*ఇంజనీరింగ్ కళాశాలలు నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే
*కళాశాలల్లో తనిఖీలకై నిపుణులు కమిటీ నియామకం
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారానే మరింత మెరుగైన విద్యను విద్యార్థులకు అందించడం సాధ్యమవుతుందని, తద్వారా విద్యార్థులకు ఉద్యోగవకాశాలు ఎక్కువగా లభించే ఆస్కారం ఏర్పడుతుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఉదయం ఆయన సచివాలయంలోని తన చాంబర్లో ఉన్నత విద్యపై ఉన్నతవిద్యాశాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి ఉన్నత విద్యారంగం అత్యంత కీలకమని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించగలుగుతామని అన్నారు.
రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలంటే నాణ్యమైన విద్యకు ఏపీ కేరాఫ్ అడ్రస్గా నిలవాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కళశాలల ఏరివేతకు తీసుకోవాల్సిన చర్యలపై అనంతరం మంత్రి అధికారులతో చర్చించారు. ఏఐసిటీఈ నిబంధనలు పాటించని కళాశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలల్లో తనిఖీలకు విజిలెన్స్, పోలీసుల ప్రమేయం లేకుండా నిపుణులతో కూడిన కమిటీ వేస్తే మంచిదని మంత్రి గంటా సూచించారు. ఈ సూచనతో ఏకీభవించిన ఉన్నతాధికారులు 5 మందితో కమిటీ వేయాలని అభిప్రాయపడ్డారు.
కాగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 40 కళాశాలల్లో ఈ కమిటీ తనిఖీలు చేపట్టనుంది. ఏఐసీటీయూ నిబంధనలకు అనుగుణంగా టీచింగ్ ఫ్యాకల్టీ, వారి విద్యార్హతలు, ఒక అధ్యాపకుడు మరే ఇతర కళాశాలల్లో పనిచేస్తున్నారా ? అన్న అంశాలపై కమిటీ విచారిస్తుంది.
ఇప్పటికే ఎఎప్ఆర్సి కి ఆయా కళాశాలలు అందించిన డేటా పై కూడా పునర్ విచారణ చేపడుతుంది. ఇచ్చిన డేటా సరైనదా ? కాదా అన్న విషయాలపై నిశీత పరిశీలన జరపనుంది. పరిపాలన పరమైన ఖర్చులపై అందించిన వివరాలపైనా ఆరా తీస్తుంది. త్వరలో ఈ కమిటీ నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ సమీక్షా సమావేశంలో ఉన్నతవిద్య మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మీ, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.