పోలీసులు వెలికితీసిన ల్యాండ్‌మైన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటోందా? ఎత్తుగడలకు పదును పెట్టి పోలీస్ శాఖను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రణాళిక రూపొందించిందా? నిఘా వర్గాలు ఇవే అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు పెద్దగా లేవని భావిస్తున్న సమయంలో ల్యాండ్‌మైన్లు బయటపడటం సంచలనం రేపుతోంది.
ఏడాది కిందటే అమర్చారా?
భూపాలపల్లి జిల్లా వాజేడు నుంచి వెంకటాపురం వెళ్లే రహదారిలో సోమవారం ఉదయం రెండు ల్యాండ్‌మైన్లు బయటపడ్డాయి. కల్వర్టు తనిఖీలో భాగంగా బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది వీటిని గుర్తించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి జేసీబీతో రోడ్డును తొలగించి వాటిని వెలికి తీశారు. ఈ రెండు మందుపాతరలు సుమారు 30 కేజీలు బరువున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఉంటూ అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ.. ఏకంగా వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చడం పోలీస్‌శాఖలో కలకలం రేపింది. కూంబింగ్ బలగాలు వరంగల్ నుంచి తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటపురం మీదుగానే అటవీ ప్రాంతంలోకి వెళ్లాల్సి ఉంటుంది. గోదావరి నదిపై నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి మార్గంలో ఎవరిని లక్ష్యంగా చేసుకొని మందుపాతర పెట్టారు? ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతలను లక్ష్యంగా చేసుకున్నారా లేదా గ్రేహౌండ్స్ బలగాలను టార్గెట్ చేశారా అన్న అంశాలపై ఇంటెలిజెన్స్ బృందాలు ఆరా తీస్తున్నాయి. ఇవి ఏడాది కిందటే అమర్చినట్టు ఇటీవలే ముగ్గురు మిలిటెంట్లు ఏటూరు నాగరం పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే రెండే ఉన్నాయా? మావోయిస్టులు ఇంకా మరిన్ని ల్యాండ్‌మైన్లు అమర్చారా అన్న అంశంపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపేసి, బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు ముమ్మరం చేశారు.
ఏడాది క్రితం పేలింది ఇదే దారిలో..
గతేడాది జూలైలో ఇదే రహదారిలో ప్రెషర్ కుక్కర్ బాంబ్‌ను మావోయిస్టు పార్టీ అమర్చింది. దానిపై ఓ గిరిజన యువకుడు తెలియక కాలు వేయడంతో బాంబు పేలి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో రిజర్వ్‌ఫారెస్ట్‌గా ఉన్న ఏటూరు నాగారం నుంచి వాజేడు, వాజేడు నుంచి వెంకటాపురం, అలబాక, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు అటవీ ప్రాంతంలో అనేక ల్యాండ్‌మైన్లు అమర్చి ఉంటారని స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం అనుమానం వ్యక్తం చేస్తోంది.
మేడారం జాతర.. నేతల పర్యటనలు..
భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు ముఖ్య నాయకులున్నారు. ఒకరు అసెంబ్లీ స్పీకర్, మరొకరు మంత్రి చందూలాల్. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లాల్లో పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే జనవరి చివరి వారంలో మేడారం జాతర జరగనుంది. ఈ జాతరకు ముందు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ఉన్న మేడారం, ఏటూరు నాగారం, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం, అలబకా ప్రాంతాల్లో భారీ ఎత్తున కూంబింగ్ చేపడతారు. ఇందులో భాగంగా పోలీస్ బలగాలను తిప్పి కొట్టడమే కాకుండా మావోయిస్టు కార్యక్రమాలు విస్తృతమయ్యాయన్న సంకేతం పంపేందుకే మందుపాతర అమర్చి ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment