సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 10 మంది పోలీసులను మావోయిస్టులు బలి తీసుకున్న సంగతి తెలిసిందే. పల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ సిబ్బంది మినీ బస్సులో ఆ ప్రాంతానికి మంగళవారం బయలుదేరి వెళ్లారు.
గాలింపు చర్యలు పూర్తిచేసి బుధవారం దంతెవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం సమయంలో పల్నార్–అరన్‌పూర్ మధ్యలో ఉన్న అటవీ ప్రాంతానికి మినీ బస్సు చేరుకోగానే రోడ్డు మధ్యలో అమర్చిన ఐఈడీ బాంబును మావోయిస్టులు పేల్చారు. పేలుడు ధాటికి మినీ బస్సు గాల్లోకి లేచి పక్కన చెట్లలో పడిపోయింది. బస్సు భాగాలు తునాతునకలు అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది డీఆర్‌జీ సిబ్బంది, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
భద్రతా బలగాలు తొందరపాటు చర్యవల్లే..
పేలుడు జరిగిన తీరును చూస్తే కూంబింగ్‌లో పోలీసులు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్ (ఎస్‌ఓపీ) పాటించలేదని తెలుస్తోంది. ప్రొటోకాల్ ప్రకారం నిఘా సమాచారాన్ని పక్కాగా ధ్రువీకరించుకోవాలి. తర్వాత భద్రతా దళాలు ప్రయాణించే మార్గంలో ప్రమాదం జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి . అవసరమైతే భద్రతా దళాల కంటే ముందు రోడ్ ఆపరేటింగ్ పార్టీని పంపించాలి. మినీ బస్సులో బయలుదేరిన డీఆర్‌జీ బృందం వీటిని పాటించలేదని తెలుస్తోంది. దాంతో తిరుగు ప్రయాణంలో మావోయిస్టుల ఉచ్చులో చిక్కారు. 2021 ఏప్రిల్ 3న బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో టేకుల్‌గూడా సమీపంలో సైతం ఇదే తరహాలో మావోయిస్టులు పన్నిన ట్రాప్‌లో భద్రతా దళాలు చిక్కుకున్నాయి. ఆ ఘటనలో 22 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది బలయ్యారు.
టీసీఓసీ ఉచ్చులో..
వేసవికి ముందు అడవుల్లో పచ్చదనం పలచబడుతుంది. ఈ సమయంలో మావోయిస్టులు అడవి లోపలికి వెళ్లిపోతుంటారు. పోలీసులు మరింత ఉధృతంగా వారి కోసం గాలిస్తుంటారు. ప్రతి వేసవిలో సాయుధ భద్రతా దళాల దూకుడుతో మావోయిస్టులు చిక్కుల్లో పడుతున్నారు. దీంతో భద్రతా దళాల వేగానికి అడ్డకట్ట వేసేందుకు కొంతకాలంగా టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెన్ (టీసీఓసీ) పేరుతో సరికొత్త వ్యూహాన్ని మావోయిస్టులు అమలు చేస్తున్నారు. భావజాల వ్యాప్తి, కొత్త రిక్రూట్‌మెంట్, భద్రతా దళాలపై మెరుపుదాడులు చేయడం టీసీఓసీలో వ్యూహంలో భాగంగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో టీసీఓసీని మావోయిస్టులు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే పల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు సంచారిస్తున్నాయంటూ భద్రతా దళాలకు సమాచారం చేరవేసి తమ ఉచ్చులో పడేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment