పోలీసుల కాల్పుల్లో ఇద్దరు గిరిజనుల మృతి | Two Tribals killed in police firing | Sakshi
Sakshi News home page

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు గిరిజనుల మృతి

Published Sun, Mar 17 2019 5:26 AM | Last Updated on Sun, Mar 17 2019 5:26 AM

Two Tribals killed in police firing - Sakshi

పోలీసు పార్టీల కాల్పుల్లో మృతి చెందిన పెదకోడాపల్లి గిరిజనులు

అరకులోయ/పెదబయలు: విశాఖ ఏజెన్సీలో పోలీసు కూంబింగ్‌ పార్టీల కాల్పులకు ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. మరో ఇద్దరు పరుగులు తీసి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. మృతి చెందిన గిరిజనులు మావోయిస్టు పార్టీ పెదబయలు ఏరియా కమిటీ సభ్యులని పోలీసులు ప్రకటించారు. వేటకు వెళ్లిన ఇద్దరిని దారుణంగా తుపాకులతో కాల్చి చంపారని పెదకోడాపల్లి గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదబయలు మండలంలోని పెదకోడాపల్లి మెట్టవీధికి చెందిన బట్టి భూషణ్‌రావు (50), సిదేరి జమదరి (35) నాటు తుపాకులను వెంటబెట్టుకుని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి అరనంబయలు కొండ, గంగోడిమెట్ట కొండలపైకి బయల్దేరారు. వారికి సహాయంగా కోడా బొంజుబాబు, సిదేరి రాంబాబు ఉన్నారు. కుందేళ్లు, ఇతర అడవీ జంతువుల వేట కోసం వెళ్లారు. అయితే వారి వేట సాగకపోవడంతో, అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో గ్రామానికి కాలినడకన బయల్దేరారు. నాటు తుపాకులు కలిగి ఉన్న భూషణ్‌రావు, జమదరి ముందు నడుస్తుండగా, వారి వెనుకన బొంజుబాబు, రాంబాబు వెళ్తున్నారు. పెదకోడాపల్లి గ్రామానికి సమీపంలోని బురదమామిడి పంట భూముల సమీపంలోకి రాగానే పోలీసు పార్టీలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ముందు నడుస్తున్న బట్టి భూషణ్‌రావు, సిదేరి జమదరి అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక ఉన్న బొంజుబాబు, రాంబాబు తప్పించుకుని సురక్షితంగా గ్రామానికి చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎన్‌కౌంటర్‌ నిజమేనని, సుమారు 20 మంది మావోయిస్టులు సంచరిస్తుండడంతో వారిపై కాల్పులు జరిపామని ప్రకటించారు. 

భగ్గుమన్న గిరిజనులు
కాల్పుల్లో మృతి చెందిన బట్టి భూషణ్‌రావు, సిదేరి జమదరి మావోయిస్టు సభ్యులని పోలీసులు చెప్పడంపై పెదకోడాపల్లి గిరిజనులంతా భగ్గుమన్నారు. దకోడాపల్లి పంచాయతీలోని గిరిజనులంతా శనివారం మధ్యాహ్నం పాడేరుకు చేరుకుని పోలీసుల తీరుపై నిరసన ప్రదర్శన చేశారు. పాడేరు సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. పోలీసులు కాల్పులు జరపడంపై న్యాయ విచారణ చేసి, బాధిత గిరిజనుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాత్రి నుంచే పెదకోడాపల్లి అటవీ ప్రాంతంలో పోలీసు కూంబింగ్‌ పార్టీలు అధికంగా సంచరించాయి. నాటు తుపాకులు కలిగిన ఉన్నందున వారిని మావోయిస్టులు అనుకుని కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాలను అంబులెన్స్‌ ద్వారా పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement