Coffee crop
-
మళ్లీ అరకు ఇన్స్టెంట్ కాఫీ రెడీ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ కాఫీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న అరకు కాఫీ నుంచి ఇన్స్టెంట్ సాచెట్స్ మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్ల విరామం అనంతరం ఇన్స్టెంట్ కాఫీ సాచెట్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సర్వం సిద్ధంచేసింది. ఇప్పటికే 40 టన్నుల కాఫీ పండ్లు సేకరించి ప్రాసెసింగ్‌కు అప్పగించింది. సంక్రాంతి పండుగకు ఘుమఘుమలాడే అరకు ఇన్స్టెంట్ కాఫీ తాగేలా మార్కెట్లోకి తీసుకురానుంది. అరకు ఇన్స్టెంట్ కాఫీని 2018లో మార్కెట్లోకి తీసుకొచ్చిన జీసీసీ లాభాలబాటలో పయనించింది. మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల్లో బ్రాండ్‌గా దూసుకెళ్లిన అరకు కాఫీకి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ఇన్స్టెంట్ కాఫీ ప్రక్రియ చేపట్టే బెంగళూరుకు చెందిన వాహన్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు డబ్బులు చెల్లించకపోవడం, అధికారులతో విభేదాలు, కోవిడ్ కారణంగా 2019 మొదట్లోనే సరఫరాకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఇన్స్టెంట్ కాఫీ ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగా జీసీసీ ఎండీగా సురేష్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సదరు సంస్థతో పలుమార్లు చర్చలు జరిపారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడంతో తిరిగి ఇన్స్టెంట్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. తొలివిడతగా 40 టన్నుల సేకరణ రెండు రోజుల్లో ఇన్స్టెంట్ కాఫీ ప్రక్రియ ప్రారంభించేందుకు జీసీసీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే గిరిజనుల నుంచి పదిశాతం కన్నా తక్కువ తేమ ఉన్న నాణ్యమైన 40 టన్నుల కాఫీ పండ్లను సేకరించింది. దీనివల్ల మంచి రుచితోపాటు సువాసన కూడా కాఫీకి తోడవుతుంది. ఈ పండ్లని రోస్టింగ్, ఇతర ప్రక్రియలతో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్‌గా మార్చనున్నారు. 2 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లతోపాటు 50, 100 గ్రాముల టిన్స్ కూడా మార్కెట్లోకి తీసుకురావాలని జీసీసీ ఏర్పాట్లు చేసింది. రూ.3, రూ.12 చొప్పున సాచెట్స్ అమ్మకపు ధరలుగా నిర్ణయించింది. తొలివిడతగా గిరిజనుల నుంచి సేకరించిన 40 టన్నులతో ఇన్స్టెంట్ కాఫీ పొడిని మార్కెట్లోకి తీసుకురానుంది. ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తాం ఎప్పటికప్పుడు నాణ్యమైన ఇన్స్టెంట్ కాఫీని వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యాం. రెండు రోజుల్లో ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. జనవరి 10 తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త ఇన్స్టెంట్ కాఫీ సాచెట్స్ వచ్చేలా తయారీ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించాం. మిగిలిన కంపెనీ బ్రాండ్ల సాచెట్స్‌లో చూపించే పరిమాణం కంటే తక్కువ కాఫీ పొడి ఉంటుంది. కానీ, అరకు ఇన్స్టెంట్ కాఫీ సాచెట్స్ మాత్రం ఎంత పరిమాణం చెప్పామో.. అంతే ఉండేలా కచ్చితత్వంతో అందిస్తాం. గిరిజనులకు లాభాలను అందించేలా జీసీసీ ప్రతి నిర్ణయం తీసుకుంటోంది. జి.సురేష్‌కుమార్, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ -
కాఫీ ఘుమఘుమ.. అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు..
ఈ ఏడాది కూడా కాఫీ పంట సిరులు కురిపించనుంది. ముందుగానే పండ్ల దశకు చేరుకోవడం రైతులకు ఆనందాన్నిస్తోంది. విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు వాతావరణ పరిస్థితులు కలిసొచ్చాయి. సాక్షి, పాడేరు: ప్రతి ఏడాది ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు వారి జీవనోపాధికి కాఫీ పంట ప్రధానంగా మారింది. విశాఖ మన్యంలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ పంటకు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ ఏజెన్సీని అనేక దేశాలు గుర్తించాయి. ప్రతి ఏడాది గిరిజన రైతులకు ఆర్థిక అవసరాలు తీర్చే ప్రధాన వాణిజ్య పంటగా మారింది. ప్రపంచ స్థాయిలో కాఫీ నాణ్యతలో బ్రెజిల్ ప్రసిద్ధి. ఆ దేశం తర్వాత మన దేశంలో కర్ణాటక రాష్ట్రంతోపాటు విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు ఎంతో పేరుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలోని కాఫీ పంటను ప్రోత్సహిస్తున్నాయి. కాఫీ సాగుకు విశాఖ ఏజెన్సీ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో ప్రతి ఏడాది కాఫీ పంట సాగు విస్తరిస్తుంది. మేలు చేసిన వర్షాలు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే విశాఖ ఏజెన్సీవ్యాప్తంగా వర్షాలు కురవడం కాఫీ తోటలకు ఎంతో మేలు చేసింది. కాఫీ మొక్కలకు పూల పూత కూడా ముందస్తుగానే ఏర్పడింది. తర్వాత కూడా వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ గింజలు వేగంగానే ఏర్పడి ఆశాజనకంగా ఎదగడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా కాఫీ తోటలు విరగ్గాయడంతోపాటు ఇటీవల ముందస్తుగానే కాఫీ పండ్ల దశకు చేరుకోవడం గిరిజన రైతులను మరింత సంతోషపెడుతుంది. గత ఏడాది 12 వేల మెట్రిక్ టన్నుల వరకు క్లీన్ కాఫీ దిగుబడులు ఏర్పడగా, ఈ ఏడాది కూడా అదేస్థాయిలో దిగుబడులు అధికంగా ఉంటాయని కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాడేరు మండలం మోదాపల్లి ప్రాంతంలో పండ్ల దశకు చేరుకున్న కాఫీ మొక్కలు ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలో 2 లక్షల 21 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉన్నాయి. 2 లక్షల 5 వేల 464 మంది గిరిజన రైతులు ప్రభుత్వాల సహకారంతో కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. వీటిలో లక్షా 58 వేల 21 ఎకరాల కాఫీ తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఈ తోటల్లో ప్రస్తుతం కాఫీ కాపు అధికంగా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గింజ దశలో ఉన్న కాఫీ పంట ముందస్తుగానే పండ్ల దశకు చేరుకుంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో నవంబర్ రెండో వారం నాటికే గిరిజన రైతులు తమ సాగులో ఉన్న కాఫీ ఫలసాయాన్ని సేకరించే పరిస్థితులు ఉన్నాయి. అధిక దిగుబడులు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే విస్తారంగా వర్షాలు కురవడంతో పూత విరగ్గాసింది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో కాఫీ తోటల్లో మొక్కలు గింజ దశకు వేగంగానే చేరుకున్నాయి. ప్రస్తుతం కాయలన్నీ పండ్ల దశకు చేరుకుంటుండడంతో ఈ ఏడాది నవంబర్ నుంచే గిరిజనులు ఫలసాయాన్ని సేకరించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది కూడా సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల క్లీన్ కాఫీ గింజలు దిగుబడికి వస్తాయని అంచనా వేస్తున్నాం. –భాస్కరరావు, ఇన్చార్జి కాఫీ ఏడీ, ఐటీడీఏ -
అమ్మో...! ఎంత పెద్ద పాముతో..
బెంగళూరు: ఇదేదో సినిమా కోసం ఇచ్చిన పోజు కాదు. ముమ్మాటికి వాస్తవ సంఘటనే. భారీ సర్పాన్ని అలవోకగా ఎత్తిపట్టుకున్న ఈ యువకుడు ఏ సినిమా హీరోగా తక్కువ కాడనే చెప్పాలి. గురువారం కర్ణాటకలోని కాఫీసీమ కొడగు జిల్లా మూర్నాడులో చోటుచేసుకుంది. ఒక కాఫీ తోటలోకి 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా పాము చొరబడడంతో యజమాని స్థానిక పాముల నిపుణుడు సూర్యకీర్తికి కాల్ చేశాడు. అక్కడకు చేరుకున్న సూర్యకీర్తి కొంతసేపటికే దానిని వట్టి చేతులతో పట్టుకుని చూపరుల కోసం ఇలా ఆడించాడు. తరువాత సమీప భాగమండల అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశాడు. -
ఇవి అంతరించిపోయే ప్రమాదం!
వాషింగ్టన్: వాతావరణ మార్పుల కారణంగా అడవి తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటి మొక్కల ఫలదీకరణకు దోహదపడే ప్రాణులెన్నో అంతరించిపోయే ప్రమాదం ఉందని ఐరాస వైజ్ఞానిక నివేదిక హెచ్చరించింది. 20 వేల ఫలదీకరణ జాతులు కోట్ల డాలర్ల విలువ చేసే పండ్లు, కూరగాయలు, కాఫీ తదితర పంటలకు కీలకమని పేర్కొంది. ఆహార పంటలు ప్రభావితం కాకముందే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని వెల్లడించింది. -
ఒలికిన కాఫీ
తగ్గిన దిగుబడులు గిట్టుబాటు ధరపైనే రైతుల ఆశలు ఏజెన్సీలో కొనుగోలు మొదలు {పారంభ ధర రూ.110లు పాడేరు : ఏజెన్సీలో గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్న కాఫీ పంటను ఈ ఏడాది హుద్‌హుద్ తీవ్రంగా నష్టపరిచింది. దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఏజెన్సీవ్యాప్తంగా 1.46 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. వీటిలో 96 వేల ఎకరాల్లోని పంట ఫలాశయాన్ని ఇస్తున్నది. ఏటా 6వేల నుంచి 6,500 టన్నుల వరకు క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు సేకరించి అమ్ముతున్నారు. అయితే ఈ ఏడాది 15,066 హెక్టార్లలో పంట ధ్వంసమైనట్లు అధికారులు నిర్ధారించారు. 50 శాతం లోపు నాశనమైన కాఫీ పంట మరో 5 వేల ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఈ కారణంగా దిగుబడులు భారీగా తగ్గాయి. మన్యమంతటా 3వేల టన్నుల లోపే దిగుబడులు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ అంతటా కాఫీ పండ్ల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. పల్పింగ్ పూర్తయి బాగా ఎండాక కాఫీ గింజలు అమ్ముతారు. అప్పుడే కొందరు గింజలను వారపు సంతలకు తెస్తున్నారు. కిలో రూ.100 నుంచి రూ. 110లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు తగ్గినందున రెట్టింపు ధర లభిస్తుందని ఆశించిన ఆదివాసీలకు నిరాశే ఎదురవుతోంది. బెంగళూరు మార్కెట్లో కాఫీ ధరలు బాగా తగ్గిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. బ్రెజిల్, వియత్నాం దేశాల్లో దిగుబడులు బాగుండటంతో విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు డిమాండ్ కూడా తక్కువగా ఉందని వి.మాడుగులకు చెందిన కాఫీ వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాది ప్రారంభంలో కిలో రూ.100లకు కొనుగోలు చేశారు. అప్పట్లో బెంగళూరు మార్కెట్లో డిమాండ్ మేరకు సీజన్ చివరిలో కిలో రూ.200లకు అమ్ముడుపోయాయి. ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థలు కాఫీ గింజలను గిట్టుబాటు ధరకు ఏర్పాట్లు చేయాలని, దళారుల మోసాల నుంచి కాపాడాలని గిరిజన కాఫీ రైతులు కోరుతున్నారు. -
‘కాఫీ’ని కొల్లగొట్టిన హుద్‌హుద్
పాడేరు: హుద్‌హుద్ తుఫాన్ కాఫీ పంటను సైతం తీవ్రంగా దెబ్బతీసింది. రెండేళ్లుగా ఏజెన్సీలో కాఫీ దిగుబడులు అధికంగా ఉండటంతో గిరిజన రైతులు మంచి లాభాలను పొందారు. గత ఏడాది కాఫీ గింజల కొనుగోలు సీజన్లో కిలో రూ.120 ధరతో ప్రారంభంకాగా చివరిలో వ్యాపారులంతా పోటాపోటీగా రూ.200 ధరకు కొనుగోలు చేశారు. దీంతో గిరిజనులకు కాసుల వర్షం కురిసినట్టైంది. ఏజెన్సీ వ్యాప్తంగా లక్ష 60 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలను సాగు చేస్తుండగా 96 వేల ఎకరాల్లో కాఫీ పంట ప్రతి ఏడాది ఫలసాయాన్నిస్తుంది. తద్వారా ప్రతి ఏడాది 6 వేల నుంచి 6,500 టన్నుల వరకు క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో ఏజెన్సీలోని కాఫీ తోటల్లో కాపు విరగ్గాసింది. సుమారు 7 వేల టన్నుల వరకు దిగుబడి ఉంటుందని గిరిజన రైతులు ఆశపడ్డారు. ఈ తరుణంలో తుఫాన్ భారీగా దెబ్బతీసింది. దిగుబడులు సంగతి పక్కన పెడితే పూర్తిగా కాఫీ తోటల్లోని నిడనిచ్చే వృక్షాలు నేలకొరిగి కాఫీ మొక్కలన్నీ ధ్వంసమయ్యాయి. నీడ కరువవ్వడంతో పండ్ల దశలో ఉన్న కాఫీ గింజలు కూడా నేలరాలాయి. కొన్ని చోట్ల వాడిపోవడంతో కాఫీ పంటకు నష్టం వాటిల్లింది. వచ్చే నెలాఖరు నుంచి సీజన్ డిసెంబరు నెలాఖరు నుంచి కాఫీ గింజల కొనుగోలు సీజన్ ప్రారంభం కానుంది. కొంత మంది వ్యాపారులు ఇప్పటికే బ్రెజిల్, వియత్నం దేశాల్లో దిగుబడులు అధికంగా ఉన్నాయని, ఏజెన్సీ కాఫీ గింజల ధరలు పతనం అవుతాయని ప్రచారాన్ని చేపడుతున్నారు. కిలో రూ.100కు కాఫీ గింజలను కొనుగోలు చేసి గిరిజన రైతులను దోచుకునేందుకు వ్యాపారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఏజెన్సీలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ ఐటీడీఏ మాత్రం గిట్టుబాటు ధర కల్పించలేకపోతోంది. ఈ ఏడాదైనా ఈ దిశగా చర్యలు చేపట్టాలని రైతులంతా కోరుతున్నారు.