సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రెండేళ్లుగా స్నాతకోత్సవం నిర్వహణ తేదీలు వరుసగా పలుమార్లు వాయిదా పడుతుండడంతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు వర్సిటీ సిబ్బందిలోనూ అయోమయం నెలకొంది.
ఈ అయోమయానికి తెరదించుతూ సెప్టెంబరు 4న ఉదయం 11 గంటల నుంచి స్నాతకోత్సవం నిర్వహించాలని వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి యూనివర్సిటీల చాన్స్‌లర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ నుంచి అనుమతి కూడా లభించింది. సుమారు లక్షమంది విద్యార్థులకు ఒరిజనల్ డిగ్రీ పట్టాలు, ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, పరిశోధనలు పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీలను స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారు.
ఓడీ దరఖాస్తులకు గడువు పెంపు..
జేఎన్టీయూహెచ్ పరిధిలో పరిధిలో 4 అనుబంధ, 448 ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4.5లక్షలమంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తుండగా, ప్రతియేటా 70-80వేలమంది విద్యార్థులు తమకోర్సులు పూర్తి చేసుకొని ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళుతుంటారు. స్నాతకోత్సవం అనంతరం విద్యార్థులందరికీ ఒరిజినల్ డిగ్రీలను యూనివర్సిటీ అందజేస్తుంది. వచ్చేనెల 4న స్నాతకోత్సవానికి జరగనున్న నేపథ్యంలో.. ఆన్‌లైన్లో ఓడీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని ఈనెల 11 వరకు పొడిగించారు. 2012-13 సంవత్సరానికి చెందిన విద్యార్థులు 59 వేలమంది, 2013-14 సంవత్సరానికి చెందిన విద్యార్థులు 39 వేలమంది ఇప్పటికే ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు.
50 మందికి గోల్డ్ మెడల్స్ ..
2013-14 విద్యా సంవత్సరానికి గాను జేఎన్టీయూహెచ్ బంగారు పతకాలకు ఎంపికైన విద్యార్థుల్లో జేఎన్టీయూ హైదరాబాద్ కళాశాల నుంచి ప్రణవినాయుడు(సివిల్), జ్యోతి(ఈఈఈ), స్నేహ(మెకానికల్), హర్షిత(ఈసీఈ), సుజన(సీఎస్‌ఈ), అఖిలకృష్ణ(మెటలర్జీ), మంథని కళాశాలకు చెందిన అన్వేష్(సివిల్), భాస్కర్(మైనింగ్), వెంకటేశ్(మైనింగ్ మెషినరీ), జగిత్యాల కళాశాలకు చెందినశంతన్‌తేజ(ఈఈఈ), సంధ్యారాణి(మెకానికల్), రహేలా(ఈసీఈ), సృజన(సీఎస్‌ఈ), నవ్య(ఐటీ) ఉన్నారు. ఈసీఈ విద్యార్థిని హర్షితకు ఏకంగా ఐదు బంగారు పతకాలు, ప్రణవి నాయుడు మూడు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. వీరితో పాటు మరో 24మంది ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు గోల్డ్‌మెడల్స్‌కు ఎంపికైనట్లు యూనివ ర్సిటీ అధికారులు వెల్లడించారు.
4న జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవం
Published Sat, Aug 9 2014 5:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement