పెద్దపల్లి: మావోయిస్టు పార్టీని బలహీనం చేసేందుకు పోలీసుశాఖ పెద్ద తలలపైనే గురిపెట్టింది. సాధారణ మిలిటెంట్ల కంటే.. రాష్ట్ర కార్యదర్శులు, అగ్రనేతలను టార్గెట్ చేసింది. అందులో భాగంగా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణపై గురిపెట్టింది. తాజాగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో తడపలగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు పీపుల్స్‌వార్‌గా ఉన్నప్పుడు, మావోయిస్టు పార్టీగా మారిన తర్వాత కలిపి.. 1979 నుంచి ఇప్పటివరకు 12 మంది రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేశారు. అందులో ముగ్గురు మినహా అందరూ ఎన్‌కౌంటర్లలోనే మరణించారు. కొందరు రాష్ట్ర కార్యదర్శులుగా ఉండగా.. మరికొందరు కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగాక తూటాలకు బలయ్యారు.
వరుసగా పెద్దలంతా..
పీపుల్స్‌వార్ ప్రారంభమైన తొలినాళ్లలో పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర్‌రావు ప్రహ్లాద్ పేరిట రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. తర్వాత 1985లో రఘు పేరిట నల్లా ఆదిరెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ.. హైదరాబాద్‌లో అరెస్టయ్యారు. ఆ స్థానంలో ఇన్‌చార్జి రాష్ట్రకార్యదర్శిగా ప్రస్తుత కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి కొంతకాలం ఉన్నారు. అయితే నల్లా ఆదిరెడ్డి ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకుని వెళ్లి.. తిరిగి రాష్ట్ర కార్యదర్శిగా 1989 వరకు పనిచేశారు. నల్లా ఆదిరెడ్డి, గణపతిలు కేంద్ర కమిటీకి వెళ్లిన తర్వాత పులి అంజయ్య రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ.. ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తర్వాత నియమితులైన ఎర్రం సంతోష్‌రెడ్డి.. కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఉత్తర తెలంగాణ కమిటీ సెక్రటరీ శీలం నరేశ్‌లు 1999లో మంథని ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దాంతో పీపుల్స్‌వార్ పార్టీకి తొలిసారిగా భారీ నష్టం జరిగింది. తెలంగాణ మైదాన, దండకారణ్యంలో ప్రభావం చూపించగల ముగ్గురు నాయకులు ఒకేసారి మృతి చెందడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోయింది.
వేర్వేరు కమిటీలుగా నియమించినా..
1999 ఎన్‌కౌంటర్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేరుగా రెండు రాష్ట్రాల కమిటీలను పీపుల్స్‌వార్ నియమించింది. ఏపీ కమిటీకి నియమించిన చింతల వెంకటస్వామి ఎన్‌కౌంటర్ కావడంతో ఆ స్థానంలో బుర్ర చిన్నన్న అలియాస్ మాధవ్‌కు, తెలంగాణ రాష్ట్ర కమిటీకి పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్నకు బాధ్యతలు అప్పగించారు. బుర్ర చిన్నన్న కూడా ఎన్‌కౌంటర్ కాగా.. తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సాంబశివుడు పోలీసులకు లొంగిపోయారు. కడారి రాములు, ఓబులేసులు సైతం ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా పనిచేస్తూ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. మరోవైపు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి జంపన్న అలియాస్ జీనుగు నర్సింహారెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు వరకు కూడా చంద్రన్న, జంపన్నలే పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా యాప నారాయణను నియమించారు. జగన్ అలియాస్ హరిభూషణ్‌ల పేరిట మూడున్నరేళ్లకుపైగా కొనసాగుతున్నారు. తాజా ఎన్‌కౌంటర్‌లో ఆయన మరణించినట్లు ప్రచారం జరుగుతోంది.
మూడేళ్ల కిందట గ్రేహౌండ్స్‌లోకి సుశీల్
మోమిన్‌పేట: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్‌కుమార్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్. ఆయన తల్లి శారదాకుమారి, తండ్రి విజయ్‌కుమార్ ఉద్యోగరీత్యా కొన్ని సంవత్సరాల క్రితం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లికి వచ్చారు. సుశీల్‌కుమార్ తల్లి శారద ఇక్కడ ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహించి రిటైర్‌అయ్యారు. సుశీల్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మేకవనంపల్లిలోనే చదువుకున్నారు. 6 నుంచి నుంచి 9వ తరగతి వరకు చిల్కూర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివి, 10వ తరగతి మేకవనంపల్లిలోనే పూర్తి చేశారు. సదాశివపేటలో ఇంటర్ పూర్తి చేసుకొని.. 2004లో సివిల్ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యారు. మూడేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై గ్రేహౌండ్స్ వెళ్లారు. నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. ఓ కూతురు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment