జయపురం: రామగిరి ప్రాంతంలో బాంబుని గుర్తించిన దృశ్యం
జయపురం: స్థానిక సబ్‌డివిజన్ పరిధిలోని బొయిపరిగుడ సమితి, గుప్తేశ్వర్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన టిఫిన్ బాక్స్ బాంబుని బీఎస్‌ఎఫ్ జవానులు శనివారం గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మావోయిస్టు అడ్డాగా పేరొందిన రామగిరి ప్రాంతం అడవుల్లో జవానులను లక్ష్యంగా చేసుకుని, మావోయిస్టులు బాంబులు అమర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో శనివారం తెల్లవారుజామున బొయిపరిగుడ బీఎస్‌ఎఫ్ 151వ బెటాలియన్ జవానులు పోలీస్ డాగ్ సహాయంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రామగిరి ప్రాంతంలోని పూజారిగుడ కూడలి దగ్గరున్న ప్రయాణికుల విశ్రాంతి భవనానికి కొంత దూరంలో బాంబుని గుర్తించి, డెఫ్యూజ్(నిర్వీర్యం) చేసినట్లు బీఎస్‌ఎఫ్ 151వ బెటాలియన్ క్యాంపు కమాండెంట్ అజయ్‌కుమార్ తెలిపారు. బీఎస్‌ఎఫ్ జవానులను టార్గెట్‌గా చేసుకుని, మావోయిస్టులు అమర్చిన ఈ బాంబు సమాచారంతో ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డాగా ఉండడంతో మళ్లీ మావోయిస్టులు ఇక్కడ తిష్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో స్థానికంగా చర్చ నడుస్తుండడం విశేషం.
మల్కన్‌గిరిలో మరో బాంబు నిర్వీర్యం..
మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి, నక్కమమ్ముడి పంచాయతీ, బలిమెల కూడలిలో డైక్–3 గ్రామ రహదారిలోని ఓ చెట్టుకి మావోయిస్టులు ఏర్పాటు చేసిన బాంబుని బీఎస్‌ఎఫ్ జవానులు నిర్వీర్యం చేశారు. అదే ప్రాంతంలో మావోయిస్టుల ఆచూకీ కోసం కూంబింగ్‌కి వెళ్లిన బీఎస్‌ఎఫ్ జవానులు కూంబింగ్ అనంతరం క్యాంప్‌కి తిరిగివస్తుండగా బాంబుని గుర్తించి, నిర్వీర్యం చేశారు. జవానులను హతమార్చడమే లక్ష్యంగా మావోయిస్టులు ఈ బాంబుని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
చదవండి: విషాదం: దైవదర్శనం కోసం వెళ్లి.. భర్త, పిల్లల చూస్తుండగానే..