విద్యార్థుల జీవితాలతో చెలగాటం | Zero marks for students who have the talent to make | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

Published Wed, Oct 1 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

జవాబు పత్రాల మూల్యాంకనంలో జేఎన్టీయూహెచ్ నిర్లక్ష్యం 
ప్రతిభ గల విద్యార్థులకూ పదిలోపు మార్కులు

 
 కొన్ని సబ్జెక్టుల్లో మూకుమ్మడిగా ఫెయిల్ చేసిన వైనం
 అనర్హులు దిద్దుతున్న ఫలితం
 బ్యాక్‌లాగ్స్‌తో దూరమవుతున్న ఉద్యోగావకాశాలు 
ఫీజులపైనే అధికారుల దృష్టి
యూనివర్సిటీ తీరుపై విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి

 
హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థులకు సున్నా మార్కులు రావడం, అనామకుడికి సైతం అరవై శాతం మార్కులు వేయడం జేఎన్టీయూహెచ్‌కే చెల్లింది. ఒకప్పుడు సాంకేతిక విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(హైదరాబాద్) ప్రతిష్ట మసకబారుతోంది. అరకొర వసతులతోనే ఉన్నంతలో కష్టపడి చదివి పరీక్షలు రాస్తున్న  విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ వర్సిటీ పరీక్షల విభాగం ఘోరంగా విఫలమవుతోంది. ఇష్టారీతిలో మార్కులేస్తూ మూకుమ్మడిగా విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారు. నాలుగేళ్లపాటు బీటెక్ చదివి 80 శాతం మార్కులు సాధించినా, బ్యాక్‌లాగ్స్ కారణంగా  ఉద్యోగావకాశాలకు అర్హత సాధించలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో ఆశలతో బీటెక్‌లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యార్థులకు జరుగుతున్న నష్టానికి బాధ్యత వహించేందుకు కళాశాలల యాజమాన్యాలు, జేఎన్టీయూహెచ్ అధికారులు సిద్ధంగా లేకపోవడం గమనార్హం.

ఇవేం మార్కులు బాబోయ్!

యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట కొన్ని సబ్జెక్టులు పీడకలగా మారాయి. కంప్యూటర్ సైన్స్‌లో కొన్ని, ఈసీఈ గ్రూప్‌లో కొన్ని సబ్జెక్టులను బోధించేందుకు అర్హులైన అధ్యాపకులే దొరకడం లేదు. ఒకవేళ ఉన్నా, విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దేందుకు తగిన విషయ నిపుణులు ఉన్నారా అన్నదీ ప్రశ్నార్థకమే! మేడ్చల్ పరిధిలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో ఎక్కువమంది ‘వెబ్ టెక్నాలజీ’ సబ్జెక్టులో ఫెయిల్ కావడమే ఇందుకు ఉదాహరణ. ఈ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్న 41 మంది విద్యార్థులు.. ఇటీవలి సెమిస్టర్ పరీక్షలో  వెబ్ టెక్నాలజీ సబ్జెక్టు మినహా మిగిలినవన్నీ పాసయ్యారు. కోర్సు మొత్తం కలిపి 80 శాతం మార్కులు వచ్చిన ఓ విద్యార్థికి  సైతం వెబ్ టెక్నాలజీ సబ్జెక్టులో ఆరు మార్కులు వచ్చాయి. 75 శాతం మార్కులున్న మరో విద్యార్థికి ఈ సబ్జెక్టులో 2 మార్కులు రాగా, 79 శాతం మార్కులున్న ఇంకొకరికి 15 మార్కులే వచ్చాయి. ఇలా మార్కులు వచ్చిన వేలాది మంది విద్యార్థులు చేసేది లేక రూ. 1000 చెల్లించి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. నెల దాటినా జేఎన్టీయూహెచ్ అధికారులు రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేయలేదు. మరోవైపు నవంబరు 17 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనుండడంతో దిక్కుతోచని పరిస్థితి విద్యార్థులది. ఇదే రీతిన పలు కాలేజీల్లోని విద్యార్థులు మెఫా, నెట్‌వర్క్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులతో బెంబేలెత్తిపోతున్నారు.

భవిష్యత్తుపై గొడ్డలి పెట్టు

ఇలాంటి మూల్యాంకనం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. కొన్ని సబ్జెక్టుల్లో పాస్ కాని విద్యార్థులను ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలకు పిలవడం లేదు. దీంతో ప్రతిభావంతులు కూడా నిరాశకు గురవుతున్నారు. వర్సిటీ పరిధిలోని 319 అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాక్‌లాగ్ లేకుండా బయటకు వెళ్లిన విద్యార్థులు ఎంతమందో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి ఉంది.  తమకు ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు అడిగితే రూ.100 చెల్లించి రీకౌంటింగ్/రూ.1000చెల్లించి రీవాల్యుయేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆపై చాలెంజ్ ఎవాల్యుయేషన్ కావాలంటే రూ. 10 వేలు, ఆన్సర్ బుక్‌లెట్ జిరాక్సు కావాలంటే రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌లో పాసైన విద్యార్థులకు వారు చెల్లించిన సొమ్మును వాపసు ఇవ్వటం లేదు. జవాబు పత్రాలు దిద్దిన ఆచార్యుడో లేదా మార్కులను కంప్యూటర్‌లో నమోదు చేస్తున్న వర్సిటీ సిబ్బందో తప్పు చేస్తే, శిక్ష మాత్రం విద్యార్థులే అనుభవిస్తున్నారు. అనుభవజ్ఞులైన వర్సిటీ ప్రొఫెసర్లతో కాకుండా ప్రైవేటు కాలేజీలకు చెందిన అర్హత లేని అధ్యాపకులతోనే మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నారు. అరకొర పరిజ్ఞానంతో సదరు ఆధ్యాపకులు జవాబు పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే ఇష్టమొచ్చినట్లుగా మార్కులు వేసి విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారు.         
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement