Landmines
-
Russia-Ukraine war: ఆగని కన్నీటి వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): నీపర్ నదిపై కఖోవ్కా డ్యామ్ పేలుడుతో కొత్త మలుపు తీసుకున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో జనం కష్టాలు మరింత పెరిగాయి. ఇన్నాళ్లూ బాంబుల మోతతో బంకర్లతో, భూగర్భ గృహాల్లో తలదాచుకున్న జనం ఇప్పుడు అవన్నీ జలమయం కావడంతో పొట్టచేతపట్టుకుని ప్రాణభయంతో పరుగుపెడుతున్నారు. యుద్ధంలో శత్రుదేశ సైన్యం సంహారం కోసం జనావాసాలకు దూరంగా పూడ్చిపెట్టిన మందుపాతరలు వరదప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి. ఆ వరదనీరు జనావాసాలను ముంచెత్తడంతో అవి ఇప్పుడు జనావాసాల్లో ఎక్కడికి కొట్టుకొచ్చి ఆగాయో, ఎప్పుడు పేలుతాయోనన్న భయం జనాలను వెంటాడుతోంది. నీటితో నిండిన నోవా కఖోవ్కా నగరంలో కొంతభాగం రష్యా అధీనంలో మరికొంత భాగం ఉక్రెయిన్ అధీనంలో ఉంది. తమ అధీన నగర ప్రాంతంలో ఐదుగురు చనిపోయారని రష్యా నియమిత మేయర్ వ్లాదిమిర్ గురువారం చెప్పారు. మరికొందరి జాడ గల్లంతైంది. స్థానికుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తాగునీరు కరువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్, మొబైల్ ఫోన్ నెట్వర్క్ పూర్తిగా పోయిందని అధికారులు చెప్పారు. నష్టపరిహారం ఇవ్వండి: జెలెన్స్కీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటించి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ‘రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతవాసులకు వరద నష్టపరిహారం చెల్లించాలి. ఆస్తులు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సాయం అందించాలి’ అని తర్వాత ఆయన కార్యాలయం ఆన్లైన్లో ఒక డిమాండ్ పంపింది. ‘600 చదరపు కిలోమీటర్ల భూభాగం నీటమునిగింది. ఇక్కడ ఏకంగా 18 అడుగుల ఎత్తులో నీరు నిలిచింది. 14,000కుపైగా భవనాలు నీటమునిగాయి. 4,000కుపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు పంపాం’ అని రష్యా నియమిత ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ చెప్పారు. నీపర్ నది తూర్పు పరివాహక ప్రాంతంలో మూడింట రెండొంతుల భూభాగం ర్రష్యా ఆక్రమణలో ఉంది. ఇది విధ్వంసకర దాడే: మేక్రాన్ ‘డ్యామ్‌ను కూల్చేయడం ముమ్మాటికీ విధ్వంసకర దాడే. అరాచక చర్య ఇది’ అని ఏ దేశాన్నీ ప్రస్తావించకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్వీట్‌చేశారు. వాటర్ ప్యూరిఫయర్లు, 5,00,000 ప్యూరిఫికేషన్ టాబ్లెట్లు, శుభ్రతా కిట్లు పంపిస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. ‘డ్యామ్ కూలడానికి మూడు రోజుల ముందు 200 సైనిక వాహనాలు, 2,000 మంది సైనికులను కోల్పోయిన ఉక్రెయిన్ ఆ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు డ్యామ్‌ను ఉక్రెయినే కూల్చింది’ అని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఆరోపించారు. -
అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యం: నిలువెత్తు జ్ఞాపకం
బిడ్డల భవిష్యత్తు కోసం కలలు కంటూ వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరెళ్లినా వారి జ్ఞాపకాలు మాత్రం ఆమె మెడ చుట్టూ చిట్టి చేతుల్లా అల్లుకుపోతూనే ఉంటాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కంది నాగమణి పాతికేళ్ల క్రితం దేశసేవలో కానరాని దూరాలకు వెళ్లిన కొడుకును మళ్లీ కళ్లారా చూడాలనుకుంది. కొడుకు గొప్పతనాన్ని ఆ ఊరి ప్రజల ముందుకు తేవాలనుకుంది తనలాంటి కొడుకు వీధికొక్కరు పుట్టాలని నడివీధిలో విగ్రహాన్ని నిలబెట్టింది. కంది నాగమణి, శంకరయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగునీటి వసతులు లేక వర్షాధారంపై ఆధారపడి సేద్యం చేస్తుండే వాళ్లు. నాగమణి ఇల్లు, వ్యవసాయపనులే కాదు బీడీలు చుట్టే పని కూడా చేస్తుండేది. పెద్ద కొడుకు సిద్దరాములు ఏడో తరగతి వరకు చిట్యాలలో చదువుకున్నాడు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు తాడ్వాయి మండల కేంద్రానికి వెళ్లి చదువుకున్నాడు. 1990 లో సీఆర్పీఎఫ్ జవానుగా సెలెక్టయ్యాడు. అప్పట్లో వాళ్ల గ్రామంలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. పోలీస్ డిపార్టుమెంటులో చేరుతానని ముందుకెళ్లాడు. వద్దని వారించినా వెనకడుగువేయలేదు. ఇంకో అడుగు ముందుకేసి దేశం కోసం సేవ చేస్తానంటూ వెళ్లాడు. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. గుండెలో పేలిన బాంబు 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు పేల్చిన మందుపాతరలో పది మంది వరకు జవాన్లు చనిపోయారు. అందులో సిద్దరాములు ఒకరు. ఇంటికి కబురందింది. తల్లి గుండె చెరువయ్యింది. సీఆర్పీఎఫ్ అధికారులు శవాన్ని తీసుకుని తాడ్వాయికి వచ్చారు. ఆ జ్ఞాపకాల్లోనే.. కొడుకు చనిపోయి పాతికేళ్లు దాటింది. అయినా, ఆ తల్లి మాత్రం కొడుకు జ్ఞాపకాల్లోనే కాలం గడుపుతోంది. చిన్నతనంలో చేసిన అల్లరి, పెద్దయ్యాక చూపిన గుండెధైర్యం ఆమెను రోజూ వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఆలనా పాలనా చిన్న కొడుకు విఠల్ చూసుకుంటున్నాడు. బీపీ, షుగర్ సమస్యలకు మందులు వాడుతోంది. నిత్యం కొడుకు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వచ్చింది. బీడీ కార్మికురాలిగా రిటైర్ అయ్యాక పీఎఫ్‌లో జమ అయిన డబ్బులపై నెలనెలా పెన్షన్ వస్తోంది. ఆ డబ్బులతో కొడుకు విగ్రహం ఏర్పాటు చేయాలని పూనుకుంది. విగ్రహం తయారీకి, ఏర్పాటుకు ఎంతోమందిని కలిసి, తన కల గురించి చెబుతుండేది. దాదాపు రూ.లక్షా 60 వేలు ఖర్చు చేసి సిద్దరాములు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించింది. జై జవాన్.. గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈ నెల 27న జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది నాగమణి. కొడుకు జ్ఞాపకాలతో విగ్రహం ఏర్పాటు చేసిన తల్లిని అందరూ అభినందించారు. నాగమణి మాత్రం నాడు తన కొడుకుతో పాటు మరో పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకుంది. దేశసేవలో జవాన్ల త్యాగం గురించి ఈ సందర్భంగా అందరూ గుర్తుచేసుకున్నారు. పిల్లలు సైతం జై జవాన్ అంటూ దేశసేవలో జవాన్ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. కండ్ల ముందే తిరుగుతున్నట్టుంది చిన్నప్పటి నుంచి నా కొడుకులు ఎంతో కష్టపడి చదువుకున్నరు. తాడ్వాయికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. పెద్దోడు ఉద్యోగంలో చేరిన తరువాత మా కష్టాలు తీరినయి. ఆరేడేండ్లు ఉద్యోగం చేసిండో లేదో చనిపోయిండు. వాడు కనుమరుగై ఇరవై ఐదేండ్లవుతున్నా నా కండ్ల ముందర ఇంకా తిరుగున్నట్టే ఉంటది. యాది జేసుకోని రోజు ఉండది. ఊళ్లో అందరితో ఎంతో ప్రేమగా ఉండేటోడు. రోజూ వాని ఫోటో చూసుకుంటూ ఇన్నేళ్లు గడిపినా. నా కొడుకు లెక్కనే ఉండే విగ్రహం అందరికీ తెలిసేలా పెట్టించాలనుకున్నా. అది ఇన్నాళ్లకి తీరింది. సైనికుడైన నా కొడుకు నాకే కాదు మా ఊరికి కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టిండు. – కంది నాగమణి, అమర జవాన్ సిద్దరాములు తల్లి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం
మగావా.. డ్యూటీలో చాలా సిన్సియర్. రోజూ ఫీల్డ్‌లోకి దిగి ల్యాండ్మైన్లను పసిగట్టడం. వందల మంది ప్రాణాలు రక్షించడం. ఇదంతా ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. ఇట్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్.. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్!!. సూపర్ హీరోకి అర్హతలేంటని అడిగితే.. ఏవేవో చెప్తుంటారు కొందరు. కానీ, ఆ అర్హతలేవీ లేకుంటే?.. ఆ సూపర్ హీరో అసలు మనిషి కాకుంటే!! యస్.. మాగావా మనిషి కాదు. ఓ ఎలుక. సాధారణమైంది మాత్రం కాదు. ల్యాండ్ మైన్లను గుర్తించడంలో కఠోర శిక్షణ తీసుకుంది. తన విధి నిర్వహణలో నిబ్ధదత ప్రదర్శించిన ఈ ఎలుక.. ఈమధ్యే కన్నుమూసింది. అందుకే సోషల్ మీడియాలో అంత ఎమోషనల్ అవుతున్నారు. టాంజానియా బ్రీడ్‌కు చెందిన మగావాను కంబోడియా తీసుకొచ్చి.. ల్యాండ్మైన్లను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో వందకి పైగా ల్యాండ్ మైన్లను గుర్తించింది. తద్వారా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ఈ చిట్టి హీరో. 2020లో మాగ్వా యూకేకి చెందిన ఓ ఆర్గనైజేషన్ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకుంది మగావా. కిందటి ఏడాది జూన్‌లో విధుల నుంచి రిటైర్ అయిన ఈ ఎలుక.. చివరికి ఎనిమిదేళ్ల వయసులో ఈమధ్యే కన్నుమూసింది. ఈ విషయాన్ని దానికి శిక్షణ ఇచ్చిన APOPO అనే బెల్జియం ఎన్జీవో ప్రకటించింది. అంతర్యుద్ధంతో దశాబ్దాలపాటు నలిగిపోయిన కంబోడియా.. ల్యాండ్మైన్ల గనిగా ఒక పేరు దక్కించుకుంది. వీటి ధాటికి వందల మంది ఏటా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అందుకే రిస్క్ లేకుండా ఎలుకలకు ల్యాండ్మైన్లను గుర్తించే శిక్షణ ఇప్పిస్తున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ల్యాండ్మైన్లతో పాటు టీబీ రోగి శాంపిల్స్ గుర్తించేందుకు ఎలుకలను ఉపయోగిస్తున్నారు. విశేషం ఏంటంటే.. చాలా సందర్భాల్లో ఇవి విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేస్తున్నాయి కూడా. అందుకే ఆ ర్యాట్హీరోలకు ఓ సలాం కొడుతూ.. RIP Magawa. -
విశాఖపట్నం: మావోయిస్టు అరెస్టు!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు(ఏసీఎం) కొర్రా సింగ్రు అలియాస్ సుందరరావును శనివారం కూంబింగ్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు హత్యలు, రెండు మందుపాతరలు పేల్చిన ఘటనలు, రెండు కిడ్నాప్‌లు, ఐదు ఎదురుకాల్పుల ఘటనల్లో సుందరరావు నిందితుడని పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా కొండసువ్వాపల్లి గ్రామానికి చెందిన కొర్రా సింగ్రు రెండువేల సంవత్సరంలో రైతు కూలి సంఘంలో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మావోయిస్టు పార్టీలో మిలీషియా, దళ సభ్యుడిగా, పార్టీ మెంబర్‌గా, ప్రస్తుతం పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. విశాఖ జిల్లాలో గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో తిరుగుతూ పలునేరాల్లో పాల్గొన్నాడు. కొర్రాసింగ్రుపై ఏపీలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఒడిశాలోను సుమారు 70కు పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసులకు పట్టుబడిందిలా.. కూంబింగ్ చేస్తున్న పోలీసు పార్టీలపై మందుపాతరను పేల్చి హతమార్చాలన్న లక్ష్యంతో కొర్రా సింగ్రు అలియాస్ సుందరరావు, మరికొంతమంది మావోయిస్టు మిలీషియా సభ్యులతో కలిసి కోరుకొండ ప్రాంతం నుంచి గాలికొండ ప్రాంతానికి మందుపాతరలు తీసుకువెళ్తూ పట్టుబడ్డాడు. సప్పర్ల జంక్షన్ వద్ద సంచితో ఉన్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతనితో వచ్చిన మిలీషియా సభ్యులు తప్పించుకున్నారు. అతని వద్ద సంచిలో కంట్రీమేడ్ పిస్టల్ ఒకటి, 7.65 ఎంఎం లైవ్‌రౌండ్స్ ఐదు, రెండు కిలోల లైవ్ మైన్‌తో ఉన్న స్టీల్ క్యారేజ్ ఒకటి, డిటోనేటర్లు రెండు, 60 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్, 4 నిప్పో బ్యాటరీలు ఉన్నట్టు ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. నాలుగు హత్య కేసుల్లో.. ►డిసెంబర్ 23, 2020న పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ చింతగరువు గ్రామానికి చెందిన చిక్కుడు సత్యారావు అలియాస్ సతీష్‌ను పోలీసు ఇన్ఫార్మర్గా ముద్రవేసి హత్యకు పాల్పడ్డాడు. ►అక్టోబర్ 20, 2019న పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ లండులు గ్రామానికి చెందిన కొర్రా రంగారావును చిట్రకాయల పుట్రువద్ద పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో అత్యంత కిరాతకంగా చంపేశాడు. ►జూన్ 28, 2019న పెదబయలు మండలం, బొంగజంగి గ్రామానికి చెందిన కొర్రా సత్తిబాబును అర్ధరాత్రి ఇంటికి వెళ్లి చంపాడు. ►డిసెంబర్ 9, 2017న జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయితీ మద్దిగరువు గ్రామానికి చెందిన కొలకాని సూర్యచంద్రబాబు, ముక్కాల కిషోర్‌లను మద్దిగరువు గ్రామ శివారులో హతమార్చాడు. చదవండి: మరణ మృదంగం! ఒక్కరోజులోనే 15 మంది మృతి.. కారణాలేవేర్వేరు! -
టిఫిన్ బాక్స్ బాంబు కలకలం
జయపురం: స్థానిక సబ్‌డివిజన్ పరిధిలోని బొయిపరిగుడ సమితి, గుప్తేశ్వర్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన టిఫిన్ బాక్స్ బాంబుని బీఎస్ఎఫ్ జవానులు శనివారం గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మావోయిస్టు అడ్డాగా పేరొందిన రామగిరి ప్రాంతం అడవుల్లో జవానులను లక్ష్యంగా చేసుకుని, మావోయిస్టులు బాంబులు అమర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం తెల్లవారుజామున బొయిపరిగుడ బీఎస్ఎఫ్ 151వ బెటాలియన్ జవానులు పోలీస్ డాగ్ సహాయంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రామగిరి ప్రాంతంలోని పూజారిగుడ కూడలి దగ్గరున్న ప్రయాణికుల విశ్రాంతి భవనానికి కొంత దూరంలో బాంబుని గుర్తించి, డెఫ్యూజ్(నిర్వీర్యం) చేసినట్లు బీఎస్ఎఫ్ 151వ బెటాలియన్ క్యాంపు కమాండెంట్ అజయ్‌కుమార్ తెలిపారు. బీఎస్ఎఫ్ జవానులను టార్గెట్‌గా చేసుకుని, మావోయిస్టులు అమర్చిన ఈ బాంబు సమాచారంతో ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డాగా ఉండడంతో మళ్లీ మావోయిస్టులు ఇక్కడ తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో స్థానికంగా చర్చ నడుస్తుండడం విశేషం. మల్కన్‌గిరిలో మరో బాంబు నిర్వీర్యం.. మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి, నక్కమమ్ముడి పంచాయతీ, బలిమెల కూడలిలో డైక్–3 గ్రామ రహదారిలోని ఓ చెట్టుకి మావోయిస్టులు ఏర్పాటు చేసిన బాంబుని బీఎస్ఎఫ్ జవానులు నిర్వీర్యం చేశారు. అదే ప్రాంతంలో మావోయిస్టుల ఆచూకీ కోసం కూంబింగ్‌కి వెళ్లిన బీఎస్ఎఫ్ జవానులు కూంబింగ్ అనంతరం క్యాంప్‌కి తిరిగివస్తుండగా బాంబుని గుర్తించి, నిర్వీర్యం చేశారు. జవానులను హతమార్చడమే లక్ష్యంగా మావోయిస్టులు ఈ బాంబుని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చదవండి: విషాదం: దైవదర్శనం కోసం వెళ్లి.. భర్త, పిల్లల చూస్తుండగానే.. -
జవాన్లకు యాంటీ–మైన్ బూట్లు
జమ్మూ: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో టెర్రరిస్టులు పాతిపెడుతున్న మందుపాతరలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆర్మీ నడుం బిగించింది. జవాన్ల రక్షణే ధ్యేయంగా నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తున్న భద్రతా బలగాల కోసం మందుపాతర నిరోధక బూట్ల (యాంటీ–మైన్ బూట్స్)ను కొనుగోలు చేసినట్లు ఆర్మీ ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జీత్‌సింగ్ తెలిపారు. ప్రత్యేక నిధులతో వీటిని కొనుగోలు చేసినట్లు ఆదివారం వెల్లడించారు. అక్రమ చొరబాటుదారులను, తీవ్రవాద ప్రాంతాల్లో రహస్యంగా దాచిన పేలుడు పదార్థాలను గుర్తించే డిటెక్టర్ల (డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్లు)ను కూడా కొనుగోలు చేశామన్నారు. వీటితో పాటు అధునాతన గాడ్జెట్లు, నైట్ విజన్ ఉపకరణాలను బలగాలకు సమకూర్చినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాలు, ఎల్వోసీతో సహా మొత్తం 250 కి.మీ. మేర ఉన్న మైదానం, పొదల్లో మందుపాతర ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. వీటిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చలికాలంలో మంచు కురుస్తున్నా కొత్త దారుల్లో ఉగ్రవాదులు చొరబడే అవకాశముందని, వారిని నివారించేందుకు అన్ని కోణాల్లో చర్యలు చేపడుతున్నట్లు సింగ్ చెప్పారు. -
రాష్ట్రంపై మావోయిస్టుల గురి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ గుర్తింపు చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్–గ్రేహౌండ్స్ కూంబింగ్‌లో రెండు రోజులక్రితం బయటపడ్డ ల్యాండ్‌మైన్లే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చి గుర్తింపు చాటుకున్న మావోయిస్టు పార్టీ, ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు పథకం రూపొందించినట్టు తెలిసింది. అయితే ముందస్తు భద్రతా చర్యలను చేపట్టిన తెలంగాణ పోలీస్, సీఆర్పీఎఫ్ మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్మైన్లను నిర్వీర్యం చేస్తోంది. మూడు నెలల క్రితమే.. ఈ ఏడాది మార్చిలో ఖమ్మం జిల్లా వెంకటాపురం, వాజేడు ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా పాతిపెట్టిన ల్యాండ్మైన్లను బలగాలు కూంబింగ్‌లో భాగంగా నిర్వీర్యం చేశాయి. అయితే భారీ స్థాయిలో ఒక వైపు సీఆర్పీఎఫ్, మరోవైపు గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నప్పటికీ మావోయిస్టు పార్టీ మళ్లీ ల్యాండ్మైన్లను అమర్చడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సరిగ్గా రెండురోజుల క్రితం చర్ల ప్రాంతంలోని తాలిపేరు ప్రాజెక్టు దగ్గర్లో మావోయిస్టులు అమర్చిన రెండు ల్యాండ్మైన్లను నిర్వీర్యం చేశారు. వీటిని ఈ ఏడాది ఆగస్టులో అమర్చినట్టు బలగాలు గుర్తించాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి తెలంగాణ ప్రాంతంలోకి మావోయిస్టులు అడుగుపెట్టడం, ల్యాండ్మైన్లు అమర్చడం ఎన్నికల సందర్భంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో చర్ల మండలం ఉంజుపల్లిలో 2009 ఎన్నికల సందర్భంగా ఈవీఎం కంట్రోల్ యూనిట్‌ను టార్గెట్‌గా చేసుకొని ల్యాండ్మైన్లను పేల్చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. అయితే అది కుదరకపోవడంతో ఈవీఎం కంట్రోల్ యూనిట్లను తీసుకొని సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును తగులబెట్టారు. గెరిల్లా దాడులకు వ్యూహం ఎన్నికల సందర్భంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని నేతలను టార్గెట్ చేస్తూ విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతిసారీ హెచ్చరికలు చేస్తాయి. అయితే ఈసారి గెరిల్లా దాడులకు మావోయిస్టు పార్టీవ్యూహం పన్నేలా కనిపిస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలే టార్గెట్ అనుకొని కేవలం ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకే భద్రత కట్టుదిట్టం చేస్తే, మిగిలిన పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులపై మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకొని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యకలాపాలు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని వి«ధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అటవీ ప్రాంతం మొత్తం జల్లెడ పట్టేందుకు ఇప్పటికే బలగాలను రంగంలోకి దించారు. ఒకవైపు సీఆర్పీఎఫ్, మరోవైపు రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేసినట్టు తెలిసింది. ఎన్నికల సమయానికి ముందే మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు రాష్ట్రపోలీస్ శాఖ పనిచేస్తోందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అందులో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టి, ఎక్కడెక్కడ సున్నితమైన పోలింగ్ కేంద్రాలున్నాయో ఆప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకొనిసోదాలు, కూంబింగ్, రోడ్ పార్టీ తనిఖీలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. -
భూపాలపల్లి జిల్లాలో ల్యాండ్మైన్ల అలజడి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటోందా? ఎత్తుగడలకు పదును పెట్టి పోలీస్ శాఖను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రణాళిక రూపొందించిందా? నిఘా వర్గాలు ఇవే అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు పెద్దగా లేవని భావిస్తున్న సమయంలో ల్యాండ్మైన్లు బయటపడటం సంచలనం రేపుతోంది. ఏడాది కిందటే అమర్చారా? భూపాలపల్లి జిల్లా వాజేడు నుంచి వెంకటాపురం వెళ్లే రహదారిలో సోమవారం ఉదయం రెండు ల్యాండ్మైన్లు బయటపడ్డాయి. కల్వర్టు తనిఖీలో భాగంగా బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది వీటిని గుర్తించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి జేసీబీతో రోడ్డును తొలగించి వాటిని వెలికి తీశారు. ఈ రెండు మందుపాతరలు సుమారు 30 కేజీలు బరువున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఉంటూ అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ.. ఏకంగా వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చడం పోలీస్‌శాఖలో కలకలం రేపింది. కూంబింగ్ బలగాలు వరంగల్ నుంచి తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటపురం మీదుగానే అటవీ ప్రాంతంలోకి వెళ్లాల్సి ఉంటుంది. గోదావరి నదిపై నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి మార్గంలో ఎవరిని లక్ష్యంగా చేసుకొని మందుపాతర పెట్టారు? ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతలను లక్ష్యంగా చేసుకున్నారా లేదా గ్రేహౌండ్స్ బలగాలను టార్గెట్ చేశారా అన్న అంశాలపై ఇంటెలిజెన్స్ బృందాలు ఆరా తీస్తున్నాయి. ఇవి ఏడాది కిందటే అమర్చినట్టు ఇటీవలే ముగ్గురు మిలిటెంట్లు ఏటూరు నాగరం పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే రెండే ఉన్నాయా? మావోయిస్టులు ఇంకా మరిన్ని ల్యాండ్మైన్లు అమర్చారా అన్న అంశంపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపేసి, బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు ముమ్మరం చేశారు. ఏడాది క్రితం పేలింది ఇదే దారిలో.. గతేడాది జూలైలో ఇదే రహదారిలో ప్రెషర్ కుక్కర్ బాంబ్‌ను మావోయిస్టు పార్టీ అమర్చింది. దానిపై ఓ గిరిజన యువకుడు తెలియక కాలు వేయడంతో బాంబు పేలి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో రిజర్వ్‌ఫారెస్ట్‌గా ఉన్న ఏటూరు నాగారం నుంచి వాజేడు, వాజేడు నుంచి వెంకటాపురం, అలబాక, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు అటవీ ప్రాంతంలో అనేక ల్యాండ్మైన్లు అమర్చి ఉంటారని స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం అనుమానం వ్యక్తం చేస్తోంది. మేడారం జాతర.. నేతల పర్యటనలు.. భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు ముఖ్య నాయకులున్నారు. ఒకరు అసెంబ్లీ స్పీకర్, మరొకరు మంత్రి చందూలాల్. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లాల్లో పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే జనవరి చివరి వారంలో మేడారం జాతర జరగనుంది. ఈ జాతరకు ముందు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ఉన్న మేడారం, ఏటూరు నాగారం, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం, అలబకా ప్రాంతాల్లో భారీ ఎత్తున కూంబింగ్ చేపడతారు. ఇందులో భాగంగా పోలీస్ బలగాలను తిప్పి కొట్టడమే కాకుండా మావోయిస్టు కార్యక్రమాలు విస్తృతమయ్యాయన్న సంకేతం పంపేందుకే మందుపాతర అమర్చి ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. -
ఎలుకలు కూడా వాటిని పట్టేస్తాయి !
-
ఏజెన్సీలో రెండు మందుపాతర్లు స్వాధీనం
ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్జీఏ) వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు రెండు మందుపాతర్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ చల్దిగెడ్డ అటవీ ప్రాంతంలో కొయ్యూరు ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. భూమిలో పాతిపెట్టిన రెండు మందుపాతర్లను పసిగట్టి తొలగించారు. ఈ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసి తమపై దాడి చేయడానికే మావోయిస్టులు వీటిని అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. -
జాగిలాల ప్రయోగం సక్సెస్!
- మలినాయిస్ జాతి జాగిలాల్ని బిహార్‌లో వినియోగించిన సీఆర్పీఎఫ్ - సెర్చ్ ఆపరేషన్స్‌లో కీలకపాత్ర సాక్షి, హైదరాబాద్: బెల్జియం మలినాయిస్ జాగిలాలు తమ ప్రత్యేకతను చాటాయి. మందుపాతరలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) బాంబుల్ని గుర్తించడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్నాయి. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్స్‌లో బెల్జియం మలినాయిస్ జాగిలాల్ని వినియోగించటానికి కేంద్ర హోంశాఖ(ఎంహెచ్ఏ) అనుమతి పొందిన సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రయోగాత్మకంగా వాటిని బిహార్‌లో ఉపయోగించింది. బిహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్‌లో మలినాయిస్ జాగిలాలు కీలకపాత్ర పోషించినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నివేదికను రూపొందించి ఎంహెచ్ఏకు పంపారు. బిహార్ ఎన్నికల్ని భగ్నం చేయాలని కుట్రపన్నిన మావోయిస్టులు భారీ పథక రచన చేశారని, ప్రధానంగా జాముయ్, గయ, నవద తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ప్రయాణించే మార్గాల్లో మందుపాతరలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) బాంబుల్ని ఏర్పాటు చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో వీటిని గుర్తించి.. నిర్వీర్యం చేసే బాధ్యతల్ని బిహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సహకారంతో సీఆర్పీఎఫ్ చేపట్టింది. ఇందులో భాగంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్స్‌లో ప్రయోగాత్మకంగా బెల్జియం మలినాయిస్ జాగిలాల్ని వినియోగించింది. గత గురువారం నిర్విరామంగా పనిచేసిన ఈ జాగిలాలు జాముయ్ జిల్లాలోని భీమ్బంద్తోపాటు నవద జిల్లాలో మావోయిస్టులు అమర్చిన 51 బాంబుల్ని గుర్తించాయి. భూమిలో దాచిన వాటినేగాక కల్వర్టులకింద, పడవల్లోనూ అమర్చిన బాంబుల్ని సైతం గుర్తించి.. నిర్వీర్యం చేయడంలో సీఆర్పీఎఫ్కు సహకరించాయి. రోడ్డు సదుపాయంలేని ప్రాంతాలకు భద్రతా బలగాలు మరపడవల ద్వారా వెళుతుంటాయి. మావోయిస్టులు వీటిలో బాంబులు అమర్చడం ఇదే తొలిసారి. అయినప్పటికీ మలినాయిస్ జాగిలాలు వాటిని తేలిగ్గా గుర్తించాయని సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. గయ జిల్లాలోని ఇమాంగంజ్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్లలో అమర్చిన 10 కేజీల పేలుడు పదార్థాన్ని గుర్తించడంలోనూ ఇవి సఫలీకృతమయ్యాయి. షెపర్డ్, లాబ్రెడార్ స్థానంలో మలినాయిస్ బెల్జియం మలినాయిస్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఈ విభాగానికి చెందిన కెన్నెల్ యూనిట్లో ఉన్న 350 జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ శునకాల స్థానంలో వీటిని తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ జాగిలాల్ని ఢిల్లీ పోలీసుతోసహా ఇతర పోలీసు విభాగాలకు అందించాలని సీఆర్పీఎఫ్ యోచిస్తోంది. -
తప్పిన ముప్పు
మందుపాతర పేల్చిన మావోయిస్టులు నక్కబంద వద్ద ఘటనతో ఉలిక్కిపడిన ఏజెన్సీ బయటపడ్డ పోలీసులు పట్టుకోసం మావోయిస్టుల పన్నాగం గూడెంకొత్తవీధి : చాలాకాలం తరువాత పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చా రు. శుక్రవారం సాయంత్రం జీకేవీధి మండలంలోని చోటుచేసుకున్న ఈ ఘటనతో ఏజెన్సీలో ఒక్కసారిగా భయానక వాతావరణం అలముకుంది. పోలీసులకు పెను ప్రమాదమే తప్పింది. ఆది నుంచి మందుపాతరలనే ఆయుధంగా చేసుకుని పోలీసులను దెబ్బతీసేవారు. అటవీ ప్రాంతంలో అడుగడుగునా మా వోయిస్టులు మందుపాతరలు ఏర్పాటు చేస్తుండటంతో పోలీ సు బలగాలు గాలింపు చర్యలకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. దీంతో వ్యూహం మార్చిన పోలీసులు అటవీ ప్రాంతంలో ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుని మావోయిస్టులను పట్టుకోవాలనే పన్నాగం పన్నినా ఫలించ లేదు. రెండేళ్ల క్రితం మండలంలోని నేరెళ్లబంద అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలపై ఓ మందు పాతర పేల్చిన ఘటనలో పోలీసు బలగాలు స్వల్పగాయాలతో బయట పడ్డాయి. ఈ తరుణంలో ఈ ఏడాది పీఎల్జీఏ వారోత్సవాలను పురస్కరించుకుని మావోయిస్టులు మరోసారి పోలీసులను దెబ్బతీసేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగానే కుంకంపూడి నుంచి నక్కబంద అటవీ ప్రాంతానికి వెళ్లే కాలిబాటలో మావోయిస్టులు రెండు మందుపాతరలను అమర్చారు. మందు పాతర పేల్చకపోతే: పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో నక్కబంద అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తిష్ట వేసినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో జిల్లా రూరల్ ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ శుక్రవారం జీకేవీధిని సందర్శించి మావోయిస్టుల కదలికలపై ఇక్కడి పోలీసులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు తిష్టవేసి ఉన్న నక్కబంద అటవీ ప్రాంతానికి పోలీసు బలగాలు తరలి వెళ్లాయి. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి అతి సమీపానికి చేరుకోగానే వీరిని పసిగట్టిన మావోయిస్టులు ఆదరాబాదరాగా మందు పాతరను ముందుగానే పేల్చివేసి అక్కడ నుంచి తప్పించుకున్నారు. లేకుంటే ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగి ఉండేవని ఆ ప్రాంతవాసులే చెబుతున్నారు. ఎవరి వ్యూహం ఫలించేనో..? పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేయాలని పోలీసు యంత్రాంగం వ్యూహాలను రచిస్తుంటే, మరోపక్క మావోయిస్టులు పోలీసు బలగాలను మందుపాతరలతో కలవర పెడుతున్నారు. దీంతో ఇరువర్గాలు పోరుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికే అడుగడుగునా ముమ్మర తనిఖీలు, విస్తృత గాలింపు చర్యలు చేపడుతుండగా, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారని సమచారం. ఏది ఏమైనా ఇరువర్గాల వ్యూహాలతో విశాఖ ఏజెన్సీలోని మరింత భయానక వాతావరణం నెలకొంది.