ఈ ఏడాది కూడా కాఫీ పంట సిరులు కురిపించనుంది. ముందుగానే పండ్ల దశకు చేరుకోవడం రైతులకు ఆనందాన్నిస్తోంది. విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు వాతావరణ పరిస్థితులు కలిసొచ్చాయి.
సాక్షి, పాడేరు: ప్రతి ఏడాది ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు వారి జీవనోపాధికి కాఫీ పంట ప్రధానంగా మారింది. విశాఖ మన్యంలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ పంటకు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ ఏజెన్సీని అనేక దేశాలు గుర్తించాయి. ప్రతి ఏడాది గిరిజన రైతులకు ఆర్థిక అవసరాలు తీర్చే ప్రధాన వాణిజ్య పంటగా మారింది. ప్రపంచ స్థాయిలో కాఫీ నాణ్యతలో బ్రెజిల్ ప్రసిద్ధి. ఆ దేశం తర్వాత మన దేశంలో కర్ణాటక రాష్ట్రంతోపాటు విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు ఎంతో పేరుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలోని కాఫీ పంటను ప్రోత్సహిస్తున్నాయి. కాఫీ సాగుకు విశాఖ ఏజెన్సీ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో ప్రతి ఏడాది కాఫీ పంట సాగు విస్తరిస్తుంది.
మేలు చేసిన వర్షాలు
ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే విశాఖ ఏజెన్సీవ్యాప్తంగా వర్షాలు కురవడం కాఫీ తోటలకు ఎంతో మేలు చేసింది. కాఫీ మొక్కలకు పూల పూత కూడా ముందస్తుగానే ఏర్పడింది. తర్వాత కూడా వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ గింజలు వేగంగానే ఏర్పడి ఆశాజనకంగా ఎదగడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా కాఫీ తోటలు విరగ్గాయడంతోపాటు ఇటీవల ముందస్తుగానే కాఫీ పండ్ల దశకు చేరుకోవడం గిరిజన రైతులను మరింత సంతోషపెడుతుంది. గత ఏడాది 12 వేల మెట్రిక్ టన్నుల వరకు క్లీన్ కాఫీ దిగుబడులు ఏర్పడగా, ఈ ఏడాది కూడా అదేస్థాయిలో దిగుబడులు అధికంగా ఉంటాయని కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పాడేరు మండలం మోదాపల్లి ప్రాంతంలో పండ్ల దశకు చేరుకున్న కాఫీ మొక్కలు
ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలో 2 లక్షల 21 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉన్నాయి. 2 లక్షల 5 వేల 464 మంది గిరిజన రైతులు ప్రభుత్వాల సహకారంతో కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. వీటిలో లక్షా 58 వేల 21 ఎకరాల కాఫీ తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఈ తోటల్లో ప్రస్తుతం కాఫీ కాపు అధికంగా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గింజ దశలో ఉన్న కాఫీ పంట ముందస్తుగానే పండ్ల దశకు చేరుకుంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో నవంబర్ రెండో వారం నాటికే గిరిజన రైతులు తమ సాగులో ఉన్న కాఫీ ఫలసాయాన్ని సేకరించే పరిస్థితులు ఉన్నాయి.
అధిక దిగుబడులు
ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే విస్తారంగా వర్షాలు కురవడంతో పూత విరగ్గాసింది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో కాఫీ తోటల్లో మొక్కలు గింజ దశకు వేగంగానే చేరుకున్నాయి. ప్రస్తుతం కాయలన్నీ పండ్ల దశకు చేరుకుంటుండడంతో ఈ ఏడాది నవంబర్ నుంచే గిరిజనులు ఫలసాయాన్ని సేకరించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది కూడా సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల క్లీన్ కాఫీ గింజలు దిగుబడికి వస్తాయని అంచనా వేస్తున్నాం.
–భాస్కరరావు, ఇన్‌చార్జి కాఫీ ఏడీ, ఐటీడీఏ
Comments
Please login to add a commentAdd a comment