సాక్షి, అమరావతి/పాడేరు : అరకు కాఫీ జాతీయ స్థాయి వేదికపై మరోసారి అదుర్స్ అనిపించింది. ప్రతిష్టాత్మక సదస్సులో ప్రథమ బహుమతిని సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చాటింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ గుర్తింపు పొందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో–సోషల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కోల్‌కతాలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది.
‘పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జీవనోపాధి పెంపొందించడం–స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మహిళా సాధికారతకు ఊత మివ్వడం’ అనే అంశంపై నిర్వహించిన ఈ సద స్సులో 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ ప్రాంతాల్లో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, డైరెక్టర్లు పి.చిన్నప్పదొర, ఎం.రామకృష్ణ, ఎస్.ఈశ్వరమ్మ, జనరల్ మేనేజర్ సీఏ మణికుమార్ ఆంధ్రాలో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న కాఫీ ప్రాజెక్టుపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏజెన్సీ ఏరియాలోని 2,27,021 ఎకరాల్లో కాఫీ పంట సాగు చేస్తున్నారని, ఏటా గిరిజన రైతులకు కచ్చితమైన ఆదాయం లభిస్తోందని, బెంగళూరు మార్కెట్‌లో నాణ్యమైన కాఫీ గింజలుగా ప్రసిద్ధి చెందడం వంటి అంశాలను వివరించారు. దీంతో మన కాఫీ ప్రాజెక్ట్‌కు ప్రథమ స్థానం లభించింది.
ఉన్నతాధికారుల అభినందనలు
జాతీయ స్థాయి అవార్డును సాధించిన ఏపీ ట్రైకార్ బృందానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, సంచాలకులు ఎం.జాహ్నవి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ అవార్డు పొందడం ద్వారా జాతీయ స్థాయిలో అరకు కాఫీ మరోసారి గొప్ప గుర్తింపు పొందిందని ట్రైకార్ జీఎం మణికుమార్ తెలిపారు.
అనుకూల వాతావరణం... ప్రభుత్వ సహకారమే కారణం
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం, వృక్ష సంపదతో ఏర్పడే సహజసిద్ధమైన నీడ, నేల స్వభావం కాఫీ సాగుకు అత్యంత అనుకూలం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది.
ఇందుకోసం ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ–పాడేరు) పరిధిలో 2024–25 నాటికి దశల వారీగా కాఫీ సాగు విస్తరణను పెంచుతూ రూ.526.160 కోట్లతో ప్రత్యేక కాఫీ ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. కాఫీ సాగుకు అవసరమైన విత్తనాలు, యంత్రాలు, బోర్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, మొయిన్ రోడ్డు నుంచి అంతర్గత అప్రోచ్ రోడ్ల నిర్మాణం, పల్పింగ్ యూనిట్ల ఏర్పాటు, కాఫీ గింజల సేకరణ, మార్కెటింగ్æ వంటి చర్యలను చేపట్టింది. ప్రభుత్వ తోడ్పా టు వల్ల అరకు కాఫీకి దేశ విదేశాల్లో గుర్తింపు లభిస్తోంది. యూరప్, పారిస్ సహా అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment