68,747కు చేరిన కన్వీనర్ కోటా సీట్లు | 68.747 to joining the convener quota seats | Sakshi
Sakshi News home page

68,747కు చేరిన కన్వీనర్ కోటా సీట్లు

Published Sat, Jul 9 2016 12:17 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

68.747 to joining the convener quota seats

- మరో 19 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు
- వాటిల్లోని నాలుగు కాలేజీలు జనరల్ కౌన్సెలింగ్ లోకి మిగతా వాటిల్లో మైనారిటీ కోటాలో భర్తీ
 
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల సంఖ్య పెరిగింది. ముందుగా ప్రకటించిన ప్రకారం కన్వీనర్ కోటాలో 65,379 సీట్లు అందుబాటులోకి రాగా, తాజాగా ఆ సంఖ్య 68,747కు చేరింది.  హైకోర్టు ఆదేశాలతో మరో 19 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. దీంతో వాటిల్లోని కొన్ని కాలేజీలు జనరల్ కౌన్సెలింగ్ పరిధిలోకి వస్తుండటంతో 3 వేల సీట్లు అదనంగా వచ్చాయి. వాటిని ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెబ్ ఆప్షన్ల జాబితాలో చేర్చింది. విద్యార్థులు వాటిల్లోనూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మరోవైపు ఎంసెట్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌లో మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొత్తగా మరిన్ని కాలేజీలు రావడంతో వెబ్ ఆప్షన్లను మరో 2 రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

13 కాలేజీల్లో ఫీజులు ఖరారు
 అనుబంధ గుర్తింపు లభించిన మిగతా కాలేజీలు మైనారిటీ కేటగిరీలో సొంతంగా ప్రవేశాలు చేపట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆయా కాలేజీల్లో లోపాలు ఉండటంతో జేఎన్‌టీయూహెచ్ మొదట వాటికి అనుబంధ గుర్తింపు నిరాకరించింది. దీంతో యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా.. అనుబంధ గుర్తింపును మంజూరు చేసింది. మరోవైపు గురువారం 5 కాలేజీల్లో ఫీజులను ఖరారు   చేసిన ప్రభుత్వం.. శుక్రవారం మరో 13 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా వచ్చిన కాలేజీల్లో షాదాన్‌కు రూ.38 వేలు, సయ్యద్ హస్మిమ్‌కు రూ.35 వేలు, ఖదీర్ మెమోరియల్ కాలేజీకి రూ.50 వేలు, మెదక్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు రూ.45 వేలు, రాయల్ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.35 వేలు, షాదాన్ ఉమెన్స్ కాలేజీకి రూ.35 వేలు, నవాబ్ షా ఆలామ్‌ఖాన్ కాలేజీకి రూ.68 వేలు, శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీకి రూ.45 వేలు, నారాయణ ఇంజనీరింగ్ కాలేజీకి రూ.35 వేలుగా నిర్ణయించింది. అలాగే షాదాన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి రూ. 35 వేలు, షాదాన్ ఉమెన్స్ కాలేజీ ఆఫ్ ఫార్మసీకి రూ.35 వేలు, అన్వరుల్ ఉలుమ్ కాలేజీకి రూ.42 వేలు, అదే యాజమాన్యానికి చెందిన మరో కాలేజీకి రూ.70 వేలుగా ఫీజును నిర్ణయించింది.

 ఆప్షన్లు ఇచ్చుకున్నది 55,019 మంది
 ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 1 నుంచి  90 వేల ర్యాంకు వరకు  విద్యార్థుల్లో 57,122 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాగా, శుక్రవారం రాత్రి వరకు అందులో 55,019 మంది విద్యార్థులు 27,26,753 ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక 45,001 నుంచి 90 వేల ర్యాంకు లోపు విద్యార్థులు శనివారం ఉదయం 10 గంటల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. 90,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థులకు శుక్రవారం లాగిన్ ఐడీలను పంపించామని, వారు కూడా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వివరించారు.   ఇప్పటివరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నవారు.. 9, 10 తేదీల్లో ఇచ్చే వారు మొత్తంగా 10, 11 తేదీల్లో వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement