* ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు స్పష్టం చేసిన హైకోర్టు
* ఎన్నారై కోటా 15 శాతం భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్ ద్వారానే భర్తీ చేయాలని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ జీవో 66ను సమర్థించింది. విద్యార్థుల ప్రయోజనం కోసం జారీ చేసిన ఈ జీవో విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే సీట్ల భర్తీకి సంబంధించి యాజమాన్యాలకు ధర్మాసనం కొన్ని వెసులుబాటులు ఇచ్చింది. విద్యార్థులకు నేరుగా కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంచడంతో పాటు వారి నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించాలని స్పష్టం చేసింది.
అలా నేరుగా, మరోవైపు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నీ కలిపి మెరిట్ జాబితా తయారుచేయాలని ఆదేశించింది. విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలనతో పాటు, వారి స్థితిగతులు, ప్రవర్తన తదితర విషయాలను యాజమాన్యాలు తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా విద్యార్థి ప్రవేశాన్ని తిరస్కరిస్తే, అందుకు సహేతుక కారణాలను తెలియజేయాలని, అలాగే ఆ విద్యార్థితో పాటు ఉన్నత విద్యామండలికి సమాచారం ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించింది.
అలాగే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పూరించే సమయంలో విద్యార్థులు పలు కాలేజీల్లో సీట్లను రిజర్వ్ చేసుకునే (మల్టిపుల్ బ్లాకింగ్) అంశంపై యాజమాన్యాలు వ్యక్తంచేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంది. ఈ సమస్య పరిష్కారానికి అటు యాజమాన్యాలు, ఇటు ఉన్నత విద్యామండలి అధికారులు పరస్పరం చర్చించుకుని, పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలని సూచించింది. ప్రవాస భారతీయులు (ఎన్నారై) కోటాను 15 నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
గతంలో ఉన్నట్లుగానే 15 శాతం మేర భర్తీ చేసుకోవచ్చునని యాజమాన్యాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శ్రేయాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రేయాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ అనంతుల వినయ్‌కుమార్‌రెడ్డి, మరికొందరు దాఖలుచేసిన పిటిషన్లను పరిష్కరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణిలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
‘ఏపీసెట్ దరఖాస్తుల్లో తప్పులు దిద్దుకోండి’
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీసెట్-2013) దరఖాస్తుల్లో దొర్లిన తప్పులు సరిచేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్టు ఏపీసెట్ సభ్య కార్యదర్శి ఆచార్య రాజేశ్వరరెడ్డి తెలిపారు. సవరించిన దరఖాస్తులను ఈ నెల 31లోపు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏపీసెట్ కార్యాలయంలో లేదా, మెయిల్, లెటర్స్ ద్వారా తమకు అందజేయాలని కోరారు. www.apset.org/apset 2012@gmail.com అనే వెబ్‌సైట్ ద్వారా తప్పులు సరిదిద్దుకోవచ్చని తెలిపారు.
ఆన్‌లైన్‌లోనే యాజమాన్య కోటా భర్తీ
Published Wed, Aug 21 2013 2:55 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement