ఇంజనీరింగ్‌ కాలేజీల ‘ప్రత్యేక’ దోపిడీ | Huge fees taking in the engineering colleges in the name of project reports | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కాలేజీల ‘ప్రత్యేక’ దోపిడీ

Published Sun, Apr 16 2017 3:53 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

ఇంజనీరింగ్‌ కాలేజీల ‘ప్రత్యేక’ దోపిడీ

ఇంజనీరింగ్‌ కాలేజీల ‘ప్రత్యేక’ దోపిడీ

ప్రాజెక్టు రిపోర్టులు స్వీకరించేందుకు ఫీజుల వసూళ్లు
- ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా దండుకుంటున్న వైనం
- చెల్లించకుంటే ప్రయోగ పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తామని బెదిరింపు
- దిక్కుతోచని స్థితిలో సొమ్ము కడుతున్న విద్యార్థులు
- వర్సిటీ దృష్టికి వెళ్లిన వ్యవహారం.. పలు కాలేజీలకు నోటీసులు


షేక్‌ ఒవైసీ అనే విద్యార్థి ఎల్‌బీనగర్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఫైనలియర్‌ చదువుతున్నాడు. చివరి సంవత్సరంలో ప్రతి విద్యార్థి కోర్సుకు సంబంధించిన అంశంపై పరిశోధన చేసి, ప్రాజెక్టు నివేదిక సమర్పించాలి. ఒవైసీ తనకు కేటాయించిన అంశంపై ప్రాజెక్టు పూర్తిచేసి, రిపోర్టు సమర్పించేందుకు కాలేజీకి వెళ్లాడు. కానీ రూ.6,500 చెల్లిస్తేనే రిపోర్టు తీసుకుంటామని కాలేజీ సిబ్బంది కొర్రీ పెట్టారు. దీంతో తప్పని పరిస్థితిలో ఆ సొమ్ము చెల్లించాల్సి వచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కాలేజీలు చిల్లర వసూళ్లకు తెగబడుతున్నాయి. అవకాశం చిక్కినప్పుడల్లా విద్యార్థుల నుంచి అదనపు ఫీజుల పేరిట దండుకుంటున్నాయి. తాజాగా ఫైనలియర్‌ విద్యార్థులు ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించాల్సిన తరుణం రావడంతో కొత్త దోపిడీకి తెరతీశాయి. ప్రాజెక్టు రిపోర్టు సమర్పించే విద్యార్థుల నుంచి ప్రత్యేక ఫీజు పేరిట వసూలు చేస్తున్నాయి. చెల్లించకపోతే రిపోర్టు తీసుకునేది లేదని, ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తామని బెదిరిస్తున్నాయి. ఇలా అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నా.. ఆ సొమ్ముకు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడం గమనార్హం.

ఒక్కో విభాగంలో ఒక్కో రకంగా..
రాష్ట్రంలో 214 ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయి. వాటిలో దాదాపు 1.5 లక్షల మంది వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. అందులో ఏటా 35 వేల మంది కోర్సు పూర్తి చేస్తున్నారు. చివరి సంవత్సరం విద్యార్థులు ప్రత్యేకంగా ఒక అంశంపై పరిశోధన చేసి నివేదిక (రిపోర్టు)ను కాలేజీలో సమర్పించాలి. ఆ పరిశోధన తాలూకు ఆవిష్కరణలు కూడా చూపాలి. ప్రాజెక్టు కోసం విద్యార్థులే సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టును బట్టి ఒక్కో విద్యార్థి సగటున రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తారు. ఇది ఇప్పటికే పేద విద్యార్థులకు భారంకాగా.. ఈ ప్రాజెక్టు అంశాన్ని అడ్డుపెట్టుకుని కాలేజీలు దోపిడీకి తెరతీశాయి.

ప్రాజెక్టు కేటాయించే సమయం నుంచి రిపోర్టు సమర్పించే వరకు ప్రత్యేకంగా ఫీజులు నిర్ణయించి వసూలు చేస్తున్నాయి. చెల్లిస్తేనే ప్రాజెక్టు రిపోర్టు తీసుకుంటామని, లేకుంటే ప్రయోగ పరీక్షలో ఫెయిల్‌ చేస్తామని బెదిరిస్తున్నాయి. ఘట్‌కేసర్‌ మండలం నారపల్లిలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ ఒక్కో విద్యార్థి నుంచి ఏకంగా రూ.13 వేలు వసూలు చేస్తోంది. జనగామలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ రూ.8 వేలు, ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని కాలేజీ, కర్మన్‌ఘాట్‌లోని కాలేజీ, హన్మకొండలోని మరో కాలేజీ రూ.6,500 చొప్పున, ఉప్పల్‌లోని మరో కాలేజీ రూ.5 వేలు, కీసరలోని కాలేజీ రూ.4 వేలు, ఘట్‌కేసర్‌ కేంద్రంలోని కాలేజీలు రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల రసీదులు ఇస్తుండగా.. కొన్ని యాజమాన్యాలు తూతూమంత్రంగా ఓ రిజిస్టర్‌లో రాసుకుంటున్నాయి. అయితే పేద విద్యార్థులు ఈ ప్రత్యేక ఫీజులతో ఇబ్బందిపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లిస్తున్నారు.

గవర్నర్‌కు ఫిర్యాదు
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రత్యేక ఫీజుల దోపిడీపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌లతో పాటు జేఎన్టీయూహెచ్‌ వీసీకి ఇప్పటికే ఫిర్యాదులు చేయగా.. శనివారం గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ వసూళ్లను నిలిపివేయాలని, ఇప్పటికే ఫీజులు చెల్లించిన విద్యార్థులకు తిరిగి ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను కోరారు.

ఇలా వసూలు చేయడం అక్రమమే..
విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించి ప్రత్యేక పట్టిక రూపొందించి ఇస్తాం. ఆమేరకు మాత్రమే కాలేజీలు వసూలు చేయాలి. అలాగాకుండా విద్యార్థులు ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించే క్రమంలో ఫీజులు వసూలు చేయడం సరికాదు. దీనిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేశాం. వివరణ తీసుకున్నాక తగిన చర్యలు తీసుకుంటాం. కర్మాన్‌ఘాట్‌ సమీపంలోని ఓ కాలేజీ వసూలు చేసిన ఫీజులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది.
    – యాదయ్య, జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement