ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల్లో జరుగుతున్న అక్రమాల విషయం తెలిసినప్పటికీ.. ఉన్నత విద్యామండలి చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. కొన్ని కాలేజీల యాజమాన్యాలు నిబంధనలను పూర్తిగా తుంగలోతొక్కి సీట్లను ఇష్టారీతిన అమ్ముకుంటున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. యాజమాన్య కోటా సీట్లకు కూడా కన్వీనర్ కోటా ఫీజునే అమలు చేయకపోయినా చేష్టలుడిగి చూస్తోందే తప్ప చర్యలపై ఆలోచించడం లేదు. ప్రతిసారీ ప్రవేశాల సమయంలో ‘ఈసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు’అంటూ హడావుడి చేయడం.. ఆ తర్వాత వదిలేయడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు వినబడుతున్నాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో కూడా పారదర్శకత ఉండాలని, మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఉన్నత విద్యామండలి నిమ్మకు నీరెత్తి్తనట్లు వ్యవహరిస్తోంది. ర్యాటిఫికేషన్ల సమయంలో యాజమాన్యాల నుంచి అందే ముడుపులు తీసుకుని వారు చేసే తప్పిదాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. యాజమాన్య కోటా సీట్ల కోసం వచ్చిన దరఖాస్తులెన్ని? ఈ తరహా నియామకాల్లో పారదర్శకత ఎంత అన్న దాన్ని మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలను ఎదుర్కొంటోంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ విషయంలో ఉన్నత విద్యా మండలి ఏం చేయాలి? దానికి ఉన్న అధికారాలు ఏంటి? అన్న అంశాలపై కనీస ధ్యాస లేకుండా అసలు రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ఉందా? లేదా? అన్నట్లుగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వం ఏం చేసిందంటే!
యాజమాన్య కోటా సీట్ల భర్తీలో పారదర్శకతను పెంపొందించడం, మెరిట్ విద్యార్థులకు సీట్లు లభించడం, అడ్డగోలుగా సీట్ల అమ్మకాలకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2011 సంవత్సరంలో జీవో నంబరు 74, 75లను, 2012లో జీవో నంబరు 66, 67లను జారీచేసింది. వాటిల్లోని వివిధ అంశాలపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా చివరకు 2014 ఆగస్టు 14న జీవో నంబరు 13, 14లను జారీ చేసింది. అయితే.. 2012లో జారీచేసిన జీవోలు 66, 67 ప్రకారమే యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. యాజమాన్య కోటాలో సీటు కోరుకునే ప్రతి విద్యార్థికీ దరఖాస్తు దక్కేలా, ఆ దరఖాస్తుల నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంపికయ్యేలా ఆదేశాలు జారీచేసింది.
ఆన్‌లైన్‌లో భర్తీకి మార్గదర్శకాలివే
అర్హత కలిగిన అధికార యంత్రాంగం (ఉన్నత విద్యామండలి) బీ–కేటగిరీ సీట్ల భర్తీకి సింగిల్ విండో తరహాలో ఒక వెబ్ పోర్టల్‌ను సిద్ధం చేయాలి. ఈ పోర్టల్‌లో ప్రతి కాలేజీకి ఒక యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇవ్వాలి. కాలేజీల్లోని ప్రతి కోర్సులో యాజమాన్య కోటాలో ఉండే సీట్ల వివరాలు అందుబాటులో ఉంచాలి. ఆ సీట్ల భర్తీకి కాలవ్యవధిని ఉన్నత విద్యామండలి నిర్దేశించాలి. మరోవైపు పత్రికల్లో, ఈ పోర్టల్‌లో ఆయా కాలేజీలు ప్రకటనలు ఇవ్వాలి. విద్యార్థులు ఆ పోర్టల్‌కు వెళ్లి తమకు కావాల్సిన కాలేజీకి దరఖాస్తు చేసుకోవాలి. ఒకే కాలేజీలో రెండు, మూడు కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. వాటి ఆధారంగా కాలేజీలు విద్యార్థులను ఎంపిక చేయాలి. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను కాలేజీలు తిరిగి వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. వారు మెరిట్ ప్రకారం ఎంపిక చేశారని.. ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్‌లైన్‌లోనే ఆమోదించాలి. లేదంటే తిరస్కరించాలి. ఇంకా సీట్లు మిగిలితే రెండో జాబితాను రూపొందించాలి.
ప్రభుత్వాన్ని సమర్థించిన హైకోర్టు
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో కూడిన ఈ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే జీవో 66, 67లను సమర్థిస్తూనే యాజమాన్యాలు కోరిన పలు అంశాలను ఆ జీవోల్లో చేర్చాలని న్యాయస్థానం సూచించింది. అందులో ముఖ్యంగా దరఖాస్తులు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో (విద్యార్థులు నేరుగా కాలేజీలకు వెళ్లి) దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, విద్యార్థిని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇవ్వాలని, వారి ఆర్థిక స్తోమత తెలుసుకొని సీట్లను కేటాయించే అవకాశం కల్పించాలని సూచించింది. ఒకవేళ యాజమాన్యం ఆ విద్యార్థి దరఖాస్తును తిరస్కరిస్తే.. కారణాలను ఉన్నత విద్యామండలికి కచ్చితంగా వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే అప్పటి వరకు 5% ఉన్న ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను కూడా 15% వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టింది. యాజమాన్య కోటా దరఖాస్తులను ఉన్నత విద్యామండలి పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
స్పష్టత ఉన్నా మండలి నిర్లిప్తత
మేనేజ్‌మెంట్ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేసేందుకు, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి మెరిట్ విద్యార్థులకు సీట్లను కేటాయించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా.. ఉన్నత విద్యామండలి ఏ ఒక్కటీ సక్రమంగా అమలుచేయడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ ప్రయత్నం చేసి వదిలేయగా, తెలంగాణ వచ్చాక ఆ దిశగా ఆలోచన చేయాలన్న ధ్యాస లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేలా, అడ్డగోలుగా సీట్లు అమ్ముకోకుండా చూడాలన్న ఆలోచనే కనిపించడం లేదు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులకు ఉన్నత విద్యామండలిలోని కొంతమంది అధికారులు అలవాటుపడ్డారు. వీరంతా మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీని యాజమాన్యాలకు అనుకూలమైన ఓ వ్యాపారంగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల ర్యాటిఫికేషన్ కోసం వచ్చే యాజమాన్యాలకు నిర్ణీత గడువు అనేది లేకుండా ముడుపుల బాగోతంలో ఎప్పుడు వస్తే అప్పుడు ఓకే చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరో నాలుగు నెలల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కనీసం వచ్చే విద్యా సంవత్సరంలోనైనా.. పక్కా చర్యలు చేపడతారా? లేదా? అన్న ఆందోళన తల్లిదండ్రులను వేధిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment