తప్పిన ముప్పు
మందుపాతర పేల్చిన మావోయిస్టులు
నక్కబంద వద్ద ఘటనతో ఉలిక్కిపడిన ఏజెన్సీ
బయటపడ్డ పోలీసులు
పట్టుకోసం మావోయిస్టుల పన్నాగం
గూడెంకొత్తవీధి : చాలాకాలం తరువాత పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతరలు పేల్చా రు. శుక్రవారం సాయంత్రం జీకేవీధి మండలంలోని చోటుచేసుకున్న ఈ ఘటనతో ఏజెన్సీలో ఒక్కసారిగా భయానక వాతావరణం అలముకుంది. పోలీసులకు పెను ప్రమాదమే తప్పింది. ఆది నుంచి మందుపాతరలనే ఆయుధంగా చేసుకుని పోలీసులను దెబ్బతీసేవారు. అటవీ ప్రాంతంలో అడుగడుగునా మా వోయిస్టులు మందుపాతరలు ఏర్పాటు చేస్తుండటంతో పోలీ సు బలగాలు గాలింపు చర్యలకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. దీంతో వ్యూహం మార్చిన పోలీసులు అటవీ ప్రాంతంలో ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుని మావోయిస్టులను పట్టుకోవాలనే పన్నాగం పన్నినా ఫలించ లేదు. రెండేళ్ల క్రితం మండలంలోని నేరెళ్లబంద అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలపై ఓ మందు పాతర పేల్చిన ఘటనలో పోలీసు బలగాలు స్వల్పగాయాలతో బయట పడ్డాయి. ఈ తరుణంలో ఈ ఏడాది పీఎల్‌జీఏ వారోత్సవాలను పురస్కరించుకుని మావోయిస్టులు మరోసారి పోలీసులను దెబ్బతీసేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగానే కుంకంపూడి నుంచి నక్కబంద అటవీ ప్రాంతానికి వెళ్లే కాలిబాటలో మావోయిస్టులు రెండు మందుపాతరలను అమర్చారు.
మందు పాతర పేల్చకపోతే: పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో నక్కబంద అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తిష్ట వేసినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో జిల్లా రూరల్ ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ శుక్రవారం జీకేవీధిని సందర్శించి మావోయిస్టుల కదలికలపై ఇక్కడి పోలీసులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు తిష్టవేసి ఉన్న నక్కబంద అటవీ ప్రాంతానికి పోలీసు బలగాలు తరలి వెళ్లాయి. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి అతి సమీపానికి చేరుకోగానే వీరిని పసిగట్టిన మావోయిస్టులు ఆదరాబాదరాగా మందు పాతరను ముందుగానే పేల్చివేసి అక్కడ నుంచి తప్పించుకున్నారు. లేకుంటే ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగి ఉండేవని ఆ ప్రాంతవాసులే చెబుతున్నారు.
ఎవరి వ్యూహం ఫలించేనో..?
పీఎల్‌జీఏ వారోత్సవాలను భగ్నం చేయాలని పోలీసు యంత్రాంగం వ్యూహాలను రచిస్తుంటే, మరోపక్క మావోయిస్టులు పోలీసు బలగాలను మందుపాతరలతో కలవర పెడుతున్నారు. దీంతో ఇరువర్గాలు పోరుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికే అడుగడుగునా ముమ్మర తనిఖీలు, విస్తృత గాలింపు చర్యలు చేపడుతుండగా, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారని సమచారం. ఏది ఏమైనా ఇరువర్గాల వ్యూహాలతో విశాఖ ఏజెన్సీలోని మరింత భయానక వాతావరణం నెలకొంది.