సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ గుర్తింపు చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. సీఆర్‌పీఎఫ్–గ్రేహౌండ్స్ కూంబింగ్‌లో రెండు రోజులక్రితం బయటపడ్డ ల్యాండ్‌మైన్లే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చి గుర్తింపు చాటుకున్న మావోయిస్టు పార్టీ, ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు పథకం రూపొందించినట్టు తెలిసింది. అయితే ముందస్తు భద్రతా చర్యలను చేపట్టిన తెలంగాణ పోలీస్, సీఆర్‌పీఎఫ్ మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేస్తోంది.
మూడు నెలల క్రితమే..
ఈ ఏడాది మార్చిలో ఖమ్మం జిల్లా వెంకటాపురం, వాజేడు ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా పాతిపెట్టిన ల్యాండ్‌మైన్లను బలగాలు కూంబింగ్‌లో భాగంగా నిర్వీర్యం చేశాయి. అయితే భారీ స్థాయిలో ఒక వైపు సీఆర్‌పీఎఫ్, మరోవైపు గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నప్పటికీ మావోయిస్టు పార్టీ మళ్లీ ల్యాండ్‌మైన్లను అమర్చడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సరిగ్గా రెండురోజుల క్రితం చర్ల ప్రాంతంలోని తాలిపేరు ప్రాజెక్టు దగ్గర్లో మావోయిస్టులు అమర్చిన రెండు ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేశారు.
వీటిని ఈ ఏడాది ఆగస్టులో అమర్చినట్టు బలగాలు గుర్తించాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి తెలంగాణ ప్రాంతంలోకి మావోయిస్టులు అడుగుపెట్టడం, ల్యాండ్‌మైన్లు అమర్చడం ఎన్నికల సందర్భంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో చర్ల మండలం ఉంజుపల్లిలో 2009 ఎన్నికల సందర్భంగా ఈవీఎం కంట్రోల్ యూనిట్‌ను టార్గెట్‌గా చేసుకొని ల్యాండ్‌మైన్లను పేల్చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. అయితే అది కుదరకపోవడంతో ఈవీఎం కంట్రోల్ యూనిట్లను తీసుకొని సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును తగులబెట్టారు.
గెరిల్లా దాడులకు వ్యూహం
ఎన్నికల సందర్భంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని నేతలను టార్గెట్ చేస్తూ విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతిసారీ హెచ్చరికలు చేస్తాయి. అయితే ఈసారి గెరిల్లా దాడులకు మావోయిస్టు పార్టీవ్యూహం పన్నేలా కనిపిస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలే టార్గెట్ అనుకొని కేవలం ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకే భద్రత కట్టుదిట్టం చేస్తే, మిగిలిన పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులపై మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలోని టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకొని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యకలాపాలు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని వి«ధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అటవీ ప్రాంతం మొత్తం జల్లెడ పట్టేందుకు ఇప్పటికే బలగాలను రంగంలోకి దించారు.
ఒకవైపు సీఆర్‌పీఎఫ్, మరోవైపు రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేసినట్టు తెలిసింది. ఎన్నికల సమయానికి ముందే మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు రాష్ట్రపోలీస్ శాఖ పనిచేస్తోందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అందులో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టి, ఎక్కడెక్కడ సున్నితమైన పోలింగ్ కేంద్రాలున్నాయో ఆప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకొనిసోదాలు, కూంబింగ్, రోడ్ పార్టీ తనిఖీలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment