పైన పటారం.. లోన లొటారం!
‘మా కాలేజీలో అద్భుత సౌకర్యాలు కల్పిస్తున్నాం.. పరిమిత సీట్లున్నాయి.. మీ పిల్లల్ని వెంటనే చేర్పించండి.. ఆలస్యం చేస్తే సీటు దొరకడమే కష్టం.. అసలే మా కాలేజీకి గిరాకీ పెరిగింది..’ ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కాలేజీల యాజమాన్యాలు చెప్పే మాటలివి. తీరా లోపలికి వెళ్లాక చూస్తే అక్కడ సగం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి. ఇలా ప్రతిష్టకుపోయి పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా మారింది ప్రస్తుతం కాలేజీల పరిస్థితి.
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీట్ల భర్తీ దారుణంగా పడిపోయింది. అన్ని కోర్సుల్లో కూడా సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్‌తోసహా అన్ని కోర్సులదీ ఇదే పరిస్థితి. అనేక కాలేజీలు మూతపడే దశకు చేరుకున్నాయి. కొన్ని కాలేజీలు అరకొర విద్యార్థులతోనే కొనసాగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో విద్యార్థులు ఉన్నట్లు లెక్కచూపుతూ వారిని పక్కనే ఉన్న మరో కాలేజీల తరగతులకు పంపిస్తున్నాయి.
కాలేజీలు మూతవల్ల వచ్చే ప్రయోజనం ఉండదని, ఏదోలా కొనసాగిస్తే వచ్చే విద్యా సంవత్సరానికైనా చేరికలు పెరుగుతాయన్నది కొన్ని యాజమాన్యాల ఆశ. కాలేజీ ఏర్పాటు చేసి విద్యార్థులు చేరక మూసేశారన్న మాట రాకుండా ప్రతిష్ట కాపాడుకొనేందుకు పిల్లలు లేకపోయినా మరి కొందరు కాలేజీలను కొనసాగిస్తున్నారు.
వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఏటా 8 ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ తదితర కోర్సులకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో ప్రవేశాలకు ఎంసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్, బీఈడీ కోర్సులకు బీఎడ్, లా కోర్సుల ప్రవేశానికి లాసెట్, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు పీజీఈసెట్, బీటెక్ లేటరల్ ఎంట్రీ (డిప్లొమో విద్యార్థులు రెండో ఏడాది ప్రవేశానికి) ఈసెట్, పాలిటెక్నిక్ కోర్సుల కోసం పాలీసెట్లను నిర్వహిస్తోంది.
యాజమాన్య కోటాలో మరింత అధ్వానం
2017 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈనెలలో నోటిఫికేషన్ వెలువరించనున్న దశలోనూ కొన్ని కాలేజీలు తమ సంస్థల్లో ప్రవేశాలను నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ ప్రవేశాలను అనుమతించాలంటూ అవి ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలూ అందిస్తున్నాయి. గడువు ముగిసిపోయి ప్రవేశాలు జరుపుతున్నా సీట్లు సగానికి దాటకపోవడం విశేషం. కన్వీనర్ కోటాలోని సీట్లే మిగిలిపోయిన తరుణంలో ఇక యాజమాన్యకోటా సీట్ల భర్తీ మరింత అధ్వానంగా ఉంది.