సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక నుంచి మూడేళ్ల డిగ్రీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు అమల్లోకి రానుంది. ఈ మేరకు ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరే విద్యార్థులు మూడేళ్ల అనంతరం ఆ కోర్సును మధ్యలో ముగించుకొనేలా ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చారు. ఈ కోర్సులో పది నెలల పాటు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో డిగ్రీ చదివే విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌తో కూడిన నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులను 2020–21 నుంచి ప్రవేశపెట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే విద్యాశాఖకు సూచించారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి కసరత్తు చేసి ప్రణాళికను రూపొందించాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతికి పంపగా మూడేళ్ల డిగ్రీ కోర్సులు మాత్రమే దేశంలో ఉన్నందున ఆ విధంగానే అమలు చేయాలని సూచించింది. దీంతో ఉన్నత విద్యామండలి మూడేళ్ల డిగ్రీ కోర్సులను కొనసాగిస్తూనే పది నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉండేలా ప్రణాళికను రూపొందించింది. ఈలోగా జాతీయ నూతన విద్యావిధానం–2020లో కేంద్ర ప్రభుత్వం బహుళ నిష్క్రమణ అవకాశాలుండేలా 3, 4 ఏళ్ల కాలపరిమితితో డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టాలని పేర్కొంది. ప్రాజెక్టు వర్కులు, ఇంటర్న్‌షిప్‌లతో నైపుణ్యాలు మెరుగుపర్చేలా డిగ్రీ కోర్సులుండాలని స్పష్టం చేసింది.
ఆ కోర్సులు ఇక ఉండవు..
ఈ ఏడాది ఆగస్టు 6న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశ పెట్టాలని, 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ విద్యార్థులకు మూడేళ్ల తరువాత ఎగ్జిట్ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు వేర్వేరుగా అమల్లో ఉన్న మూడేళ్ల నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, నాలుగేళ్ల ప్రొఫెషనల్ కోర్సులన్నీ రద్దయ్యాయి. వాటి స్థానంలో మూడేళ్ల ఎగ్జిట్ ఆప్షన్‌తో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ అమల్లోకి రానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి.. అన్ని యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల విద్యా నిపుణులతో సిలబస్ రివిజన్‌ను చేయించింది. ఆయా వర్సిటీలు సంబంధిత విభాగాల అనుమతితో వీటిని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ
Published Wed, Dec 23 2020 3:21 AM | Last Updated on Wed, Dec 23 2020 5:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment