పాడేరు: హుద్‌హుద్ తుఫాన్ కాఫీ పంటను సైతం తీవ్రంగా దెబ్బతీసింది. రెండేళ్లుగా ఏజెన్సీలో కాఫీ దిగుబడులు అధికంగా ఉండటంతో గిరిజన రైతులు మంచి లాభాలను పొందారు. గత ఏడాది కాఫీ గింజల కొనుగోలు సీజన్‌లో కిలో రూ.120 ధరతో ప్రారంభంకాగా చివరిలో వ్యాపారులంతా పోటాపోటీగా రూ.200 ధరకు కొనుగోలు చేశారు. దీంతో గిరిజనులకు కాసుల వర్షం కురిసినట్టైంది.
ఏజెన్సీ వ్యాప్తంగా లక్ష 60 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలను సాగు చేస్తుండగా 96 వేల ఎకరాల్లో కాఫీ పంట ప్రతి ఏడాది ఫలసాయాన్నిస్తుంది. తద్వారా ప్రతి ఏడాది 6 వేల నుంచి 6,500 టన్నుల వరకు క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో ఏజెన్సీలోని కాఫీ తోటల్లో కాపు విరగ్గాసింది.
సుమారు 7 వేల టన్నుల వరకు దిగుబడి ఉంటుందని గిరిజన రైతులు ఆశపడ్డారు. ఈ తరుణంలో తుఫాన్ భారీగా దెబ్బతీసింది. దిగుబడులు సంగతి పక్కన పెడితే పూర్తిగా కాఫీ తోటల్లోని నిడనిచ్చే వృక్షాలు నేలకొరిగి కాఫీ మొక్కలన్నీ ధ్వంసమయ్యాయి. నీడ కరువవ్వడంతో పండ్ల దశలో ఉన్న కాఫీ గింజలు కూడా నేలరాలాయి. కొన్ని చోట్ల వాడిపోవడంతో కాఫీ పంటకు నష్టం వాటిల్లింది.
వచ్చే నెలాఖరు నుంచి సీజన్
డిసెంబరు నెలాఖరు నుంచి కాఫీ గింజల కొనుగోలు సీజన్ ప్రారంభం కానుంది. కొంత మంది వ్యాపారులు ఇప్పటికే బ్రెజిల్, వియత్నం దేశాల్లో దిగుబడులు అధికంగా ఉన్నాయని, ఏజెన్సీ కాఫీ గింజల ధరలు పతనం అవుతాయని ప్రచారాన్ని చేపడుతున్నారు. కిలో రూ.100కు కాఫీ గింజలను కొనుగోలు చేసి గిరిజన రైతులను దోచుకునేందుకు వ్యాపారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఏజెన్సీలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ ఐటీడీఏ మాత్రం గిట్టుబాటు ధర కల్పించలేకపోతోంది. ఈ ఏడాదైనా ఈ దిశగా చర్యలు చేపట్టాలని రైతులంతా కోరుతున్నారు.
‘కాఫీ’ని కొల్లగొట్టిన హుద్‌హుద్
Published Sun, Nov 9 2014 3:00 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement