
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిలో (ఎస్‌సీఈఆర్‌టీ) పరిశోధకులే లేరు. రెగ్యులర్ అధ్యాపకులు లేక, కొద్దిపాటి డిప్యుటేషన్ సిబ్బందితో మమ అనిపించాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బందిలేక పరిశోధనలు, శిక్షణ పనులు చేపట్టేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఎస్‌సీఈఆర్‌టీల పరిస్థితిని మెరుగు పరిచేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) కసరత్తు ప్రారంభించింది. ఎస్‌సీఈఆర్టీలను బలో పేతం చేయడంతోపాటు విద్యాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించేందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎస్‌సీఈఆర్‌టీలను బలోపేతం చేసేందుకు రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఎస్‌సీఈఆర్‌టీ పరిస్థితి ఇదీ..
రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీలో మంజూరైన పోస్టులు 32 ఉండగా ఏడింటిలోనే రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు. 25 పోస్టుల్లో రెగ్యులర్ సిబ్బంది లేరు. డిప్యుటేషన్‌పై కొంతమంది పనిచేస్తున్నా ప్రయోజనం లేదు. దీంతో రెగ్యులర్ సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టాలని ఎన్‌సీఈఆర్‌టీ స్పష్టం చేసింది. మొత్తంగా 79.5% పోస్టులు ఖాళీగా ఉండ గా.. ఏపీలో 77.8%, కర్ణాటకలో 53.3%, కేరళలో 35.6%, తమిళనాడులో 8% పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ గుర్తించింది.
డైట్‌లలో అదే పరిస్థితి...
జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్)నూ అధ్యాపకులే లేరు. కొన్ని డైట్ కాలేజీల్లో ప్రిన్సిపల్‌సహా ఒక్క అధ్యాపకుడు కూడా లేడు. అధ్యాపకుల నియామకానికి చొరవ చూపకపోవడంతో 15 ఏళ్లుగా ఉపాధ్యాయ విద్యార్థులు పెద్దగా శిక్షణ లేకుండానే విద్యాకోర్సులను పూర్తి చేశామనిపించేస్తున్నాయి. రాష్ట్రంలోని 10 డైట్‌లలో మంజూరైన పోస్టులు 286 ఉండగా, అందులో 37 మంది మాత్రమే రెగ్యులర్ ఆధ్యాపకులు ఉన్నారు. మిగతా 249 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. దీంతో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులకు అరకొర చదువే అందుతోంది.
బలోపేతంపై దృష్టి
ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఎస్‌సీఈఆర్‌టీ, డైట్ కాలేజీల బలోపేతానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఎన్‌సీఈఆర్‌టీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఎస్‌సీఈఆర్టీల స్వరూపాన్ని 2018 ఏప్రిల్ నాటికి మార్పు చేయాలని పేర్కొంది. పరిశోధనలు, కరిక్యులమ్ డెవలప్‌మెంట్, విద్యా ప్రణాళిక తదితర కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. ఇన్‌సర్వీసు శిక్షణకు నోడల్ ఏజెన్సీగా ఎస్‌సీఈఆర్‌టీలను అభివృద్ధి చేయా లని తెలిపింది. ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ, రీసర్చ్ కమిటీల్ని ఏర్పాటు చేయాలని సూచిం చింది. 2018 అక్టోబర్‌లోగా ఖాళీలన్నీ భర్తీ చేయాలంది. అలాగే 2019 ఫిబ్రవరి నాటికి ఎన్‌జీవో సహకారంతో రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌ను అభివృద్ధి చేయాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment