బాబోయ్.. బహ్రెయిన్! | Visakhapatnam Agency Cheating Poor family in Pundi | Sakshi
Sakshi News home page

బాబోయ్.. బహ్రెయిన్!

Published Thu, Aug 21 2014 2:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

బాబోయ్.. బహ్రెయిన్! - Sakshi

బాబోయ్.. బహ్రెయిన్!

పూండి: నాలుగు డబ్బులు సంపాదించాలన్న ఆశతో దేశం కాని దేశం వచ్చాం.. ఇక్కడి కంపెనీ. విశాఖపట్నంలోని ఏజెన్సీ మమ్మల్ని మోసం చేశాయి. వారం రోజులుగా తినడానికి తిండి లేదు. తాగేందుకు నీరు లేదు. వసతిగదుల నుంచి గెంటేసి.. పైగా తామే పరారైనట్లు కంపెనీ కేసులు పెట్టిం ది. మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ పట్టించుకోవడం లేదు. బహ్రెయిన్ నుంచి మమ్మల్ని భారత్ రప్పించి రక్షించమని.. వనజనాభం అనే వలస కూలీ ‘సాక్షి’తో ఫోనులో ఆవేదన వెళ్లబోసుకున్నాడు. ఆయనచెప్పిన కథనం ప్రకారం..

వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామక్రిష్ణాపురానికి చెందిన బత్తిని వనజనాభానికి నిరుపేద కుటుంబం. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో విశాఖ నగరానికి వెళ్లాడు. అక్కడి సాయి వెంకట్ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్ వారిని కలవగా బహ్రెయిన్‌లో వెల్డర్, హెల్పర్  పోస్టులు ఉన్నాయని ఆశ చూపారు. దాంతో అప్పుడు చేసి ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులకు రూ. 60 వేలు చెల్లించాడు. వారి ద్వారా 2013 నవంబర్‌లో బహ్రెయిన్ వెళ్లి అక్కడి సిరి ఓడరేవులో సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్న యూనికార్క్ ఏజెన్సీలో హెల్పర్‌గా చేరాడు. ఆయనతోపాటు జిల్లాలోని హుకుంపేటకు చెందిన సింహాచలం, పలాసకు చెందిన చిరంజీవులు, నరిసింహనాయుడు, ఇచ్ఛాపురానికి చెందిన లోకుదాస్‌తో పాటు విశాఖపట్నానికి చెందిన మరో 8 మంది యువకులు భారీగా అప్పులు చేసి వెళ్లి అక్కడ పనుల్లో చేరారు.

కొద్ది నెలలు బాగానే చూసిన కంపెనీ నిర్వాహకులు ఆ తర్వాత ఇబ్బంది సృష్టించారు. గత మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదు. భోజనం పెట్టలేదు. చివరికి ఉండటానికి ఇచ్చిన గదుల నుంచి ఖాళీ చేయించి.. పైగా వీరే పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా వీరంతా రోడ్డున పడ్డారు. పోలీసులు వెంట పడుతున్నారు. తిండీతిప్పల్లేక వీధుల పాలయ్యారు. గత కొన్నాళ్లుగా ఉడికీ ఉడకని ఆహారం ఇవ్వడంతో రోగాల బారిన పడ్డామని బాధితులు చెప్పారు. ఇండియన్ ఎంబసీకి వెళ్లి ఫిర్యాదు చేస్తే సానుభూతితో పరిశీలించాల్సింది పోయి.. మీరు పారిపోయినట్లు పోలీసులు మాకు చెప్పారని ఎంబసీ అధికారులు అసహనంతో చెప్పడంతో యువకులు కంగుతిన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా వారంతా ఆందోళనకు దిగారు. దీంతో ఎంబసీ అధికార్లు భోజనం పెట్టేందుకు అంగీకరించగా వసతి మాత్రం లేక ఫుట్‌పాత్‌లపైనే గడుపుతున్నారు. వేలకు వేలు చెల్లించి చిత్రహింసలకు గురవుతున్నామని వారు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఆందోళనలో కుటుంబాలు
అక్కడ తమవారు ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఇక్కడి వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. తన భర్త క్షేమంగా ఇంటికి చేరేలా స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు సహకరించాలని బత్తిని వనజనాభం భార్య దేశమ్మ కోరుతోంది. యూఆర్‌కేపురం సర్పంచి చింత రజిని మాట్లాడుతూ ఈ విషయంలో భారత ప్రభుత్వం స్పందించి బాధితులను రక్షించాలని, జిల్లా ప్రజాప్రతినిధులు కేంద్రంతో మాట్లాడాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement