిన దరఖాస్తుల పరిస్థితి ఏంటి? ఆగస్టు 13న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పత్రికల్లో ప్రకటనలు జారీచేసి దరఖాస్తులు స్వీకరించిన కళాశాలల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ఉన్నత విద్యామండలి వద్ద సమాధానం లేదు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఆగస్టు 13న నోటిఫికేషన్ ఇచ్చామని, కళాశాలల యాజమాన్యాలు పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో హైకోర్టు కూడా ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకుందని, ఆ నేపథ్యంలోనే ఆగస్టు 13నాటి ప్రకటనను ఉపసంహరించుకుంటున్నామని ైచైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పేర్కొన్నారు.