సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కసరత్తు తీవ్రతరం చేశారు. జిల్లా కలెక్టర్ హరి కిరణ్ నేతృత్వంలో ఆయా శాఖలకు సంబంధించిన పోస్టుల విషయంలో మెరిట్‌జాబితాతోపాటు కటాఫ్, అర్హతపొందిన అభ్యర్థుల జాబితాను రూపొందిస్తున్నారు.
సాక్షి కడప : జిల్లావ్యాప్తంగా 7791 పోస్టులకు ఈనెల మొదటి వారంలో జరిగిన పరీక్షకు 1,30,966 మంది హాజరయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఈనెల 19న రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. రెండురోజులుగా కలెక్టరేట్‌తోపాటు వివిధ విభాగాల్లోనూ, సంబంధిత శాఖ కార్యాలయాలలోనూ తుది ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు, నాలుగు రోజులుగా అధికారులంతా ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. రెండు రోజుల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశముంది. జిల్లాలో సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ లిస్టుతోపాటు ఇతర జాబితాలను రెండు శాఖల అధికారులు ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
మత్స్యశాఖతోపాటు సెరికల్చర్‌శాఖకు సంబంధించి తక్కువ పోస్టులు ఉండడంతో....వేగవంతంగా ప్రక్రియ ముగిసింది. మిగతా విభాగాలలో ఎక్కువ పోస్టులతోపాటు అభ్యర్థులు కూడా ఎక్కువగానే ఉండడంతో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు శాఖల జాబితా మంగళవారం వెలువడనున్న నేపథ్యంలోలో మిగతా మరికొన్ని శాఖలకు సంబంధించిన అభ్యర్థుల అర్హత జాబితాపై కసరత్తు చేస్తున్నారు.ఎంపికైన అభ్యర్థుల ఈ మెయిల్ ఐడీతోపాటు ఫోన్ మెసెజ్ ద్వారా సమాచారం పంపనున్నారు. సమాచారం అందుకున్న అభ్యర్థులు ఆయా తేదీల్లో సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
పక్కాగా జాబితా :కలెక్టర్
తుది జాబితాను పక్కాగా రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి కిరణ్ వెల్లడించారు. ఎక్కడా కూడా తప్పిదం జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే రెండు శాఖల జాబితా వెల్లడైందన్నారు. మిగిలిన శాఖల జాబితాకు ఒకటి, రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. రెండు రోజుల్లో జాబితాల ప్రక్రియ పూర్తయ్యాక కాల్‌లెటర్లు పంపుతామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment