మంగళగిరి: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఓ ఐపీఎస్ అధికారి శఠగోపం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక ఐపీఎస్ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. ఏలూరులో పనిచేసిన సమయంలో ఏలూరుకు చెందిన ఒక మహిళతో సహజీవనం చేశారు.
అనంతరం ఐజీపీ హోంగార్డు రాష్ట్ర అధికారిగా పనిచేసిన సమయంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఐజీపీ సహకారంతో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మందికిపైగా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. అధికారి ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. అధికశాతం మందికి పోస్టింగులు ఇవ్వలేకపోయారు.
దీంతో నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో 2022లో ఐజీపీ హోంగార్డ్స్ పేరుతో తాను పోస్టులో లేకపోయినా తనే ఐజీపీ హోంగార్డు అయినట్లు సంతకాలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. వాటితో అభ్యర్థులు పోలీస్ ఉన్నతాధికారులను కలవగా అనుమానం వచ్చి రహస్యంగా విచారణ చేశారు. అవి నకిలీ అపాయింట్‌మెంట్లు అని తేలడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు.
అదే సమయంలో బాధిత నిరుద్యోగి తలాజి విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలతో విస్తుపోయినట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కొంతనగదు దళారుల ఖాతాల నుంచి ఐజీపీతోపాటు ఆయన ప్రియురాలి ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో విల్లాలు కొన్నట్టు సమాచారం.
దీంతో అధికారి ప్రియురాలి పెద్ద అల్లుడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన దళారులు ఏడుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరెస్టులతో అప్రమత్తమైన అధికారి మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment