సాక్షి,హైదరాబాద్:మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు.ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ శనివారం(జనవరి18) ఓ లేఖను విడుదల చేసింది.
దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. దాదాపు 30 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆయన పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో50 లక్షల రివార్డు కూడా ఉంది. తెలంగాణలోనూ 25లక్షల రివార్డు ఉంది.ఆరు నెలల క్రితమే ఆయన తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.మావోయిస్టు యాక్షన్ టీమ్‌లకు ఆయన ఇన్‌చార్జిగానూ ఉన్నారు.
తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఘటన.. బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావో యిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు.
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పడుతుండగా మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల్లో దామోదర్ కూడా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ తాజాగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment