Pundi
-
బాబోయ్.. బహ్రెయిన్!
పూండి: నాలుగు డబ్బులు సంపాదించాలన్న ఆశతో దేశం కాని దేశం వచ్చాం.. ఇక్కడి కంపెనీ. విశాఖపట్నంలోని ఏజెన్సీ మమ్మల్ని మోసం చేశాయి. వారం రోజులుగా తినడానికి తిండి లేదు. తాగేందుకు నీరు లేదు. వసతిగదుల నుంచి గెంటేసి.. పైగా తామే పరారైనట్లు కంపెనీ కేసులు పెట్టిం ది. మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ పట్టించుకోవడం లేదు. బహ్రెయిన్ నుంచి మమ్మల్ని భారత్ రప్పించి రక్షించమని.. వనజనాభం అనే వలస కూలీ ‘సాక్షి’తో ఫోనులో ఆవేదన వెళ్లబోసుకున్నాడు. ఆయనచెప్పిన కథనం ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామక్రిష్ణాపురానికి చెందిన బత్తిని వనజనాభానికి నిరుపేద కుటుంబం. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో విశాఖ నగరానికి వెళ్లాడు. అక్కడి సాయి వెంకట్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ వారిని కలవగా బహ్రెయిన్‌లో వెల్డర్, హెల్పర్ పోస్టులు ఉన్నాయని ఆశ చూపారు. దాంతో అప్పుడు చేసి ఇన్స్టిట్యూట్ నిర్వాహకులకు రూ. 60 వేలు చెల్లించాడు. వారి ద్వారా 2013 నవంబర్‌లో బహ్రెయిన్ వెళ్లి అక్కడి సిరి ఓడరేవులో సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్న యూనికార్క్ ఏజెన్సీలో హెల్పర్‌గా చేరాడు. ఆయనతోపాటు జిల్లాలోని హుకుంపేటకు చెందిన సింహాచలం, పలాసకు చెందిన చిరంజీవులు, నరిసింహనాయుడు, ఇచ్ఛాపురానికి చెందిన లోకుదాస్‌తో పాటు విశాఖపట్నానికి చెందిన మరో 8 మంది యువకులు భారీగా అప్పులు చేసి వెళ్లి అక్కడ పనుల్లో చేరారు. కొద్ది నెలలు బాగానే చూసిన కంపెనీ నిర్వాహకులు ఆ తర్వాత ఇబ్బంది సృష్టించారు. గత మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదు. భోజనం పెట్టలేదు. చివరికి ఉండటానికి ఇచ్చిన గదుల నుంచి ఖాళీ చేయించి.. పైగా వీరే పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా వీరంతా రోడ్డున పడ్డారు. పోలీసులు వెంట పడుతున్నారు. తిండీతిప్పల్లేక వీధుల పాలయ్యారు. గత కొన్నాళ్లుగా ఉడికీ ఉడకని ఆహారం ఇవ్వడంతో రోగాల బారిన పడ్డామని బాధితులు చెప్పారు. ఇండియన్ ఎంబసీకి వెళ్లి ఫిర్యాదు చేస్తే సానుభూతితో పరిశీలించాల్సింది పోయి.. మీరు పారిపోయినట్లు పోలీసులు మాకు చెప్పారని ఎంబసీ అధికారులు అసహనంతో చెప్పడంతో యువకులు కంగుతిన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా వారంతా ఆందోళనకు దిగారు. దీంతో ఎంబసీ అధికార్లు భోజనం పెట్టేందుకు అంగీకరించగా వసతి మాత్రం లేక ఫుట్‌పాత్‌లపైనే గడుపుతున్నారు. వేలకు వేలు చెల్లించి చిత్రహింసలకు గురవుతున్నామని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆందోళనలో కుటుంబాలు అక్కడ తమవారు ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఇక్కడి వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. తన భర్త క్షేమంగా ఇంటికి చేరేలా స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు సహకరించాలని బత్తిని వనజనాభం భార్య దేశమ్మ కోరుతోంది. యూఆర్‌కేపురం సర్పంచి చింత రజిని మాట్లాడుతూ ఈ విషయంలో భారత ప్రభుత్వం స్పందించి బాధితులను రక్షించాలని, జిల్లా ప్రజాప్రతినిధులు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. -
మా కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించం
పూండి :వజ్రపుకొత్తూరు మండలంలో టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మా కార్యకర్తలపై దాడులకు పాల్పడి బెదిరిస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు అన్నారు. శనివారం మండలంలోని అక్కుపల్లి గ్రామంలో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుల దాడులు ఎదుర్కొంటున్న అక్కుపల్లి మాజీ సర్పంచ్ లండ రామలింగంతో కలసి ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎవరూ భయపడవద్దని సూచించారు. గ్రామంలో టీడీపీ నాయకుల అన్యాయూలను ఎదిరిస్తే చంపేస్తాం అని వాల్‌పోస్టర్స్ వేయించి మరీ బెదిరించడం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా లేక అధికార పార్టీ నాయకులా అని జగన్నాయకులు ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇదే వ్యవహారశైలి అనుసరిస్తే డీజీపీ, డీఐజీ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి కార్యకర్తలతో కలసి ప్రభుత్వ అరాచకాలను అరికట్టేందుకు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బైపల్లి సర్పంచి, మడ్డు రాంప్రసాద్, ఎం. వరప్రసాద్, బి. భూపతి, అర్లి వల్లభరావు, పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ కౌన్సిలర్ ఎం. సురేష్, ఎస్.డిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పుటేరు... గుండె బేజారు!
పూండి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఉప్పుటేరు పొంగి పొర్లుతుండటంతో వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక కాలిబాట వంతెన కొన్నిచోట్ల కొట్టుకుపోయింది. దీంతో పూడిలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. 120 ఇళ్లు, 136 కుటుంబాలు ఉన్న ఈ గ్రామానికి వంతెన నిర్మించాలన్న డిమాండ్ 50 ఏళ్లుగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే సమస్యపై గత ఏడాది ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన ఫొటో కథనానికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. అప్పట్లో కొంత హడావుడి చేసిన అధికారులు, తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేశారు. గతంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించినా చర్యలు లేవు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు వినతులు కూడా అందజేశారు. గత ఏడాది అక్టోబర్ 12న సంభవించిన ఫై లీన్ తుపాను సందర్భంగా కొండవూరు నుంచి గ్రామానికి గ్రావెల్ రహదారి మంజూరు చేస్తామని నిన్నటి వరకు కలెక్టర్‌గా ఉన్న సౌరభ్‌గౌర్ హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకే ఉప్పుటేరు పొంగింది. కాలిబాట మూడు చోట్ల తెగిపోయింది. మరికొన్ని చోట్ల కొట్టుకుపోయింది. వర్షాల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే భారీవర్షాలు పడితే తమ గతి ఏమిటని సర్పంచ్ తిమ్మల పవిత్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
పొట్ట విప్పి చూడ పాములొచ్చె!
పూండి: పాములు గుడ్లు పెడతాయి.. వాటి నుంచి పిల్లలు వస్తాయి.. మనలో చాలామందికి ఈ విషయం తెలిసిందే.. కానీ, పాముల్లో రెండు రకాలు ఉంటాయని, శశూత్పత్తి చేసేవి కొన్నయితే.. అండోత్పత్తి చేసేవి మరికొన్నని అధిక శాతం మందికి తెలియని విషయం. ఈ విషయం తెలియకే పాము కడుపు నుంచి 50 పిల్లలు బయటకు రావడం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పీవీపురం గ్రామస్తులను విస్మయానికి, గగుర్పాటుకు గురిచేసింది. సోమవారం గ్రామంలోని బీసీ కాలనీలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్న ఒక పెద్ద పామును స్థానికులు గమనించారు. దాన్ని గునపంతో ఒళ్లంతా పొడిచి హతమార్చారు. గునపం పోట్లకు చీలిపోయిన పాము పొట్ట నుంచి ఒక్కసారి 50 పిల్లలు బయటకు వచ్చాయి. ఒక్కసారి అన్ని పాము పిల్లలను చూసి భయపడిన గ్రామస్తులు వాటిని కూడా చంపేశారు. కానీ.. పాము కడుపులోంచి పిల్లలు రావడమేమిటని ఆశ్చర్యానికి గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ‘న్యూస్‌లైన్’ ఈ విషయాన్ని తొగరాం ప్రభుత్వ జూనియర్ కళాశాల జంతు శాస్త్ర అధ్యాపకుడు పి.భాస్కరరావును సంప్రదించగా ఒక రకం పాములు పిల్లలను ప్రసవిస్తాయని ధ్రువీకరించారు. గ్రామస్తులు చంపేసిన పాము శరీరంపై డైమండ్ ఆకారంలో పెద్ద మచ్చలు ఉండటాన్ని బట్టి అది రక్తపింజర జాతి పాము అని తేల్చారు. ఈ జాతి పాములు గుడ్లే పెడతాయని.. అయితే, వాటిని కడుపులో ఉండగానే పొదిగి పిల్లలను కడుపులోని సొన పొర రక్షణలో ఉంచుతాయని.. అనంతరం జననేంద్రియం ద్వారా ఆ పిల్లలను ప్రసవిస్తాయని వివరించారు. ఇలాంటి జీవులను కార్డేటా విభాగానికి చెందిన ‘ఓవివీపెరస్’ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారని ఆయన చెప్పారు. రక్తపింజరలు ఒక కాన్పులో 50 పిల్లలను కనడం కూడా సాధారణమేనని చెప్పారు. -
అటు పెళ్లి సందడి.. ఇటు ఇంటర్ పరీక్ష
పూండి, న్యూస్‌లైన్ : మధ్యాహ్నం 12 గంటలకు నిశ్చితార్ధం.. రాత్రి 9 గంటలకు పెళ్లి ముహూర్తం.. ఇంట్లో మేళతాళాలు.. బంధువుల సందడే సందడి. అయినా చదువుకు ప్రాధాన్యమిచ్చింది ఆ నవ వధువు. ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూపు విద్యార్థినైన ఆమె శనివారం ఉదయం పూండిలోని శ్రీసాయి వినీత్ జూనియర్ కళాశాలలో జరిగిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్ష రాసింది. ఆమె పేరు పనపాన మీనా. స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ. నిశ్చితార్థ సమయం ముంచుకొస్తున్నా కంగారు పడకుండా పరీక్ష రాసిన ఆమెను చీఫ్ సూపరింటెం డెంట్ కె.అప్పారావు, డిపార్ట్మెంటల్ అధికారి ఎస్.షణ్ముఖరావు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్ ఎస్.దివాకర్, ఇన్విజిలేటర్లు అభినందించారు. -
ప్రింటింగ్ ప్రెస్లూ.. జర భద్రం!
పూండి, న్యూస్‌లైన్: నిబంధనలు పాటించని ప్రింటింగ్ ప్రెస్‌లపై ఎన్నికల అధికార్లు కొరడా ఝులిపించనున్నారు. ఇప్పటికే పలాస నియోజిక వర్గంలో ప్రిం టింగ్ ప్రెస్‌ల వివరాలు నమోదు చేసుకున్న అధికారులు వీటిపై నిఘా వేశారు. కరపత్రాలు, పోస్టర్లను ముద్రించేటపుడు పబ్లిషర్ వివరాలు, ప్రతుల సంఖ్య తప్పని సరిగా ముద్రించాల్సి ఉంది. పబ్లిషర్ నుంచి 127 ఎ(2) ప్రకారం అపెండిక్స్ ఎ, బి ఫారాల్లో డిక్లరేషన్ సైతం పొందాలి. ఈ ఫారాలతో పాటు ముద్రించిన కరపత్రాలు, పోస్టర్ల ప్రతులను రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రెస్ యజమానులకు నోటీసులు జరీ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేందుకు ఎన్నికల అధికారులకు అవకాశం ఉంది. -
వ్యాన్ ఢీకొని విద్యార్థి దుర్మరణం
పూండి, న్యూస్‌లైన్: వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు సాయిబాబా మందిరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగాం మండలం హరిదాసుపురానికి చెందిన కురుమోజు సతీష్ (17) కాశీబుగ్గ డాక్టర్ కణితీస్ ఐటీఐలో చదువుతున్నాడు. బుధవారం పూండికి చెందిన కొంచాడ ధర్మారావు ద్విచక్రవాహనంపై పూండి నుంచి కాశీబుగ్గ వెళుతుండగా బెండిగేటు సాయిబాబా మందిరం సమీపంలో మలుపు వద్ద కాశీబుగ్గ నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం తునాతునకలైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి పరారైన వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌ను బుధవారం సాయంత్రం వజ్రపుకొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు తవుడు, అమ్మన్నమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ యజమాని కనీసం పరామర్శకు రాకపోవడంపై కుటుంబ సభ్యులు కారువాడు, లోకనాథం, శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వజ్రపుకొత్తూరు ఎస్ఐ ఎస్.తాతారావు తెలిపారు.