సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పోలీస్ శాఖ అప్రకటిత హైఅలర్ట్ ప్రకటించింది. వారం నుంచి తెలంగాణ–మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో తుపాకుల మోత మోగుతోంది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 49 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ప్రతీకారం దిశగా మావోయిస్టు పార్టీ కార్యాచరణ రూపొందించినట్లు ఎస్‌ఐబీ వర్గాల సమాచారంతో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. అటు మావోయిస్టు పార్టీ సైతం దెబ్బకు దెబ్బ తప్పదంటూ హెచ్చరిక జారీచేసింది. దీనితో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది.
ప్రజల చేతిలో శిక్ష తప్పదు: మావోయిస్టు పార్టీ
అమాయక గిరిజన మహిళలపై మావోయిస్టుల నెపం మోపి అత్యంత కిరాతకంగా కాల్చి చంపుతున్నారంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ బూటకమని, ఏకపక్షంగా కాల్పులు జరిపి రోజుకో ఎన్‌కౌంటర్ పేరుతో మృతదేహాలను చూపిస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. ఇంతటి దారుణకాండకు పాల్పడ్డ పాలకులకు, పోలీస్ బలగాలకు ప్రజల చేతిలో శిక్ష తప్పదంటూ.. దెబ్బకు దెబ్బ తీస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో జరుగుతున్న మారణకాండకు నిరసనగా మావోయిస్టు పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు పార్టీ వెల్లడించింది. ఇందులో భాగంగా మే 4న తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
ఎమ్మెల్యే మధు టార్గెట్‌గా లేఖలు..
మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకర్‌ను టార్గెట్ చేస్తూ మావోయిస్టు పార్టీ కొద్ది రోజులుగా కదలికలు చేపట్టినట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) భావి స్తోంది. దీనికి బలం చేకూర్చేలా మావోయిస్టు పార్టీ కొద్దిరోజుల క్రితం మధుకర్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదంటూ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు...
గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులకు పోలీస్ శాఖ భద్రత పెంచినట్లు తెలుస్తోంది. ఏడాది నుంచి పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం తదితర ప్రాం తాల్లోని ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.
వారం నుంచి వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాం తాల్లో హైఅలర్ట్ ప్రకటించినట్లు వారు తెలిపారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా మారుమూల ప్రాంతాల పర్యటనకు వెళ్లవద్దని సంబంధిత ఎస్పీలు ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు. అటు గ్రేహౌండ్స్, జిల్లాల పార్టీలను రంగంలోకి దించిన పోలీస్ శాఖ కూంబింగ్‌ను వేగవంతం చేసింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి మావోయిస్టులను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు భారీ స్థాయి లో ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిసింది.
4న మావోయిస్టుల రాష్ట్ర బంద్
Published Sun, Apr 29 2018 1:53 AM | Last Updated on Sun, Apr 29 2018 8:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment