జాగిలాల ప్రయోగం సక్సెస్!
- మలినాయిస్ జాతి జాగిలాల్ని బిహార్‌లో వినియోగించిన సీఆర్పీఎఫ్
- సెర్చ్ ఆపరేషన్స్‌లో కీలకపాత్ర
సాక్షి, హైదరాబాద్: బెల్జియం మలినాయిస్ జాగిలాలు తమ ప్రత్యేకతను చాటాయి. మందుపాతరలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) బాంబుల్ని గుర్తించడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్నాయి. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్స్‌లో బెల్జియం మలినాయిస్ జాగిలాల్ని వినియోగించటానికి కేంద్ర హోంశాఖ(ఎంహెచ్‌ఏ) అనుమతి పొందిన సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రయోగాత్మకంగా వాటిని బిహార్‌లో ఉపయోగించింది. బిహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్‌లో మలినాయిస్ జాగిలాలు కీలకపాత్ర పోషించినట్టు అధికారులు నిర్ధారించారు.
ఈ మేరకు నివేదికను రూపొందించి ఎంహెచ్‌ఏకు పంపారు. బిహార్ ఎన్నికల్ని భగ్నం చేయాలని కుట్రపన్నిన మావోయిస్టులు భారీ పథక రచన చేశారని, ప్రధానంగా జాముయ్, గయ, నవద తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ప్రయాణించే మార్గాల్లో మందుపాతరలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) బాంబుల్ని ఏర్పాటు చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో వీటిని గుర్తించి.. నిర్వీర్యం చేసే బాధ్యతల్ని బిహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సహకారంతో సీఆర్పీఎఫ్ చేపట్టింది. ఇందులో భాగంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్స్‌లో ప్రయోగాత్మకంగా బెల్జియం మలినాయిస్ జాగిలాల్ని వినియోగించింది.
గత గురువారం నిర్విరామంగా పనిచేసిన ఈ జాగిలాలు జాముయ్ జిల్లాలోని భీమ్‌బంద్‌తోపాటు నవద జిల్లాలో మావోయిస్టులు అమర్చిన 51 బాంబుల్ని గుర్తించాయి. భూమిలో దాచిన వాటినేగాక కల్వర్టులకింద, పడవల్లోనూ అమర్చిన బాంబుల్ని సైతం గుర్తించి.. నిర్వీర్యం చేయడంలో సీఆర్పీఎఫ్‌కు సహకరించాయి. రోడ్డు సదుపాయంలేని ప్రాంతాలకు భద్రతా బలగాలు మరపడవల ద్వారా వెళుతుంటాయి. మావోయిస్టులు వీటిలో బాంబులు అమర్చడం ఇదే తొలిసారి. అయినప్పటికీ మలినాయిస్ జాగిలాలు వాటిని తేలిగ్గా గుర్తించాయని సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. గయ జిల్లాలోని ఇమాంగంజ్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్లలో అమర్చిన 10 కేజీల పేలుడు పదార్థాన్ని గుర్తించడంలోనూ ఇవి సఫలీకృతమయ్యాయి.
షెపర్డ్, లాబ్రెడార్ స్థానంలో మలినాయిస్
బెల్జియం మలినాయిస్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఈ విభాగానికి చెందిన కెన్నెల్ యూనిట్‌లో ఉన్న 350 జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ శునకాల స్థానంలో వీటిని తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ జాగిలాల్ని ఢిల్లీ పోలీసుతోసహా ఇతర పోలీసు విభాగాలకు అందించాలని సీఆర్పీఎఫ్ యోచిస్తోంది.