ప్రొద్దుటూరు: ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణలో తీవ్ర జాప్యం కావడంతో చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ను కాదనుకుని డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. అనేక మంది పొరుగు రాష్ట్రాలైన చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇంజనీరింగ్ కోర్సులలో చేరారు. దీంతో జిల్లాలో ఈ ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. జిల్లాలో మొత్తం 22 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ యోగివేమన యూనివర్సిటీ, పులివెందులలో ఉన్న జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి.
మిగతా 20 కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ కాని పరిస్థితి నెలకొంది. అడ్మిషన్ల తీరు చాలా అధ్వానంగా ఉందనే చర్చ జరుగుతోంది. సాధారణంగా జూన్ లేదా జూలై నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమైతే ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే రాష్ట్ర విభజన పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మరింత జాప్యం ఏర్పడింది. మే 22న నిర్వహించిన ఎంసెట్ పరీక్షకు జిల్లాలో 7100 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, 2542 మంది మెడిసిన్ పరీక్షకు హాజరయ్యారు. జూన్ నెలలోనే ఎంసెట్ ఫలితాలు వెలువడినా కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించబోమని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో కౌన్సెలింగ్‌పై చివరకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 7వ తేదీ నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. కర్నాటక, తమిళనాడులోని పలు కళాశాలలు జూలై, ఆగస్టు నెలల్లోనే తరగతులు ప్రారంభించాయి.
ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులు సిలబస్ పూర్తి కావడం ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నాయని గమనించి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. మరికొందరు డిగ్రీ కోర్సుల్లో చేరారు. దీంతో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య రెండు అంకెలకు మించలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది.
ఈ ఏడాది రాష్ట్ర విభజన జరిగిందని, మన విద్యార్థులు ఎక్కువగా జిల్లాలోనే చేరుతారని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే తీరా అడ్మిషన్ల పరిస్థితి చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది.
ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయినా రెండో విడత కౌన్సెలింగ్ జరగలేదు. దీనికితోడు ఇంకా తరగతులు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో గతంలో కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడగా ఈ ఏడాది ప్రొద్దుటూరు, పులివెందులలోని ప్రభుత్వ కళాశాలలతోపాటు 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం 9120 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ముగిసిన తొలివిడత కౌన్సెలింగ్‌లో 2958 సీట్లు భర్తీ అయ్యాయి.
ఇంజ‘నీరు’గారుతోంది!
Published Wed, Sep 10 2014 2:27 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement