ఒలికిన కాఫీ
తగ్గిన దిగుబడులు
గిట్టుబాటు ధరపైనే రైతుల ఆశలు
ఏజెన్సీలో కొనుగోలు మొదలు
{పారంభ ధర రూ.110లు
పాడేరు : ఏజెన్సీలో గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్న కాఫీ పంటను ఈ ఏడాది హుద్‌హుద్ తీవ్రంగా నష్టపరిచింది. దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఏజెన్సీవ్యాప్తంగా 1.46 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. వీటిలో 96 వేల ఎకరాల్లోని పంట ఫలాశయాన్ని ఇస్తున్నది. ఏటా 6వేల నుంచి 6,500 టన్నుల వరకు క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు సేకరించి అమ్ముతున్నారు. అయితే ఈ ఏడాది 15,066 హెక్టార్లలో పంట ధ్వంసమైనట్లు అధికారులు నిర్ధారించారు. 50 శాతం లోపు నాశనమైన కాఫీ పంట మరో 5 వేల ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఈ కారణంగా దిగుబడులు భారీగా తగ్గాయి. మన్యమంతటా 3వేల టన్నుల లోపే దిగుబడులు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ అంతటా కాఫీ పండ్ల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. పల్పింగ్ పూర్తయి బాగా ఎండాక కాఫీ గింజలు అమ్ముతారు. అప్పుడే కొందరు గింజలను వారపు సంతలకు తెస్తున్నారు. కిలో రూ.100 నుంచి రూ. 110లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు తగ్గినందున రెట్టింపు ధర లభిస్తుందని ఆశించిన ఆదివాసీలకు నిరాశే ఎదురవుతోంది. బెంగళూరు మార్కెట్‌లో కాఫీ ధరలు బాగా తగ్గిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
బ్రెజిల్, వియత్నాం దేశాల్లో దిగుబడులు బాగుండటంతో విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు డిమాండ్ కూడా తక్కువగా ఉందని వి.మాడుగులకు చెందిన కాఫీ వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాది ప్రారంభంలో కిలో రూ.100లకు కొనుగోలు చేశారు. అప్పట్లో బెంగళూరు మార్కెట్‌లో డిమాండ్ మేరకు సీజన్ చివరిలో కిలో రూ.200లకు అమ్ముడుపోయాయి. ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థలు కాఫీ గింజలను గిట్టుబాటు ధరకు ఏర్పాట్లు చేయాలని, దళారుల మోసాల నుంచి కాపాడాలని గిరిజన కాఫీ రైతులు కోరుతున్నారు.