స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల్లో మేధోపరమైన ఎదుగుదల దెబ్బతింటోంది. ఫలితంగా విద్యార్థులు చదువుల్లోనూ వెనుకబడిపోతున్నారు. ఈ అలవాటు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తోందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తాజాగా వెలుగు చూస్తున్న సర్వేలలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి.
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్ల వినియోగం పాఠశాలలు, కాలేజీ స్థాయి పిల్లల్లో విపరీతమైన మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతోందని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విచ్చలవిడిగా మారడం, సరైన పర్యవేక్షణ లేమితో విద్యార్థులలో అత్యధిక శాతం మంది పక్కదారి పట్టే ప్రమాదం ఏర్పడుతోందని సర్వేలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై అతి ప్రేమ లేదా ఇవ్వకుంటే ఏమి చేసుకుంటారోనన్న భయంతో స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు.
ఆటపాటలతో ఇంట్లో సందడి చేయాల్సిన పసి పిల్లలకు సైతం స్మార్ట్ ఫోన్లను అలవాటు చేయడం ఇలాంటి దుష్పరిణామాలు మరింతగా పెరగడానికి కారణమవుతోంది. పిల్లలు మారాం చేస్తున్నారనో.. అల్లరి చేయకుండా ఉంటారనో వారికి ఆట బొమ్మలకు బదులుగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం ఇటీవల పెరిగిపోయింది. చిన్నతనం నుంచే ఇలా చేయడం వల్ల పిల్లల్లో మేధోపరమైన ఎదుగుదల దెబ్బతింటోందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క పాఠశాల పిల్లల్లో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి.
స్మార్ట్ ఫోన్లు, డేటా ప్యాక్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత వీటి వినియోగం కాస్తా వ్యసనంగా మారిందని ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరుగుతుండటంతో విద్యార్థులు, యువత మానసిక, ఆరోగ్యపరమైన సమస్యలకు లోనవుతున్నారని తేల్చిచెప్పింది. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల పేరుతో స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత నుంచి ఇది తీవ్రరూపం దాల్చింది. అవసరం లేకున్నా పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలు చేరుతుండటం, పెద్దల పర్యవేక్షణ కరవవటంతో విపరిణామాలకు దారితీస్తోందని సర్వే సందర్భంగా నిపుణులు స్పష్టం చేశారు.
టీనేజ్ పిల్లల్లో 71 శాతం ఫోన్లలోనే..
► 9 నుంచి 13 ఏళ్లలోపు పిల్లలు పాఠశాల సమయం తరువాత ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలో తేలింది.
► 13 నుంచి 17 మధ్య వయసు పిల్లల్లో 71 శాతం మంది పాఠశాలలతోపాటు బయట కూడా ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లలో చాటింగ్ చేస్తున్నారని వెల్లడైంది.
► 9 నుంచి 13 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియాలో వీడియోలను, ఆన్‌లైన్ గేమ్‌లతో గంటలకొద్దీ గడిపేస్తున్నారు. తల్లిదండ్రుల మాట అసలు వినడం లేదు.
► గట్టిగా చెబితే తమపై తిరగబడే పరిస్థితులు ఎదురవుతున్నాయని 47 శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించారు.
► 13 ఏళ్లలోపు వారు కూడా సోషల్ మీడియా ఖాతాలు తెరిచి చాటింగ్, ఇతర వ్యవహారాల్లో మునిగిపోతున్నారు.
► కేంద్ర ప్రభుత్వం 2017లో మెంటల్ హెల్త్ కేర్ చట్టాన్ని తెచ్చినా.. ఇంటర్నెట్ వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు నిర్దిష్ట రక్షణ చర్యలు పొందుపర్చకపోవడంతో పరిస్థితి చేయి దాటుతోందని సర్వేలో వివరించారు.
► ఐటీ చట్టంలోనూ అనేక సవరణలు చేయాల్సిన అవసరముందని వారు పేర్కొంటున్నారు.
► పబ్జి వంటి గేమ్స్ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తి కొన్నిసార్లు హింసా ప్రవృత్తికి కారణమవుతోందని పేర్కొంటున్నారు. అవాంఛనీయ సైట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని తెలిసో తెలియకో చూసి అనుసరించే పిల్లలు వాటిలో నిమగ్నమవుతూ మానసిక, శారీరక సమస్యలకు లోనవుతున్నారని వివరించారు.
► స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు వినియోగిస్తూ గేమ్స్ వంటి వాటిలో విద్యార్థులు నిమగ్నం అవుతున్నందున పాఠ్యాంశాలపై దృష్టి పెట్టలేకపోతున్నారని సర్వే పేర్కొంది. దీనివల్ల చదువుల్లో వెనుకబడిపోతున్నారని వివరించింది.
► స్మార్ట్ ఫోన్ల వల్ల సామాజిక సంబంధాలకు దూరంగా ఉండిపోతున్నారని, ఇది మెదడులో జన్యుపరమైన సమస్యలకు దారితీస్తోందని వైద్య నిపుణులు పేర్కొన్నారని సర్వే తెలిపింది. ఇది పిల్లల్లో ‘నో మొబైల్’ ఫోబియా అనే కొత్త రుగ్మతను తెచ్చిపెట్టిందన్నారు.
► ఫలితంగా పిల్లలు ఆందోళన, నిరాశ, చిరాకు, ఒంటరితనం ఎక్కువై మానసిక వైకల్యంలో పడుతున్నట్టు స్పష్టం చేశారు.
► స్మార్ట్ ఫోన్ల వినియోగం వల్ల 8–18 ఏళ్లలోపు పిల్లలు నిద్ర లేమికి గురవుతున్నారని.. ఫలితంగా వారిలో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతోందని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment