జమ్మూ: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో టెర్రరిస్టులు పాతిపెడుతున్న మందుపాతరలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆర్మీ నడుం బిగించింది. జవాన్ల రక్షణే ధ్యేయంగా నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తున్న భద్రతా బలగాల కోసం మందుపాతర నిరోధక బూట్ల (యాంటీ–మైన్ బూట్స్)ను కొనుగోలు చేసినట్లు ఆర్మీ ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జీత్‌సింగ్ తెలిపారు. ప్రత్యేక నిధులతో వీటిని కొనుగోలు చేసినట్లు ఆదివారం వెల్లడించారు.
అక్రమ చొరబాటుదారులను, తీవ్రవాద ప్రాంతాల్లో రహస్యంగా దాచిన పేలుడు పదార్థాలను గుర్తించే డిటెక్టర్ల (డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్లు)ను కూడా కొనుగోలు చేశామన్నారు. వీటితో పాటు అధునాతన గాడ్జెట్లు, నైట్ విజన్ ఉపకరణాలను బలగాలకు సమకూర్చినట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాలు, ఎల్‌వోసీతో సహా మొత్తం 250 కి.మీ. మేర ఉన్న మైదానం, పొదల్లో మందుపాతర ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. వీటిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చలికాలంలో మంచు కురుస్తున్నా కొత్త దారుల్లో ఉగ్రవాదులు చొరబడే అవకాశముందని, వారిని నివారించేందుకు అన్ని కోణాల్లో చర్యలు చేపడుతున్నట్లు సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment